మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజాకు (Ilayaraja) అరుదైన గౌరవం.. రాష్ట్రపతి కోటాలో రాజ్యసభ సీటు
మ్యూజికల్ మ్యాస్ట్రో ఇళయరాజాకు (Ilayaraja) మరో అరుదైన గౌరవం దక్కింది. సినీ సంగీతానికి ఆయన చేసిన సేవను గుర్తించి ఇప్పటికే పలు అవార్డులు ఆయనను వరించాయి. ఆయన సేవలకు గాను పద్మభూషణ్, పద్మవిభూషణ్ బిరుదులు ఇచ్చి ఇళయరాజాను సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఇళయరాజాకు రాజ్యసభ సీటు కేటాయించింది. రాష్ట్రపతి కోటాలో ఆయనను రాజ్యసభకు ఎంపిక చేసినట్టు ప్రకటించింది. ఈ విషయాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా ఇళయరాజాకు లభించిన అవార్డుల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం..
1977వ సంవత్సరంలో మురళీమోహన్ హీరోగా తెరకెక్కిన ‘భద్రకాళి’ సినిమాతో సంగీత దర్శకుడిగా టాలీవుడ్‌లో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఇళయరాజా (Ilaiyaraaja).. వయసు పిలిచింది, గురు, బాల నాగమ్మ, సీతాకోక చిలుక, టిక్ టిక్ టిక్, తీర్పు, నిరీక్షణ, అభిలాష, సాగర సంగమం, ఛాలెంజ్, స్వాతి ముత్యం, రాక్షసుడు, శ్రీ షిర్డీ సాయిబాబా మహాత్మ్యం, ఆరాధన, నాయకుడు, రజినీకాంత్ ప్రధాన పాత్రలో వచ్చిన దళపతి, ఘర్షణ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన రుద్రవీణ, గీతాంజలి, ప్రేమ, శివ, జగదేక వీరుడు అతిలోక సుందరి, విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన చంటి, శ్రీ రామరాజ్యం, ఎటో వెళ్లిపోయింది మనసు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తన పాటలతో చెరగని ముద్ర వేసుకున్నారు ఇళయరాజా.
ఇళయారాజకు దక్కిన పలు అవార్డులు..
- ఇళయరాజాను తమిళనాడు సీఎం కరుణానిధి ‘ఇసై జ్ఞాని’ (సంగీత జ్ఞాని) బిరుదుతో సత్కరించారు.
- తమిళనాడు సర్కారు ప్రతిష్టాత్మకంగా ఇచ్చే కలైమామణి పురస్కారం అందుకున్నారు ఇళయరాజా.
- 2010లో పద్మభూషణ్, 2018లో పద్మవిభూషణ్ పురస్కారాలతో భారత ప్రభుత్వం ఇళయరాజాను గౌరవించింది.
- భారతదేశ సినీ సంగీతానికి ఇళయరాజా చేసిన సేవలకుగాను 2012లో సంగీత నాటక అకాడమీ పురస్కారం, 2014లో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి నేషనల్ ఎమినెంట్స్ పురస్కారం, 2015లో గోవాలో జరిగిన 46వ ‘ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’లో జీవితకాల సాఫల్యతకు సెంటినరీ అవార్డు అందుకున్నారు
- 1984వ సంవత్సరంలో సాగరసంగమం, 1986లో సింధు భైరవి, 1989లో రుద్రవీణ, 2010లో కేరళ సినిమా పజ్ఞస్సి రాజా సినిమాల్లో సంగీతానికిగాను ఉత్తమ సంగీత దర్శకుడిగా నాలుగు సార్లు జాతీయ అవార్డులు ఇళయరాజాను వరించాయి.
- 2004లో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, తమిళనాడు, కేరళ ప్రభుత్వాలు కూడా రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను ఇళయరాజాకు బహూకరించి గౌరవించాయి.
- 1994వ సంవత్సరంలో ది వరల్డ్ యూనివర్సిటీ రౌండ్ టేబుల్, ఆరిజోనా, అమెరికా కల్చరల్ డాక్టరేట్‌ను ఇళయరాజాను బహూకరించింది.
- 1994లో అన్నామలై యూనివర్సిటీ, 1996లో మదురై కామరాజ్ యూనివర్సిటీలు కూడా గౌరవ డాక్టరేట్‌తో ఇళయరాజాను గౌరవించాయి.
- ఇళయరాజా సంగీతం అందించిన ‘ఎ బ్యూటిఫుల్ బ్రేక్ అప్’ అనే ఇంగ్లీష్ సినిమాలోని బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు 2022లో ఆమ్‌స్టర్ డ్యామ్ ఇంటర్నేషనల్ అవార్డు లభించింది. ఇవే కాకుండా ఇళయరాజా (Ilayaraja)కు పలు అవార్డులు దక్కాయి.
Read More : మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సినిమాలో ఐటమ్ సాంగ్ చేయనున్న తమన్నా భాటియా!