Movie Review : రివెంజ్ డ్రామాతో మాస్ ప్రేక్షకులను అలరించే యాక్షన్ మూవీ ‘రణస్థలి’.
సినిమా : రణస్థలి
నటీనటులు: ధర్మ, అమ్ము, అభిరామి, చాందిని రావు
నిర్మాతలు : అనుపమ సురెడ్డి, విష్ణు సురెడ్డి
దర్శకత్వం : పరశురామ్ శ్రీనివాస్
విడుదల తేదీ: 26-11-2022
రేటింగ్ : 3 / 5
విడుదలకు ముందే ట్రైలర్, టీజర్, ఫస్ట్‌గ్లింప్స్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న ‘రణస్థలి’ సినిమా ఈరోజే(నవంబర్ 26) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురెడ్డి విష్ణు సమర్పణలో ఏ.జె ప్రొడక్షన్ పతాకంపై అనుపమ సురెడ్డి నిర్మించిన చిత్రం ’రణస్థలి’. పరశురామ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా ధర్మ, అమ్ము అభిరామి, చాందిని రావు నటించారు. సహాయ నటులు ప్రశాంత్, శివ జామి, అశోక్ సంగా, నాగేంద్ర , విజయ్ రాగం కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందే హైప్ క్రియేట చేసిన ఈ సినిమా ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.
కథ ఏంటంటే?
బసవ(ధర్మ), అమ్ములు(చాందినీ రావు) ఇద్దరూ బావామరదళ్ళు. చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అమ్ములు బసవ ఇంట్లోనే పెరుగుతుంది. ధర్మ తండ్రి మున్నియ్య(సమ్మెట గాంధీ) వీరిద్దరికీ పెళ్లి చేస్తాడు. ఇంతలో బసవకి ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. ఉద్యోగంలో చేరడానికి ఆరు నెలల గడువు ఉంటుంది. ఆ సమయంలో ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పనిచేసి డబ్బులు సంపాదించి అప్పులు తీర్చాలనుకుంటాడు బసవ. ఈ క్రమంలో అతను చక్రవర్తి(బెనర్జీ) అనే పెద్దమనిషి వద్ద పనికి చేరతాడు.
అయితే ఒకరోజు చక్రవర్తి తోటలో పనిచేయడం కోసం నలుగురు పనివాళ్ళు వస్తారు. వీళ్ళకు బస ఏర్పాటు చేయమని చక్రవర్తి.. బసవ, అమ్ములుకి చెబుతాడు. నిజానికి వచ్చింది పని వాళ్ళు కాదు మర్డర్లు చేసే కిరాయి గుండాలు. వాళ్ళ గురించి బసవకి తెలిసేలోపే వాళ్లు చక్రవర్తి, అమ్ములుని చంపేస్తారు. మరోపక్క సుదర్శన్(ప్రశాంత్ పాండు), ఈశ్వరి(అమ్ము అభిరామి) దంపతులకు కూడా బసవ శత్రువు అవుతాడు. అసలు ఆ గుండాలు ఎందుకు చక్రవర్తిని, అమ్ములుని చంపేశారు? వాళ్ళను ఎవరు పంపించారు? ఈశ్వరి, సుదర్శన్‌లతో చక్రవర్తి, అమ్ములు, బసవకి సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
ఒకే ఇంట్లో పెరిగిన బావామరదళ్ల కథతో చాలా సినిమాలే తెరకెక్కాయి. అయితే ఈ సినిమాలో జోడించిన యాక్షన్ ఎలిమెంట్స్ చాలా ప్లస్ అయ్యాయి. దర్శకుడు పరశురామ్ శ్రీనివాస్ తాను అనుకున్న పాయింట్ ను ఎంగేజింగ్ గా యాక్షన్ ఎపిసోడ్స్ తో చెప్పడంలో సక్సెస్ అయ్యాడు. ముఖ్యంగా క్లైమాక్స్ ను తీర్చిదిద్దిన విధానానికి అందరూ ఫిదా అయిపోవడం ఖాయం. అయితే కథ కంటే యాక్షన్‌పైనే దర్శకుడు ఎక్కువ దృష్టి పెట్టాడనిపిస్తుంది. ఒక సీన్ తర్వాత ఒకటి సాగిపోతాయి కానీ కథలో ప్రేక్షకుడిని లీనమయ్యేంతగా ప్రేరేపించవు.
ఎవరెలా నటించారంటే?
బసవ పాత్రలో ధర్మ చాలా బాగా నటించాడు. యాక్షన్ సన్నివేశాల్లో స్టార్ హీరోలా పెర్ఫార్మ్ చేశాడు. అమ్ములు పాత్ర చేసిన చాందినీ రావు చాలా చక్కగా చేసింది. అమ్ము అభిరామి కూడా తన పరిధి మేరకు చక్కగా చేసింది. సమ్మెట గాంధీ హీరో తండ్రి పాత్రలో జీవించేశాడు. విలన్‌గా చేసిన శివ తన పెర్ఫార్మన్స్‌తో అదరగొట్టాడు. బెనర్జీ, చంద్ర శేఖర్, మధు మణి, శ్రీనివాస్ వెట్టి, ప్రశాంత్ పాండు వంటి వారు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సినిమా చివర్లో వచ్చే ట్విస్ట్‌లు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. ఈ సినిమాకి క్లైమాక్స్ ప్రాణం అని చెప్పుకోవచ్చు .స్క్రీన్ ప్లే కూడా ఎక్కడా బోర్ కొట్టదు. దర్శకుడు తర్వాత ఫైట్ మాస్టర్ డ్రాగన్ ప్రకాష్ గురించి చెప్పుకోవాలి. యాక్షన్ ఎపిసోడ్స్‌ను ఇతను తీర్చిదిద్దిన విధానం మెప్పిస్తుంది. కెమెరామెన్ జాస్టి బాలాజీ కూడా మంచి పనితనం చూపించాడు. కేశవ్ కిరణ్ సంగీతంలో రూపొందిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అద్భుతం అనే చెప్పాలి. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ : నటీనటుల ఎంపిక, ైక్లెమాక్స్, యాక్షన్ సన్నివేశాలు
మైనస్ పాయింట్స్ : కథ సాగే తీరు
ఒక్క మాటలో : యాక్షన్ ప్రేమికులను అలరించే రణస్థలి.
Read More : ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన టాప్10 డాన్స్ మూవ్‌మెంట్స్