EXCLUSIVE : కష్టాన్ని కూడా ఇష్టపడాలి.. అదే నా విజయ రహస్యం : సంగీత దర్శకుడు రఘు కుంచె (Raghu Kunche)

Updated on Nov 05, 2022 04:00 PM IST
యాంకర్‌‌గా, సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా టాలెంట్‌ నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)
యాంకర్‌‌గా, సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా టాలెంట్‌ నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

యాంకర్, డబ్బింగ్ ఆర్టిస్ట్, గేయ రచయిత, సింగర్, మ్యూజిక్ డైరెక్టర్, యాక్టర్.. ఇలా బహుముఖ పాత్రలు పోషిస్తూ తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న మల్టీ టాలెంటెడ్ సెలబ్రిటీ రఘు కుంచె (Raghu Kunche).

ఒక వైపు సినిమా పాటలకు బాణీలు అందిస్తూనే.. తన ప్రైవేట్ ఆల్బమ్స్‌తోనూ మ్యూజిక్ లవర్స్‌ను అలరిస్తున్నారు. దేశవిదేశాల్లో కొన్ని వందల స్టేజీ షోలు చేస్తూ, తెలుగు వారి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకూ చాటుతున్నారు. మరో వైపు నటనలోనూ రాణిస్తున్నారు. వివిధ విభాగాల్లో అయిదు సార్లు నంది అవార్డు అందుకున్న ఘనత ఆయనది. 

విలక్షణమైన పాత్రలతో మెప్పిస్తున్న రఘు కుంచె, ఇటీవల విడుదలైన 'రుద్రవీణ' సినిమాలోని నటనకుగాను విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్నారు. 

ప్రేక్షకులను మెప్పించే కథతో అతి త్వరలోనే హీరోగానూ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే, ఎప్పుడూ బిజీగా ఉండాలని.. అప్పుడే మనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని చెప్పే సంగీత దర్శకుడు రఘు కుంచె గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ పింక్‌విల్లా పాఠకుల కోసం..

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

నమస్తే.. రఘు గారు..! ఎలా ఉన్నారు ?

బాగున్నాను.

సింగింగ్‌, మ్యూజిక్ డైరెక్షన్, నటన.. ఇన్ని పనులను ఎలా మేనేజ్ చేస్తున్నారు?

మనం మనకు ఇష్టపడే పనిని చేయాలని భావించినప్పుడు, అందుకు సమయాన్ని ప్రత్యేకంగా కేటాయించాల్సిన అవసరం లేదు. నాకు ఖాళీగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉండడానికే ప్రయత్నిస్తుంటాను. పాటలు పాడటం, మ్యూజిక్ కంపోజ్ చేయడం, నటించడం అన్నీ నాకు ఇష్టమైన పనులే. అందుకే వీటన్నింటినీ ఎంజాయ్ చేస్తూ ముందుకు సాగిపోతున్నాను.

మీ బాల్యం, చదువు, కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి ?

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి దగ్గరలోని గాదరాడ నేను పుట్టిన ఊరు. నా స్కూల్ చదువు మొత్తం గాదరాడ, కోరుకొండ ప్రాంతాలలోనే సాగింది. ఎస్‌కేవీటీ కాలేజీలో గ్రాడ్యుయేషన్‌ చేశాను. ఆ తర్వాత తెలుగు యూనివర్సిటీలో బీఏ పూర్తి చేశాను. మా అమ్మ గారు స్వర్గస్థులయ్యారు. నాన్న గారు ఇప్పటికీ గాదరాడలోనే ఉంటారు.  ప్రస్తుతం భార్య, ఇద్దరు పిల్లలతో నేను హైదరాబాద్‌లోనే ఉంటున్నాను.

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

సంగీతంపై ఇష్టం మీకు ఎప్పటి నుంచి మొదలైంది? పాటలు పాడడం,

మ్యూజిక్ కంపోజ్ చేయడం.. ఈ రెండింటిలో మీకు బాగా ఇష్టమైనది ఏది?

చిన్నప్పటి నుంచే నాకు సంగీతం అంటే చాలా ఇష్టం. రాజమండ్రిలోని ఆనం కళాకేంద్రంలో జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో అప్పుడప్పుడు పాటలు పాడేవాడిని. దాదాపు ఏ పనినైనా సరే, నేను ఇష్టంతోనే చేస్తాను. అయితే గాయకుడిగానే నాకు ఎక్కువ పేరు వచ్చింది. కనుక పాటలు పాడడానికే ఎక్కువగా ఇష్టపడతాను.

మీ అభిమాన నటీ నటులు ఎవరు ? ఇండస్ట్రీలో మీకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తి  ఎవరు?

మెగాస్టార్ చిరంజీవి గారు నా అభిమాన నటుడు. నాకే కాదు.. ఇండస్ట్రీలో చాలా మందికి ఆయనే ఆరాధ్యుడు. టాలెంట్ ఉన్న వాళ్లను ప్రోత్సహించే వ్యక్తి కూడా. అలాగే శ్రీదేవి గారి నటన నాకు ఎంతో ఇష్టం.

చిరంజీవి గారిని మొదటిసారి కలిసినప్పుడు ఆయన చెప్పిన మాటలు ఎప్పటికీ మరచిపోలేను. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా.. చిరంజీవి గారి వద్దకు నన్ను ఓ ఫ్రెండ్ తీసుకెళ్లి పరిచయం చేశారు.

‘రఘు నాకు తెలియకపోవడం ఏమిటి ? ఆయన యాంకరింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం’ అన్నారు చిరంజీవి గారు. అంతేకాదు, ఒక ఫంక్షన్‌కు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు, వాళ్ల అమ్మ గారు కూడా నన్ను ఎంతో ప్రశంసించారు.

ఇక దర్శకుల విషయానికి వస్తే, పూరీ జగన్నాథ్‌ గారి వర్కింగ్ స్టైల్ నాకు చాలా ఇష్టం. వర్కింగ్ స్టైల్‌లో ఆయనే నాకు ఇన్‌స్పిరేషన్. ఒక వ్యక్తిని, చేసే పనిని జగన్‌ బాగా గౌరవిస్తారు. చేసే పని నచ్చితే ఏ విధంగా ప్రోత్సహిస్తారో, నచ్చకపోతే అంతే నెమ్మదిగా చెప్తారు.

అంతేగానీ నొప్పించేలా మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడరు. ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఎలా ఉన్నారో.. స్టార్ డైరెక్టర్ అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు.

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

మీ అభిమాన సంగీత దర్శకుడు ఎవరు ? ఎవరు మీకు పోటీ అనుకుంటున్నారు?

ఇళయరాజా, ఏఆర్ రెహ్మాన్ .. వీరిద్దరూ నాకు ఇష్టమైన గొప్ప సంగీత దర్శకులు. అలాగే యువన్ శంకర్‌‌ రాజా మ్యూజిక్ అంటే కూడా బాగా ఇష్టపడతాను. ఆయన కంపోజ్ చేసే బాణీలు కొత్తగా అనిపిస్తాయి. ఇండస్ట్రీలో ఎవరి టాలెంట్ వాళ్లదే. అలాగే ఎవరికి దక్కాల్సిన అవకాశాలు వాళ్లకే దక్కుతాయి. అంతేకానీ ఒకరికి ఒకరు పోటీ అనేదానిని నేను నమ్మను. అలాగే ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం గారంటే చాలా గౌరవం.

ఇండస్ట్రీకి రాకపోయి ఉంటే ఏ రంగంలో స్థిరపడేవారు? మీకు ఇష్టమైన వృత్తి ఏది?

రచయిత మధుబాబు గారి నవలలు ఎక్కువగా చదివేవాడిని. అవన్నీ డిటెక్టివ్ నేపథ్యంలో సాగే రచనలు. ఆ నవలల్లోని క్యారెక్టర్లు నాకు బాగా నచ్చేవి. వాటి ప్రేరణతోనే పోలీస్ ఆఫీసర్‌‌ కావాలని అనుకునేవాడిని. ఎస్‌ఐ యూనిఫామ్ వేసుకుని, కోరుకొండలో డ్యూటీ చేయాలని కలలు కనేవాడిని. ఇప్పటికీ నాకు పోలీస్ యూనిఫామ్ వేసుకోవాలనే పిచ్చి అలాగే ఉంది. సినిమాల్లో పోలీస్ క్యారెక్టర్ చేసి ఆ తృష్ణ తప్పక తీర్చుకుంటాను.

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

 

పలాస, రుద్రవీణ సినిమాల్లో మీ నటనకు మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం మీరు చేస్తున్న సినిమాలు ఏమిటి?

ప్రస్తుతం 9 సినిమాలు చేస్తున్నాను. ఒక సినిమాలో హీరోగా కూడా చేస్తున్నాను. కొన్ని నిజ జీవిత ఘటనల ఆధారంగా తెరకెక్కుతోంది ఆ చిత్రం. ఈ సినిమా కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లోనే ఈ సినిమా షూటింగ్‌ జరిగే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం సంగీత దర్శకుడిగా కూడా మూడు ప్రాజెక్టులకు సైన్ చేశాను.

మీరు విదేశాల్లో చాలా స్టేజీ షోలు చేస్తుంటారు కదా! ఇంతకీ మీకు ఇష్టమైన ప్రదేశం ఏది?

విదేశాలలో నేను చాలా స్టేజ్ షోలు చేశాను. ఈ క్రమంలో చాలా దేశాలను సందర్శించాను. అయితే న్యూయార్క్‌ నా ఫేవరెట్ ప్రాంతం. టైమ్స్‌ స్క్వేర్ దగ్గర లభించే ప్రశాంతత, ప్రపంచంలో ఎక్కడా దొరకదని అనిపిస్తుంది. న్యూయార్క్‌లో నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. తెలుగు వాళ్లు ఎక్కడ ఉంటే అక్కడ సందడి వాతావరణం నెలకొంటుంది.

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

మ్యూజిక్ డైరెక్టర్‌‌గా మొదటి సినిమాకే నంది అవార్డు అందుకున్నారు? ఎలా అనిపించింది?

ఇప్పటివరకు మొత్తం 5 నంది అవార్డులు లభించాయి. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా, సింగర్‌‌గా, యాంకర్‌‌గా, మ్యూజిక్‌ డైరెక్టర్‌‌గా, అలాగే 'జీవకారుణ్యం' అనే డాక్యుమెంటరీలోని నటుడిగా ఈ  అవార్డులు అందుకున్నాను. ఇక మ్యూజిక్ డైరెక్టర్‌‌గా నేను చేసిన మొదటి సినిమా 'బంపర్‌‌ ఆఫర్'. ఆ సినిమాలో "ఎందుకే రమణమ్మ' పాట పాడినందుకు ఉత్తమ గాయకుడిగా స్పెషల్ జ్యూరి విభాగంలో నంది అవార్డు వచ్చింది.

ప్రస్తుతం ఇండస్ట్రీలో వచ్చిన మార్పులేమిటి? అప్పటి పరిశ్రమకు.. ఇప్పటి పరిశ్రమకు మధ్యనున్న తారతమ్యాన్ని మీరు ఏం గమనించారు?

ఒకప్పుడు టాలెంట్‌ ఉన్నా, ఒక గ్రూప్‌లో ఉంటేనే అవకాశాలు దక్కేవి. కానీ ప్రస్తుతం ఇండస్ట్రీకి వస్తున్న కొత్త తరం యువకులు, గ్రూపుల్లో కలవడానికి ఇష్టపడరు. నా అదృష్టం ఏంటంటే కొత్త డైరెక్టర్లకు కూడా నేను నచ్చుతున్నాను. పలాస తర్వాత మంచి అవకాశాలు వస్తున్నాయి. సత్యదేవ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కృష్ణమ్మ’ సినిమాలో కూడా  ఓ విభిన్నమైన పాత్ర పోషిస్తున్నాను. 

యాంకర్‌‌గా వచ్చి సింగర్‌‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పేరు తెచ్చుకుని నటుడిగా కూడా తన టాలెంట్‌ను నిరూపించుకుంటున్నారు రఘు కుంచె (Raghu Kunche)

జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలనుకొనే వారికి మీరిచ్చే సలహా ఏమిటి ?

ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి. అనవసరమైన మాటలతో సమయాన్ని వృథా చేసుకోకూడదు. ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగిపోవాలి. అదే మనల్ని విజయతీరాలకు చేరుస్తుందని నమ్మాలి. ఇప్పటికీ, ఎప్పటికీ.. నేను నమ్మేది, అనుసరించేది అదే. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. ఆ కష్టాన్ని కూడా ఇష్టపడాలి. ఇదే నా విజయ రహస్యం.

థాంక్యూ రఘు గారు.. ఆల్‌ ది బెస్ట్‌ ఫ్రమ్‌ పింక్‌విల్లా

 

Read More : Special Story : అందం మాటున దాగిన అంతులేని బాధలు.. విధిని ఎదిరించిన నటీమణులు (Heroines)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!