S. Shankar: శంకరా మజాకా!!!.. ఒకటి కాదు రెండు సినిమాలు ఒకేసారి తెరకెక్కిస్తారా?.
తమిళ దర్శకుడు శంకర్ (S. Shankar) సామాజిక సమస్యలను ప్రధానాంశాలుగా తీసుకొని, సినిమాలను తెరకెక్కిస్తుంటారు. ప్రస్తుతం తెలుగు హీరో రామ్ చరణ్ కథానాయకుడిగా 'ఆర్‌సీ 15' చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మరోవైపు, విశ్వనటుడు కమల్ హాసన్ నటించిన 'భారతీయుడు' సినిమాకు సీక్వెల్ కూడా ఈయన డైరెక్షన్‌లోనే పట్టాలెక్కనుంది.
అయితే ఇటు రామ్ చరణ్.. అటు కమల్ హాసన్‌తో దర్శకుడు శంకర్, ఒకేసారి సినిమాలు తీసేందుకు సిద్ధమవుతున్నారట. ఈ మధ్య ఇటువంటి గుసగుసలే ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఈ స్థితికి రామ్‌చరణ్, కమల్ హాసన్ ఒప్పుకుంటారా?. మరి లైకా ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థ ఏమంటుంది? లాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రామ్, కమల్ ఒప్పుకుంటారా?
కమల్ హాసన్ చిత్రం 'భారతీయుడు'కి సీక్వెల్‌గా వస్తున్న 'ఇండియన్ 2' సినిమాను లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే శంకర్ తాము అనుకున్న సమయానికి 'ఇండియన్ 2' సినిమాను తెరకెక్కించడం లేదంటూ గతంలో లైకా ప్రొడక్షన్స్ ఆరోపించింది. ఈ క్రమంలో కోర్టును ఆశ్రయించింది.
అయితే శంకర్ తరఫు న్యాయవాది మాత్రం 'ఇండియన్ 2' చిత్రానికి విదేశీ సాంకేతిక నిపుణుల డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే షూటింగ్ ఆలస్యమైందని వాదించారు. ప్రస్తుతం 'ఇండియన్ 2' నిర్మాణానికి చిక్కులు తొలిగిపోవడంతో శంకర్ కమల్ సినిమాను మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శంకర్ ఏం చేయనున్నారో!
కమల్ హాసన్ ఇటీవలే ఈ విషయం పై స్పందించారు. దర్శకుడు శంకర్ టాలీవుడ్ నటుడు రామ్ చరణ్‌తో 'ఆర్‌సీ 15' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని.. ఆ సినిమా పూర్తి అయిన తర్వాతే తన సినిమా 'ఇండియన్ 2'ను మొదలు పెడతారని తెలిపారు. ఒకవేళ శంకర్ రెండు సినిమాలను ఒకేసారి భుజాన ఎత్తుకుంటే.. కమల్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.
ఇక ''ఆర్‌సీ 15' షూటింగ్ పూర్తి అయిన తర్వాతే, శంకర్ 'ఇండియన్ 2' సినిమా షూటింగ్‌ను ప్రారంభించాలని రామ్ చరణ్ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ 'ఆర్.ఆర్.ఆర్', 'ఆచార్య' చిత్రాలలో ఒకే సమయంలో నటించి అలసిపోయారు. ఆ ఎఫెక్ట్ 'ఆచార్య' మీద పడి ఫలితమేంటో స్పష్టంగా కనిపించింది. అందుకే 'ఆర్‌సీ 15' చిత్రాన్ని శంకర్ పూర్తి చేసిన తర్వాతే.. 'ఇండియన్ 2' సినిమాను తెరకెక్కించాలని రామ్ అభిమానులు కోరుతున్నారు.
ఇక కమల్ హాసన్ నటించిన 'విక్రమ్' (Vikaram) సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ కావడంతో.. లైకా ప్రొడక్షన్స్ 'ఇండియన్ 2' సినిమాను త్వరగా పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తోంది. ఇదే క్రమంలో 'ఇండియన్ 2' చిత్రానికి సంబంధించిన న్యాయపరమైన చిక్కులను కూడా పరిష్కరించుకుంది.
కనుక ఇప్పుడు శంకర్ కచ్చితంగా 'ఇండియన్ 2' సినిమా షూటింగ్‌ను మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. 'ఆర్‌సీ 15', 'ఇండియన్ 2'.. ఈ రెండు సినిమాలు శంకర్‌కు ఓ సవాల్‌గా మారనున్నాయని మాత్రం అనిపిస్తోంది. దర్శకుడు శంకర్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
Read More : ఆర్‌సీ 15 (RC 15) : సీఎం పాత్రలో రామ్ చరణ్ (Ram Charan)!.. హైదరాబాద్‌లో ఓట్లు లెక్కిస్తున్న శంకర్!!