అరుదైన వ్యాధితో బాధపడుతున్న ‘జాతిరత్నాలు’ డైరెక్టర్.. ఆ డిజార్డర్‌పై మూవీ తీస్తానంటున్న అనుదీప్ (Anudeep Kv)

Updated on Nov 03, 2022 06:57 PM IST
హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నానని అనుదీప్ కేవీ (Anudeep Kv) చెప్పారు
హైలీ సెన్సిటివ్ పర్సన్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నానని అనుదీప్ కేవీ (Anudeep Kv) చెప్పారు

టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనుదీప్ కేవీ (Anudeep Kv) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘జాతిరత్నాలు’ (Jathi Ratnalu) మూవీతో తెలుగు నాట ఈ దర్శకుడు సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. కొవిడ్ కారణంగా థియేటర్లకు ప్రేక్షకులు మొహం చాటేసిన వేళ.. ‘జాతిరత్నాలు’ సినిమా ఎంత పెద్ద హిట్టుగా నిలిచిందో తెలిసిందే. రొడ్డకొట్టుడు కామెడీకి తావివ్వకుండా తనదైన హాస్యంతో ఆడియెన్స్‌ను బిగ్ స్క్రీన్స్‌కు రప్పించారు అనుదీప్.  

థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వేలా చేయడంలో అనుదీప్ కేవీ ఫుల్ సక్సెస్ అయ్యారు. అందుకే ఆడియెన్స్ రిపీటెడ్‌గా థియేటర్లకు వచ్చారు. దీంతో చిన్న సినిమాగా, ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ‘జాతిరత్నాలు’ రికార్డు స్థాయి కలెక్షన్లను సాధించింది. దీంతో అనుదీప్ ఓవర్‌నైట్ పాపులర్ అయ్యారు. ఆయనతో చిత్రాలు తీసేందుకు నిర్మాతలు క్యూ కట్టారు. కానీ మరో వినూత్న సబ్జెక్ట్‌తో అనుదీప్ ప్రేక్షకుల ముందుకొచ్చారు.

అనుదీప్ దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘ప్రిన్స్’ (Prince Movie). ఈ మూవీ ఇటీవలే దీపావళి పండుగకు రిలీజై.. ఓ మోస్తరు విజయాన్ని సాధించింది. సినిమాపై ఆడియెన్స్ నుంచి మిశ్రమ స్పందనలు వచ్చాయి. కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ నటించిన ‘ప్రిన్స్’ చిత్రంలో అనుదీప్ మార్క్ వినోదం బాగానే పండింది. అయితే కొన్ని చోట్ల మాత్రం వర్కవుట్ కాలేదు. కొన్ని జోకులు పెద్దగా పేలలేదు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు అనుదీప్ చెప్పారు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటిస్తూ ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. 

ఏదైనా పండ్ల రసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుందని అనుదీప్ కేవీ (Anudeep Kv) చెప్పారు

కాఫీ తాగితే రెండు రోజులు నిద్రపట్టదు

హైలీ సెన్సిటివ్ పర్సన్ (హెచ్ఎస్‌పీ) అనే డిజార్డర్ తనకు ఉందని అనుదీప్ కేవీ అన్నారు. ‘ప్రతి ఒక్కరిలో ఏదో ఒక డిజార్డర్ లక్షణాలు సాధారణంగా ఉంటాయి. కానీ దాన్ని వారు అర్థం చేసుకోలేరు. నా శరీరంలో చోటు చేసుకున్న కొన్ని మార్పుల వల్ల ఈ వ్యాధిని గుర్తించా. నాకు గ్లూటెన్ పడదు. కాఫీ తాగితే రెండు రోజుల పాటు నిద్రపట్టదు. ఏదైనా పండ్ల రసం తాగితే మెదడు పనితీరు ఆగిపోతుంది. మైండ్ అంతా బ్లాంక్ అవుతుంది. ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదు. అయితే ఈ వ్యాధి ఉన్న వారి సెన్సెస్ చాలా సమర్థందా పని చేస్తాయి’ అని అనుదీప్ చెప్పుకొచ్చారు. 

పక్కా సినిమా తీస్తా

హైలీ సెన్సిటివ్ పర్సన్ వ్యాధి ఉన్నవారు చాలా తొందరగా అలసిపోతారని అనుదీప్ తెలిపాడు. ‘ఎక్కువ కాంతివంతమైన లైట్స్‌, ఘాటైన వాసనలు చూసినా వాటి తీవ్రతను నేను తట్టుకోలేను. చాలా ఇబ్బంది పడతా. దీని గురించి శాస్త్రీయంగా ఎక్కడా నిరూపించబడలేదు. ఈ వ్యాధిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యాధి లక్షణాలు ఉన్నవారు ఎలాంటి ఆహారం తీసుకోవాలనేది పరిశోధించి అవే పాటిస్తున్నాను’ అని అనుదీప్ కేవీ పేర్కొన్నారు. తనకు ఉన్న వ్యాధిపై భవిష్యత్తులో సినిమా తీస్తానని.. దాని వల్ల కొందరైనా హీల్‌ అవతారని ఆశిస్తున్నానని తెలిపారు. 

Read more: Avatar 2 Trailer: విజువల్ వండర్‌గా ‘అవతార్ 2’ మూవీ ట్రైలర్.. కట్టిపడేస్తున్న పండోరా గ్రహంలోని విజువల్స్!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!