Anya’s Tutorial Review: థ్రిల్లింగ్‌గా రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్‌ ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్

Updated on Jul 01, 2022 10:21 AM IST
ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్స్‌’ వెబ్‌ సిరీస్‌ పోస్టర్
ఆహా ఓటీటీలో స్ట్రీమ్‌ అవుతున్న ‘అన్యాస్ ట్యుటోరియల్స్‌’ వెబ్‌ సిరీస్‌ పోస్టర్

 కరోనా లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీలకు డిమాండ్ బాగా పెరిగింది. ఓటీటీలకు పెరిగిన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పంచేందుకు  ప్రముఖ ఓటీటీ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. అందులో భాగంగానే వరుస వెబ్‌ సిరీస్‌లను తెరకెక్కిస్తున్నాయి. వెబ్‌ సిరీస్‌లకు దక్కుతున్న ఆదరణ కారణంగా వరుస సీజన్‌లను రిలీజ్ చేస్తూ సిరీస్‌లపై క్రేజ్‌ను మరింతగా పెంచేస్తున్నారు మేకర్స్.

తెలుగు ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా రియాలిటీ షోలు, వెబ్‌ సిరీస్‌లను ముందుకు తెస్తోంది ప్రముఖ ఓటీటీ  ‘ఆహా’. అందులో భాగంగానే తాజాగా ‘అన్యాస్ ట్యుటోరియల్’ అనే వెబ్‌ సిరీస్‌ను మన ముందుకు తెచ్చింది. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ సిరీస్‌లో హీరోయిన్‌ రెజీనా కసాండ్రా, నివేదితా సతీష్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రైమ్, హారర్, థ్రిల్లర్‌‌గా తెరకెక్కిన ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్‌ జూలై 1 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది.

‘అన్యాస్ ట్యుటోరియల్స్‌’ వెబ్‌ సిరీస్‌లో రెజీనా కసాండ్రా

కథేంటంటే : చిన్నప్పటి నుంచి అక్క (రెజీనా కసాండ్రా) చేసే పనులతో విసిగిపోతుంది చెల్లి లావణ్య (నివేదితా సతీష్). ఈ క్రమంలోనే కొంచెం పెద్దైన తర్వాత అక్క నుంచి దూరంగా ఉంటూ ఆన్‌లైన్‌లో (ఇన్‌స్టాగ్రామ్‌) బ్యూటీ టిప్స్‌ చెప్పే వెబ్‌ పేజ్‌ను స్టార్ట్‌ చేస్తుంది. దాని పేరే ‘అన్యాస్‌ ట్యుటోరియల్’. అయితే దానిని అక్క వ్యతిరేకిస్తుంది. దాంతో ఇంటి నుంచి బయటికి వచ్చేసిన చెల్లి.. ఊరికి దూరంగా ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ రెంట్‌కు తీసుకుంటుంది.

అపార్ట్‌మెంట్‌లో ఒంటరిగా ఉంటూ ‘అన్యాస్ ట్యుటోరియల్‌’ ద్వారా బ్యూటీ టిప్స్ చెప్పడం స్టార్ట్‌ చేస్తుంది లావణ్య. బ్యూటీ టిప్స్ చెప్పడం స్టార్ట్ చేసిన మొదటి రోజే తన వెనుక ఎవరో ఉన్నారని, వెనక్కి తిరిగి చూడాలని ఇన్‌స్టాలో తనను ఫాలో అవుతున్న వాళ్లు మెసేజ్‌లు పెడతారు. ఆ రోజు జరిగిన సంఘటనతో కేవలం ఒక్క రోజులోనే తన పేజీకి వ్యూయర్‌‌షిప్‌ విపరీతంగా పెరిగిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అసలు నివేదితను వెనక్కి చూడాలని అందరూ ఎందుకు చెప్పారు? తన పేజీని ఒక్కరోజులోనే  అంతమంది సబ్‌స్క్రైబ్‌ చేసుకోవడానికి కారణం ఏంటి? సైబర్‌‌ ప్రపంచంలోకి హార్రర్‌‌ అంశాలు ఎలా వచ్చాయి? అన్యాస్ ట్యుటోరియల్‌ను ఫాలో అవుతున్న వాళ్లు చనిపోవడానికి కారణం ఏంటి? అనే ఆసక్తికర విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్‌ సిరీస్ చూడాల్సిందే.

నివేదితా సతీష్, రెజీనా కసాండ్రా

ఎలా ఉంది : క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్‌‌ సిరీస్‌ కావడంతో సాధారణంగానే మనకి కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. ఆ అంచనాలను కొంత వరకు దర్శకుడు చేరుకున్నా.. కథ చాలా వరకు ఇద్దరి చుట్టూనే తిరగడంతో అక్కడక్కడా కొంచెం బోర్‌‌ కొడుతుంది. అదే సమయంలో తర్వాత ఏం జరగబోతోంది అనే ఆసక్తి కూడా పెరుగుతుంది. సస్పెన్స్‌ను కొనసాగించడంలో డైరెక్టర్‌‌ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఇక, సిరీస్‌ స్టార్‌‌ అయిన వెంటనే ఏ మాత్రం లేట్‌ చేయకుండా తను చెప్పాలనుకున్న విషయంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు దర్శకుడు. అది కొంతవరకు బాగున్నా.. ఏం జరిగింది..ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి.. అనే విషయాలను కథ మధ్యలో చెప్పడం కొంత ఇబ్బందిగా అనిపించింది. సిరీస్ ఆసక్తిగా నడుస్తున్న సమయంలో చిన్ననాటి విషయాలు చెప్పడం ఆసక్తిని కొంత దెబ్బతీశాయి. మిగిలిన వాళ్లు ఉన్నా రెజీనా, నివేదితా మధ్య జరిగే సీన్ల ముందు వాళ్ల క్యారెక్టర్లు ఆసక్తిని రేకెత్తించలేకపోయాయి. మొత్తానికి క్రైమ్, సస్పెన్స్, హర్రర్ థ్రిల్లర్లను ఎంజాయ్ చేసే వాళ్లకు ‘అన్యాస్ ట్యుటోరియల్’ తప్పకుండా నచ్చుతుంది.

‘అన్యాస్ ట్యుటోరియల్స్‌’ వెబ్‌ సిరీస్‌లో నివేదితా సతీష్

ఎవరెలా చేశారంటే..

ఫస్ట్‌ ఫ్రేమ్‌ నుంచి చివరి ఫ్రేమ్‌ వరకు క్యారెక్టర్‌‌లో ఇన్వాల్వ్‌ అయ్యి చేశారు నివేదితా సతీష్‌. ఇక, రెజీనా కసాండ్రా యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఏ క్యారెక్టర్‌‌ అయినా చేసే సత్తా ఉందని రెజీనా ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. మిగిలిన వాళ్లు ఉన్నా వాళ్ల క్యారెక్టర్లకు సిరీస్‌లో నటించే స్కోప్‌ అంతగా ఇవ్వలేదు. ఇక, డైరెక్టర్ పల్లవి గంగిరెడ్డికి ఇది మొదటి వెబ్‌ సిరీస్. అయినా చాలా ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నట్టుగానే కథను ఆసక్తిగా తెరకెక్కించారు. సైబర్‌‌ ప్రపంచంలోకి హర్రర్‌‌ను తీసుకొచ్చే విధానంతో సౌమ్య శర్మ అందించిన కథ బాగుంది. ‘అన్యాస్ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్‌ నివేదితా సతీష్‌ వన్‌ విమెన్‌ షో అనే చెప్పాలి.

ప్లస్‌ పాయింట్స్ : రెజీనా, నివేదితా యాక్టింగ్, బ్యాక్‌ గ్రౌండ్ మ్యూజిక్, ఎడిటింగ్, కెమెరా  

మైనస్ పాయింట్స్ : కొన్ని క్యారెక్టర్లు ఏమయ్యాయో చివరి వరకూ రివీల్ చేయకపోవడం, సస్పెన్స్‌కు పూర్తిగా తెరపడేలా చివరిలో క్లారిటీ ఇవ్వకపోవడం.

ప్రొడ్యూసర్స్ : అర్కా మీడియా వర్క్స్, ఆహా

డైరెక్టర్ : పల్లవి గంగిరెడ్డి

స్టోరీ : సౌమ్య శర్మ

మ్యూజిక్ : అరోల్‌ కొర్రేలి

జోనర్ : క్రైమ్, హర్రర్, సస్పెన్స్, థ్రిల్లర్

ఎపిసోడ్స్‌ : 7

భాషలు : తెలుగు, తమిళం

స్ట్రీమింగ్‌ : ఆహా ఓటీటీ

తేదీ : 01 జూలై 2022 నుంచి

రేటింగ్ : 3 / 5

 

Read More : ‘అన్యాస్‌ ట్యుటోరియల్’ వెబ్ సిరీస్‌తో భయపెడతానంటున్న రెజీనా కసాండ్రా (Regina Cassandra).. ఆహాలో జూలై 1 నుంచి

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!