Kaithi Sequel: కోలీవుడ్ హీరో కార్తీ (Karthi) నటించిన 'ఖైదీ' సీక్వెల్ పై క్లారిటీ.. షూటింగ్ ఎప్పటి నుంచి అంటే?
టాలీవుడ్ హీరోలతో సమానంగా తెలుగులో క్రేజ్ తెచ్చుకున్న తమిళ నటుడు కార్తీ (Hero Karthi). ఆయన కెరీర్‌లో ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోతుంది లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఖైదీ' (Kaithi) మూవీ.
'నా పేరు శివ', 'ఊపిరి' లాంటి సినిమాల తర్వాత, సరైన సక్సెస్ లేక తెలుగు మార్కెట్‌లో ఇబ్బంది పడిన కార్తీకి 'ఖైదీ' ఎంత పెద్ద బ్రేక్ ఇచ్చిందో తెలిసిందే. 2019లో వచ్చిన ఈ సినిమా తెలుగు డిస్ట్రిబ్యూటర్‌లకు కూడా మంచి లాభాలను తెచ్చిపెట్టింది.
ఈ నేపథ్యంలో 'ఖైదీ' (Kaithi Sequel) సినిమాకు సీక్వెల్ ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా సెకండ్ పార్టు గురించి క్లైమాక్స్ సమయంలోనే హింట్ ఇవ్వడంతో, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
అయితే, ఈ సీక్వెల్ ఎప్పుడు మొదలవుతుంది అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. 'ఖైదీ' తరవాత లోకేష్, కార్తీ తమ తర్వాతి ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడం వల్ల ఈ సీక్వెల్ కాస్త ఆలస్యమవుతూ వస్తోంది.
ఇక కార్తీ చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలున్నాయి. అందులో ‘విరుమన్’ (Viruman) ఒకటి. ముత్తయ్య ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 12న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ ప్రమోషన్‌లను షురూ చేశారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో కార్తీ.. 'ఖైదీ' సీక్వెల్ గురించి కూడా ప్రస్తావించాడు. ప్రస్తుతం లోకేశ్ కనగరాజ్, విజయ్ ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడనీ, ఆ తరువాత 'ఖైదీ' సీక్వెల్ ఉంటుందని పేర్కొన్నాడు.
లోకేశ్ దర్శకత్వంలో ఇటీవలే వచ్చిన 'విక్రమ్' (Vikram Movie) మంచి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించాక.. 'ఖైదీ 2' మీద అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఆ సినిమాలో కమల్ హాసన్ (Kamal Haasan), సూర్య లాంటి బడా హీరోలు ఉన్నప్పటికీ... కార్తీ గొంతు కూడా వినిపించి సినిమాపై అంచనాలు పెంచేశాడు దర్శకుడు. దీంతో 'ఖైదీ పార్ట్ 2'లో ఈ ముగ్గురు హీరోలు కలుస్తారనే ఫీలింగ్ ప్రేక్షకులకు కలిగింది.
మరోవైపు ఈ రెండు సినిమాలు, వేర్వేరు సీక్వెల్స్‌తో వస్తాయా లేక హాలీవుడ్ తరహాలో (మల్టీ యునివర్స్ టైపులో) థ్రిల్ చేస్తాయా అనేది ఇప్పుడే చెప్పలేం.
ఇక, హీరో కార్తీ విషయానికి వస్తే.. ‘యుగానికి ఒక్కడు’ సినిమా నుంచి గతేడాది విడుదలైన ‘సుల్తాన్’ (Sultan Movie) వరకు ఈయన నటించిన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదలవుతూ వస్తోంది. ఈయన సినిమాలకు టాలీవుడ్ టైర్ 2 హీరోల సినిమాలకున్నంత క్రేజ్ ఉంది.
అంతే కాకుండా, కార్తీ అప్పుడప్పుడు తెలుగు రాష్ట్రాలలో ఇంటర్వూలు కూడా ఇస్తున్నారు. కార్తి ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా, ఇక్కడి అభిమానులతో తెలుగులోనే మాట్లాడటంతో.. ఆయన తెలుగు ప్రేక్షకులలో మరింత అభిమానాన్ని సంపాదించుకున్నాడు.