ఏదీ శాశ్వతం కాదు.. మనిషి తత్వమే మానవత్వం : సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth) చెప్పిన జీవిత సత్యాలు
శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది.
సంకల్పం ఉంటే ఎంతటి పనినైనా సాధించవచ్చు.
నువ్వు ఎక్కడి నుంచి నీ జీవితాన్ని మొదలుపెట్టావన్నది కాదు.. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అనేది నీ సామర్థ్యం
ఈ మాటలను మనం చాలాసార్లు వింటూ ఉంటాం. అంతేకాదు, మన అనుభవంలోకి కూడా ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటాయి. ఈ మాటలన్నింటికీ ఉదాహరణగా చెప్పుకోగలిగిన ఒకే ఒక వ్యక్తి సూపర్‌స్టార్ రజినీకాంత్ (Rajinikanth). సాధారణ బస్ కండక్టర్‌గా జీవితాన్ని ప్రారంభించిన శివాజీరావ్ గైక్వాడ్.. నేడు కోట్ల మంది అభిమానుల ఆరాధ్యదైవం సూపర్‌స్టార్ రజినీకాంత్‌గా ఎదిగి ఈ తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
పరిశ్రమకు వచ్చి 47 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ ప్రతి సినిమానీ మొదటి సినిమాగానే భావిస్తూ, అంతే శ్రద్ధ, ఆసక్తితో అభిమానులను అలరిస్తున్నారు. తన నటన, స్టైల్, సింప్లిసిటీ, హార్డ్‌వర్క్‌తో భారత చలనచిత్ర చరిత్రలో చెరగని ముద్ర వేశారు.
రజినీకాంత్ పేరు చెప్పగానే మొదటగా గుర్తొచ్చేది కల్మషం లేని చిరునవ్వు, మనసును హత్తుకునే పలకరింపు. ఆయనలోని ఈ గొప్ప లక్షణాలే పరిశ్రమలో సూపర్‌స్టార్‌గా నిలబెట్టాయి. సినిమాలతో వచ్చిన క్రేజ్, సంపాదించిన డబ్బులు.. ఏవీ తనకు సంతృప్తిని ఇవ్వబోవని, దైవారాధనలోనే మనసుకు ప్రశాంతత చేకూరుతుందని చెబుతుంటారు రజినీకాంత్. తరచూ హిమగిరుల దర్శనం చేసుకుంటూ ఆధ్యాత్మిక సాధన మనిషి జీవితంలో ఎంతో ముఖ్యమైనదని భావించే రజినీకాంత్ (Rajinikanth) చెప్పిన పలు జీవిత సత్యాలు.
భవిష్యత్తు మన చేతుల్లో..
‘‘నిన్న మనం చేసిన పనుల ఫలితాలనే ఈరోజు మనం అనుభవిస్తున్నాం. అదే విధంగా మనం ఈ రోజు చేసే పనులే రేపటిని నిర్ణయిస్తాయి. కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంటుంది’’ అంటూ చేసే పనిలో మంచి చెడులను గమనిస్తూ సాగాలని చెబుతుంటారు రజినీకాంత్ (Rajinikanth).
అద్భుతాలు జరుగుతాయి
‘‘ఒక సాధారణ బస్ కండక్టర్ ఈరోజు దేశంలోని గొప్ప వ్యక్తులతో వేదికను పంచుకుంటున్నారు” అంటూ తను ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారో చెప్పకనే చెప్పారు సూపర్‌స్టార్ (Rajinikanth)
మంచి వారికే పరీక్షలు..
‘‘దేవుడు చెడ్డవారికి డబ్బు, అధికారం, హోదా వంటి చాలా సౌకర్యాలను ఇచ్చినా చివరికి వారిని విఫలం చేస్తాడు. కానీ, మంచి వ్యక్తులను ఎన్ని రకాలుగా పరీక్షించినా, కష్టాలపాలు చేసినా ఎప్పటికీ ఓడిపోనివ్వడు” అంటూ స్థితిగతుల్లో ఎంత తేడా ఉన్నా చెడ్డవాళ్లు అసలైన విజయం సాధించలేరని, అంతిమ విజయం మంచివాళ్లదేనని అంటారు తలైవా (Rajinikanth).
అత్యాశ మంచిది కాదు..
‘‘మనం తినే ఆహారం శరీరంలో ఉండిపోతే ఆరోగ్యం పాడవుతుంది. అదే విధంగా మనం సంపాదించే డబ్బు జేబుల్లో ఉంటే జీవితం చెడిపోతుంది” అంటూ డబ్బే అన్నింటికీ ప్రధానం అని భావించకూడదని, అత్యాశకు పోయి అడ్డదారులు తొక్కడం మంచిదికాదని భావిస్తారు రజినీ (Rajinikanth).
కష్టం లేనిదే ఫలితం రాదు
‘‘కష్టపడకుండా ఎవరూ ఏదీ పొందలేరు. కష్టపడకుండా పొందినది ఎన్నటికీ నిలవదు” అంటూ కష్టం వల్ల పొందే ఫలితం ఇచ్చే ఆనందం, ఆత్మవిశ్వాసం మనిషికి తృప్తిని ఇస్తుందని చెబుతారు సూపర్‌స్టార్.
జీవితమే పెద్ద పరీక్ష
‘‘చదువు పాఠం నేర్పి పరీక్ష పెడితే.. జీవితం పరీక్ష పెట్టి పాఠం నేర్పిస్తుంది” అంటూ జీవితంలో ఎదుర్కొనే ఒడిదుడుకులు, కష్టనష్టాలు అన్నీ అనుభవంతోపాటు, సవాళ్లను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తాయని భావిస్తారు తలైవా (Rajinikanth).
అమ్మానాన్నే అన్నీ..
‘‘డబ్బు, అధికారం, ఖ్యాతి ఉన్న వాళ్ల కాళ్లపై పడకండి. అభిమానులు నా కాళ్లపై పడవద్దు. భగవంతుడు, అమ్మానాన్నల కాళ్లపై మాత్రమే పడాలి. ప్రాణమిచ్చిన వాడు దేవుడు, శరీరాన్నిచ్చిన వారు అమ్మానాన్న. వారి తరువాత పెద్దల కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు పొందవచ్చు. అంతేకానీ, డబ్బు, పదవులు, పేరు, అధికారం ఉన్నవారి కాళ్లపై పడాల్సిన అవసరం లేదు” అంటూ తల్లిదండ్రులే మొదట పూజించాల్సిన వారని అభిమానులకు పలుమార్లు చెబుతుంటారు రజినీకాంత్ (Rajinikanth).
ఇప్పటివరకు 168 సినిమాల్లో నటించిన రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్’గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఐశ్వర్యారాయ్ బచ్చన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు.
రమ్యకృష్ణ, ప్రియాంక మోహన్, శివ రాజ్‌కుమార్ కీలకపాత్రలు పోషిస్తున్న జైలర్ సినిమాను కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను 2023 ఏప్రిల్‌లో విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ సినిమా తర్వాత లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో సినిమాలు చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు రజినీ (Rajinikanth). కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించే సినిమాలో కూడా నటించనున్నట్టు తెలుస్తోంది.
Read More : కూతురు ఐశ్వర్య డైరెక్షన్‌లో సినిమా చేయనున్న రజినీకాంత్ (Rajinikanth).. కథ రెడీ అయ్యిందని టాక్