Suriya & Karthi : వీరుమన్ సినిమా ఈవెంట్‌లో సూర్య, కార్తిల మధ్య నవ్వుల హంగామా .. సిసలైన అన్నదమ్ముల అనుబంధం ఇదే !

Updated on Aug 06, 2022 02:19 PM IST
ఖాకీ, ఖైదీ, ఊపిరి లాంటి సినిమాలతో కార్తి (Karthi) నటనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ లభించింది.
ఖాకీ, ఖైదీ, ఊపిరి లాంటి సినిమాలతో కార్తి (Karthi) నటనకు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ లభించింది.

తమిళ నటుడు కార్తి (Karthi) హీరోగా నటిస్తున్న 'వీరుమన్' (Viruman) చిత్రం త్వరలోనే విడుదల కానుంది. నిన్నే ఈ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం మధురైలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కార్తి సోదరుడు సూర్య (Suriya) ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సూర్య ఆడిటోరియంలోకి రాగానే ప్రేక్షకులు "రోలెక్స్ సర్" అంటూ గట్టిగా అరిచారు. 

'విక్రమ్' చిత్రంలో సూర్య పోషించిన రోలెక్స్ (Rolex) పాత్రకు మంచి ప్రశంసలు లభించిన సంగతి తెలిసిందే. నిన్నే మధురైలో జరిగిన 'వీరుమన్' ఆడియో ఫంక్షనులో సూర్య తన సోదరుడు కార్తితో కలిసి ఫోటోలు దిగుతుండగా.. అది అభిమానులకు అసలైన కన్నుల పండువగా మారింది. దీంతో ఫ్యాన్స్ రెచ్చిపోయారు. అరుస్తూ గొడవ చేశారు. ఈ క్రమంలో సూర్య అభిమానులను ఉద్దేశించి మాట్లాడారు. కాస్త ఓపికగా ఉండమని కోరారు. 

తెలుగు రాష్ట్రాలలోనూ ఈ బ్రదర్స్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే

తర్వాత సూర్య (Suriya) మాట్లాడుతూ "దయచేసి దిల్లీకి చెప్పండి.. రోలెక్స్ ఏం చేయాలో" అని నవ్వుతూ ప్రశ్నించారు. దానికి కార్తి బదులిస్తూ "ఏం చేయవద్దని చెప్పండి" అన్నారు. కార్తి గతంలో 'ఖైదీ' చిత్రంలో 'దిల్లీ' అనే పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. 

ఈ పాత్రకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ చిత్ర డబ్బింగ్ వెర్షన్ యూట్యూబ్ ద్వారా విడుదల అవ్వగా.. ఉత్తరాది వారిని కూడా ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది. 

రోలెక్స్ సర్ వర్సెస్ దిల్లీ

నిన్న ఈవెంట్‌లో సూర్య కాసేపు తన అభిమానులతో ముచ్చటించారు. 'దిల్లీకి, రోలెక్స్‌కి మధ్య ఫైట్ జరిగితే చూడాలని అనుకుంటున్నారా ? అది స్క్రీన్ మీద సాధ్యమవుతుందో లేదో గానీ.. ఇంట్లో మాత్రం ఎప్పుడూ మాకిద్దరికీ అదే పని' అంటూ సూర్య ఈ సభలో అభిమానుల కేరింతల మధ్య నవ్వుతూ తన మదిలోని మాటని తెలిపారు. 

తర్వాత కార్తి (Karthi) ఇన్‌స్టాగ్రామ్‌లో తన సోదరుడు సూర్యతో దిగిన ఫోటోలను పోస్టు చేశారు. కార్తితో పాటు సూర్యకి కూడా తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. వీరు నటించిన సినిమాలు తెలుగులో కూడా సూపర్ హిట్ అవుతుంటాయి. 

కార్తి నటించిన ఖాకీ, ఖైదీ చిత్రాలు ఆంధ్ర, తెలంగాణలో కూడా రికార్డు స్థాయి కలెక్షన్లు నమోదు చేశాయి. అలాగే సూర్య నటించిన ప్రతీ చిత్రానికి తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ వస్తుంటాయి.

Read More: "నెపోటిజం"తో కాదు.. ప్రేక్ష‌కుల మ‌న‌సులు నెగ్గి ఉత్త‌మ న‌టుడైన హీరో సూర్య !

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!