MOVIE REVIEW : యువతను ఆకట్టుకునే వినూత్న ప్రయత్నం.. అల్లు శిరీష్ (Allu Sirish) ‘ఊర్వశివో రాక్షసివో’ !

Updated on Nov 04, 2022 09:21 PM IST
అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా శుక్రవారం విడుదలైంది
అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా శుక్రవారం విడుదలైంది

సినిమా : ఊర్వశివో రాక్షసివో

న‌టీన‌టులు : అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్, వెన్నెల కిషోర్‌, ఆమ‌ని, పోసాని కృష్ణముర‌ళి

సంగీతం : అచ్చు రాజమణి

నిర్మాణం : ధీరజ్ మొగిలినేని, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, విజ‌య్‌.ఎం

దర్శకుడు: రాకేష్ శశి

విడుద‌ల‌ తేదీ : 04–11–2022

రేటింగ్ : 3 / 5

అల్లు శిరీష్ (Allu Sirish).. అల్లు వారి కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో. అల్లు అర్జున్ తమ్ముడిగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్న వ్యక్తి. యూత్‌కు దగ్గరయ్యేలా విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ సెలెక్టెడ్‌గా సినిమాలు చేస్తుంటారు శిరీష్. 2013లో గౌరవం సినిమాతో హీరోగా మారారు. చాలా రోజుల తర్వాత ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమాతో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయ్యారు శిరీష్. ఈ సినిమా నవంబర్‌‌ 4వ తేదీన థియేటర్లలో విడుదలైంది.

అల్లు శిరీష్ (Allu Sirish), అను ఇమ్మాన్యుయేల్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా శుక్రవారం విడుదలైంది

క‌థ ఏంటంటే : శ్రీకుమార్ (అల్లు శిరీష్‌) మిడిల్‌ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కుర్రాడు. సింధూజ (అను ఇమ్మాన్యుయేల్‌) అమెరికాలో ప‌ని చేసి భారత్‌కు తిరిగొచ్చిన అమ్మాయి. ఇద్దరూ ఒకే సాఫ్ట్‌వేర్ కంపెనీలో ప‌నిచేస్తుంటారు. సింధూజపై మ‌న‌సు పారేసుకుంటాడు శ్రీకుమార్‌. ఆధునిక భావాలున్న ఆమె కూడా త‌క్కువ స‌మ‌యంలోనే శ్రీకుమార్‌‌కు చేరువవుతుంది. ఫిజికల్‌గా కూడా ఇద్దరూ ఒక్కటైన తర్వాత సింధూజను ప్రేమిస్తున్నానని చెప్తాడు శ్రీకుమార్. అయితే సింధూజ మాత్రం ప్రేమించడంలేదని చెప్తుంది.  ప్రేమ లేకుండా శ్రీకుమార్‌‌కు సింధూజ ఎందుకు దగ్గరైంది? స‌హ‌జీవ‌నం చేయాల్సిన ప‌రిస్థితి ఏర్పడిన‌ సమయంలో ఏం చేశారు?  అసలు వాళ్లిద్దరికీ పెళ్లి జరిగిందా.. లేదా ? అనే విషయాలు తెలియాలంటే మాత్రం ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే : యంగ్ జనరేషన్‌కు బాగా కనెక్ట్‌ అయ్యే కథ. ఫిజికల్ రిలేషన్, ప్రేమ‌, క‌ల‌లు, ల‌క్ష్యాలు, స‌హ‌జీవ‌నం, పెళ్లి త‌దిత‌ర విష‌యాలను ఆసక్తికరంగా చూపించారు దర్శకుడు రాకేష్‌ శశి.  క‌థ కొత్తదేమీ కాదు. అయినా సినిమాలో కావలసినంత కామెడీతో ఎంటర్‌‌టైన్‌ చేస్తూనే.. ఎమోషనల్‌గా కూడా ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలో కొంత నెమ్మదిగా సాగుతున్నట్టు అనిపించినా.. హీరోహీరోయిన్లు కలిసిన తర్వాత కథలో వేగం పెరుగుతుంది. సాఫ్ట్‌వేర్ కంపెనీ, ఇద్దరి మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు, ఫ్యామిలీ తదితర అంశాలతో ఫస్టాఫ్‌ అంతా సరదాసరదాగా అయిపోతుంది. ఓటీటీ, వెబ్‌సిరీస్‌ల గురించి చెబుతూ వెన్నెల కిషోర్‌‌ చేసే కామెడీ, క్రికెట్‌తో పోలుస్తూ సునీల్ చేసే హంగామా  ప్రేక్షకులను ఎంటర్‌‌టైన్ చేస్తాయి. మనం ఊహించినట్టుగానే కథ సాగుతున్నప్పటికీ కామెడీ సీన్ల కారణంగా ఎక్కడా బోర్ ఫీలింగ్ కలగదు.

రొమాంటిక్ సీన్లు కొంచెం ఎక్కువగానే ఉన్నట్టుగా అనిపిస్తాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌ ఉన్నప్పటికీ పెద్దగా ఇబ్బందికరంగా అనిపించవు. ఇక, సినిమా క్లైమాక్స్‌లో పెద్దగా ట్విస్ట్‌లు, పెద్ద పెద్ద యాక్షన్ సీన్లు లేకపోవడం నిరాశగానే అనిపించినా.. వినోదాత్మక సినిమా చూసిన అనుభూతి మాత్రం కలుగుతుంది.

ఎవ‌రి నటన ఎలా ఉందంటే : మ‌ధ్య త‌ర‌గతి కుటుంబానికి చెందిన కుర్రాడి క్యారెక్టర్‌‌లో అల్లు శిరీష్‌ (Allu Sirish) ఒదిగిపోయారు. ఒక‌ప‌క్క త‌ల్లిదండ్రుల‌కి, మ‌రోప‌క్క ప్రేమించిన అమ్మాయికి మ‌ధ్య న‌లిగిపోయే కుర్రాడిగా చ‌క్కగా నటించాడు. ముఖ్యంగా కామెడీ సన్నివేశాల్లో శిరీష్‌ టైమింగ్ ఆక‌ట్టుకుంటుంది. హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయేల్‌తో క‌లిసి నటించిన సీన్లలో కెమిస్ట్రీ బాగుంది. భావోద్వేగాలు, హావ‌భావాల విష‌యంలో మ‌రింత‌ శ్రద్ద పెట్టాలనిపిస్తుంది. అను ఇమ్మాన్యుయేల్ నటన సినిమాకి హైలైట్‌. ఆధునిక‌, స్వతంత్ర భావాలున్న యువ‌తి పాత్రలో ఒదిగిపోయారు. వెన్నెల కిషోర్‌, సునీల్‌, పోసాని నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏం లేదు. వారివారి క్యారెక్టర్లకు న్యాయం చేశారు. అచ్చు- అనూప్ సంగీతం బాగుంది.

ప్లస్ పాయింట్లు : కామెడీ, ఫస్టాఫ్‌, మ్యూజిక్

మైనస్ పాయింట్లు : తరువాత ఏం జరుగుతుందనే ఉత్కంఠ లేకపోవడం, కొన్నిచోట్ల నెమ్మదిగా సాగిన కథ

ఒక్క మాటలో.. యూత్‌కు నచ్చే కథతో ‘ఊర్వశివో రాక్షసివో’
 

Read More : EXCLUSIVE : కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె (Raghu Kunche)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!