ఈ రోజు కోసమే నేను ఎదురు చూశా!.. ‘పుష్ప 2’ (Pushpa 2) అస్సలు తగ్గేదేలే: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)
యువ కథానాయకుడు అల్లు శిరీష్ (Allu Sirish) నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఈనెల 4న ఆడియెన్స్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వచ్చేసింది. ఇందులో శిరీష్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. వసూళ్లలోనూ ‘ఊర్వశివో రాక్షసివో’ దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో మూవీ యూనిట్ సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ సినిమా తమ కుటుంబానికి చాలా ప్రత్యేకమన్నారు. ఇది తమకు ఎప్పటికీ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుందన్నారు.
నా సినిమా హిట్టయినా ఇంత సంతోషపడను
‘నా సినిమా హిట్ అయినా కూడా నేను ఇంత ఆనంద పడను. నా తమ్ముడు శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’ (‘Urvasivo Rakshasivo’)తో హిట్ కొట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు కోసమే నేను ఎదురు చూశా. ఈ చిత్రానికి ఆర్ట్ వర్క్‌తోపాటు కెమెరా, ఎడిటింగ్, సంగీతం ఇలా అన్నీ కరెక్టుగా కుదిరాయి. సునీల్, వెన్నెల కిశోర్, అనూ ఇమ్మాన్యుయేల్ ముగ్గురూ బాగా చేశారు. శిరీష్ గురించి మాట్లాడే సమయం కోసం నేను వెయిట్ చేస్తూ వస్తున్నాను. అలాంటి ఒక సందర్భం, ఇప్పుడు వచ్చింది. నా సినిమా హిట్టయినా నేను ఇంత సంతోషించను’ అని అల్లు అర్జున్ చెప్పారు.
‘ఈ సినిమా విడుదలకు ముందే శిరీష్ గురించి చెబితే, తమ్ముడు కాబట్టి చెబుతున్నాడు అనుకుంటారు. హిట్ అయిన తరువాత తన ఎఫర్ట్ గురించి నేను మాట్లాడొచ్చు. తను చాలా బాగా చేశాడని అందరూ చెబుతూ ఉంటే హ్యాపీగా ఉంది. ఇక ‘పుష్ప 2’ గురించి నేను ఒక అప్‌డేట్ ఇస్తా. ‘పుష్ప’లో ‘తగ్గేదే లే’ అన్నాను.. ‘పుష్ప 2’లో మాత్రం ‘అస్సలు తగ్గేదేలే’ అనేలా ఉంటుంది’ అని బన్నీ పేర్కొన్నారు.
బన్నీ తమ్ముడిలా పుట్టడం అదృష్టం
అల్లు శిరీష్ మాట్లాడుతూ.. అరవింద్ గారి అబ్బాయిగా పుట్టడం తన అదృష్టమన్నారు. బన్నీ అన్న తనను ఓ తమ్ముడిలా కాకుండా కొడుకులా చూస్తారని తెలిపారు. తన తమ్ముడిగా పుట్టడం అదృష్టమని పేర్కొన్నారు. ఈ వేడుకలో దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత ఎస్‌కేఎన్, నటుడు సునీల్ తదితరులు పాల్గొన్నారు.