తాప్సీ పన్ను (Taapsee Pannu): తన కల నిజమైందని.. ఎగిరి గంతేస్తున్న సొట్ట బుగ్గల సుందరి
తన అందం, అభినయంతో విభిన్నమైన కథలు ఎంపిక చేసుకుంటూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతోంది తాప్సీ (Taapsee Pannu). కమర్షియల్ సినిమాలతోపాటు నిజజీవితాల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల్లో కూడా నటిస్తూ మంచి నటిగా పేరు తెచ్చుకుంటోంది ఈ భామ. ఈ క్రమంలోనే ఒక క్రేజీ ప్రాజెక్టులో చాన్స్ కొట్టేశానని, దీంతో చాలా సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న తన కల నెరవేరిందని ఎగిరి గంతేస్తోంది తాప్సీ.
ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్న ఆఫర్ తనకు వచ్చిందని తెగ సంబరపడిపోతోంది తాప్సీ. రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో ‘డంకీ’ సినిమాలో నటించే చాన్స్ దక్కించుకున్నానని తెలిపింది. "రాజ్‌కుమార్ హిరాణీ దర్శకత్వంలో నటించాలని చాలా రోజులుగా కలలు కంటున్నాను. ఈ కల ఇన్నాళ్లకు నిజమైంది. ఇప్పటికే 10 రోజులు షూటింగ్ కూడా పూర్తయ్యింది. 2023 క్రిస్‌మస్ కానుకగా ‘డంకీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది" అని చెప్పింది తాప్సీ. జియో స్టూడియోస్, రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్, రాజ్‌కుమార్ హిరాణీ ఫిల్మ్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
ప్రస్తుతం కమర్షియల్ కథలతోపాటు, నిజజీవిత కథలకు ఆదరణ పెరుగుతోంది. అందుకే కొంతకాలంగా వరుసపెట్టి ప్రముఖుల జీవితకథల ఆధారంగా చిత్రాలు తెరకెక్కుతున్నాయి. తాము ఎంతగానో ఆరాధించే, అభిమానించే వ్యక్తుల నిజజీవిత విశేషాలను తెరమీద చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తి చూపుతున్నారు. దాంతో దర్శక,నిర్మాతలు కూడా అలాంటి కథలపైనే దృష్టి సారిస్తున్నారు.
ఇక, ప్రస్తుతం తాప్సీ ‘శభాష్ మిథూ’ అనే స్పోర్ట్స్ డ్రామా సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. భారత క్రికెట్ మహిళా జట్టు కెప్టెన్ ‘మిథాలీ రాజ్’ జీవిత కథ ఆధారంగా ‘శభాష్ మిథు’ చిత్రం తెరకెక్కింది. శ్రీజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తాప్సీ మిథాలీరాజ్ పాత్రలో నటించింది. వియాకామ్ 18 స్టూడియోస్ నిర్మించిన శభాష్ మిథులో విజయ్ రాజ్ కూడా ఉన్నారు.
ఇదివరకే ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ మంచి ఆదరణ దక్కించుకోవడంతో సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు పెరిగాయి. ఈ క్రమంలో చిత్రబృందం విడుదల తేదీని ప్రకటించింది. ఈ చిత్రాన్ని జూలై 15న పాన్ ఇండియా సినిమాగా విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.
భారత క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్‌గా తన రాబోయే చిత్రం ‘శభాష్ మిథు’ జూలై 15న థియేటర్లలోకి రానుందని బాలీవుడ్ స్టార్ తాప్సీ పన్ను శుక్రవారం ప్రకటించింది. జిత్ ముఖర్జీ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ప్రియా అవెన్ కథ సహకారం అందించారు. ఈ సినిమా మిథాలి రాజ్ జీవితంలోని హెచ్చు తగ్గులు, ఎదురుదెబ్బలు, ఆనందభరిత క్షణాలను చూపుతుంది. మిథాలి రాజ్ పాత్రను పోషించిన తాప్సీ పన్ను ఈ చిత్రం విడుదల తేదీని ట్విట్టర్‌లో పంచుకున్నారు.
‘కలలు కంటూ వాటిని సాకారం చేసుకునేందుకు.. ప్రణాళిక ఉన్న అమ్మాయి కంటే శక్తివంతమైనది మరొకటి లేదు! ఈ 'జెంటిల్‌మెన్ గేమ్'లో తన బ్యాట్‌తో పాటు, తన కలను వెంబడించిన అలాంటి ఒక అమ్మాయి కథ ఇది. 15 జూలై 2022న మీ ముందుకొస్తోంది..’ అంటూ తాప్సీ తన పోస్ట్‌లో తెలిపింది.
కోవిడ్ మహమ్మారి సమయంలో తాప్సీ పన్ను (Taapsee Pannu) ‘హసీన్ దిల్ రుబా’, ‘అన్నాబెల్లె సేతుపతి’, ‘రష్మీ రాకెట్’, ‘లూప్‌లపేట’ తదితర నాలుగు సినిమాలలో నటించినా.. అవి వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యాయి.