సినీ సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన ‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మ (Mani Sharma) బర్త్‌డే స్పెషల్

Updated on Jul 11, 2022 09:58 PM IST
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Mani Sharma)
మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ (Mani Sharma)

‘సాహసం శ్వాసగా’ అంటూ యువతలో స్ఫూర్తి నింపినా.. ‘అమ్మాయే సన్నగా’ పాటతో యూత్‌ను ఉర్రూతలూగించినా.. ‘నీ నవ్వుల తెల్లదనాన్ని’ అని హీరోయిన్ల అందాన్ని వర్ణించినా.. ‘యమహా నగరి కలకత్తా పురి’ అనే పాటతో సంగీత ప్రియులను అలరించినా.. మణిశర్మకే (Mani Sharma) చెల్లింది. సినిమాల్లో పాటలకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ ప్రయారిటీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌‌కు ఉంటుంది. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేసి ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంలో దిట్ట. అభిమానులంతా ‘మెలోడీ బ్రహ్మ’గా పిలుచుకునే మణిశర్మ పుట్టినరోజు నేడు.. ఈ సందర్భంగా ఆయన సినిమాలు, వ్యక్తిగత జీవితంపై ఓ లుక్ వేద్దాం.

మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా, మణిశర్మ

సినీ ప్రయాణం..

1964, జూలై 11వ తేదీన ఆంధ్రప్రదేశ్​ మచిలీపట్నంలో పుట్టారు మణిశర్మ. ఆయన అసలు పేరు యనమండ్ర వేంకట సుబ్రహ్మణ్య శర్మ. 1992లో తన సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టారు మణిశర్మ. 100కు పైగా సినిమాలకు సంగీతం అందించారు. సంగీత దర్శకులు చెళ్లపిళ్ల సత్యం దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌‌గా పనిచేశారు. తర్వాత ఇళయరాజా, ఎంఎం కీరవాణి, రాజ్‌ కోటి దగ్గర శిష్యరికం చేశారు.  

రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన రాత్రి సినిమాలో బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌తో కెరీర్‌‌ను ప్రారంభించారు మణిశర్మ. వర్మ దర్శకత్వంలో వచ్చిన అంతం సినిమాలోని ‘చలెక్కి ఉందనుకో.. ఈ చలాకి రా చిలకో’ ఆయన స్వరపరచిన మొదటిపాట. అనంతరం రామానాయుడు నిర్మించిన సూపర్‌‌ హీరోస్‌తో మణి.. పూర్తిస్ధాయి సంగీత దర్శకుడిగా మారారు.

1992 నుంచీ..

1992వ సంవత్సరంలో మొదలైన మణిశర్మ సినీ ప్రయాణం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఈ సుదీర్ఘ ప్రయాణంలో ఎన్నో సూపర్‌‌ హిట్‌ సినిమాలకు సంగీతాన్ని అందించారు మణి. పలు సినిమాలకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌ చేసి సినీ ప్రేక్షకులను అలరించారు. మెగాస్టార్ చిరంజీవి నుంచి సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు సినిమాల వరకు దాదాపుగా అందరి సినిమాలకూ సూపర్‌‌హిట్‌ మ్యూజిక్ అందించారు మణిశర్మ.

మెగాస్టార్ చిరంజీవితో మణి శర్మ (Mani Sharma)

మెగాస్టార్ సినిమాలకు..

చిరంజీవి హీరోగా వచ్చిన ‘చూడాలని ఉంది’ సినిమాలో మణి స్వరపరిచిన పాటలు ఇప్పటికీ వినసొంపుగానే ఉంటాయి. ఆ తర్వాత బావగారూ బాగున్నారా, ఇద్దరు మిత్రులు, అన్నయ్య, ఇంద్ర, మృగరాజు, ఠాగూర్, అంజి, జై చిరంజీవ, స్టాలిన్ సినిమాలకు స్వరాలు అందించి మెగాస్టార్ అభిమానులను అలరించారు. చాలాకాలం తర్వాత ఆచార్య సినిమాకు సంగీతాన్ని అందించారు. ఆ సినిమాలోని పాటలు సూపర్‌‌హిట్ అయ్యాయి.

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబుతో మణి శర్మ (Mani Sharma)

మహేష్‌బాబు సినిమాల్లో..

సూపర్‌‌స్టార్ మహేష్‌బాబు హీరోగా అరంగేట్రం చేసిన రాజకుమారుడు సినిమాకు సంగీతం అందించారు మణి. ఆ తర్వాత వరుసగా వంశీ, మురారి, బాబీ, టక్కరి దొంగ, ఒక్కడు, అతడు, అర్జున్, పోకిరి, అతిథి, ఖలేజా సినిమాలకు సంగీతం అందించారు. వీటిలో నాలుగు సినిమాలు సూపర్‌‌ డూపర్‌‌ హిట్‌ అయ్యాయి. అంతేకాకుండా ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద కూడా కాసులు కురిపించాయి.

ఎస్‌ఎస్‌ థమన్, దేవి శ్రీ ప్రసాద్‌తో మణి శర్మ (Mani Sharma)

ఆయన శిష్యులే..

ప్రస్తుతం టాలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ దర్శకులుగా ఫుల్ స్వింగ్‌లో ఉన్న దేవి శ్రీ ప్రసాద్, ఎస్‌ఎస్‌ థమన్‌.. మణిశర్మ దగ్గర శిష్యరికం చేసిన వారే. కొన్నాళ్లుగా మణిశర్మ మ్యూజిక్‌కు స్వింగ్ తగ్గిందని అనుకుంటున్న వాళ్లందరికీ తన మ్యూజిక్‌తోనే సమాధానం చెప్పార. పూరీ జగన్నాథ్‌ – రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్‌ శంకర్‌‌ సినిమాకు సంగీతాన్ని అందించి మరో సూపర్‌‌హిట్‌ను అందుకున్నారాయన. తన మ్యూజిక్‌లో ఏ మాత్రం పదును తగ్గలేదని మరోసారి నిరూపించుకునేలా ఆచార్య సినిమాకు బాణీలు సమకూర్చారు మణిశర్మ.

మణిశర్మ సంగీతం అందిస్తున్న కొత్త సినిమాలు

మరోసారి నమ్ముకున్న డైరెక్టర్లు..

ఇస్మార్ట్ శంకర్‌‌ సినిమాతో ఫామ్‌లోకి వచ్చిన మణిశర్మకు మరోసారి భారీ అవకాశాలే వచ్చాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ తెరకెక్కిస్తున్న పాన్‌ ఇండియా సినిమా ‘లైగర్’. ఈ సినిమాపైనే ప్రస్తుతం ఆశలన్నీ పెట్టుకున్నారు పూరీ. అందుకేనేమో ఈ సినిమా మ్యూజిక్ బాధ్యతను మణిశర్మకు అప్పగించారు.

ఇక, గుణశేఖర్‌‌ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు కూడా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

మణిశర్మకు అవార్డులు వచ్చిన సినిమాలు

మణిశర్మ సంగీతం అందించిన పలు సినిమాలు

వెంకటేష్‌ హీరోగా నటించిన ‘ప్రేమించుకుందాం…రా’ సినిమాలో మూడు పాటలకు స్వరకల్పన చేశారు.

బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, చెన్నకేశవరెడ్డి, సీమసింహం సినిమాలకు మణి బాణీలు అందించారు. 

రాంచరణ్‌ మొదటి సినిమా ‘చిరుత’తోపాటు రచ్చ, జూనియర్ ఎన్టీఆర్‌‌ మొదటి బ్లాక్‌బస్టర్ హిట్‌ సినిమా ‘ఆది’తోపాటు శక్తి, అల్లు అర్జున్‌ కెరీర్‌‌లో వన్‌ ఆఫ్‌ ది బెస్ట్‌ మ్యూజికల్‌ ఎంటర్‌‌టైనర్లలో ఒకటైన ‘పరుగు’ సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్‌‌గా పనిచేశారు మణిశర్మ.

మణిశర్మ (Mani Sharma) సినీ సంగీత ప్రయాణంలో మరెన్నో సూపర్‌‌హిట్ సినిమాలకు బాణీలు అందించారు. తెలుగుతోపాటు తమిళ, హిందీ భాషల సినిమాలకు కూడా మణి సంగీతం చేశారు. మరిన్ని మధురమైన పాటలు, బాణీలు, రాగాలతో సినీ, సంగీత అభిమానులను సంగీత సాగరంలో విహరించేలా మరిన్ని స్వరాలు సమకూర్చాలని కోరుకుందాం.

కొన్ని అవార్డులు

‘చూడాలని ఉంది’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్‌ అవార్డుతోపాటు నంది అవార్డు

‘చిరునవ్వుతో’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది

‘ఒక్కడు’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా నంది, ఫిలిం ఫేర్‌ పురస్కారాలు

‘అతడు’ సినిమాకు ఉత్తమ సంగీత దర్శకుడిగా ఫిలిం ఫేర్‌కు నామినేట్

Read More : 2022 సెకండాఫ్‌లో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నున్న టాలీవుడ్ (Tollywood) సినిమాలు.. వెయిటింగ్‌లో ఫ్యాన్స్‌

 
 
58 సంవత్సరాలు పూర్తి చేసుకుని 59వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా
‘మెలోడీ బ్రహ్మ’ మణిశర్మకు పింక్‌విల్లా తరఫున హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.
 
Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!