‘గాడ్‌ఫాదర్’ (GodFather) సినిమా ఒక నిశ్శబ్ద విస్ఫోటనం: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన సినిమా రిలీజ్ అవుతోందంటే పండుగ వాతావరణం నెలకొంటుంది. అటువంటిది విజయ దశమి పండుగ రోజునే చిరు సినిమా రిలీజ్ అవుతోందంటే.. మెగా అభిమానులతోపాటు సినీ ప్రేమికులకు కూడా డబుల్ ధమాకా అనే చెప్పాలి. ఆచార్య తర్వాత చిరంజీవి నటిస్తున్న సినిమా గాడ్‌ఫాదర్ (GodFather). అది సినిమా పేరు మాత్రమే కాదు.. టాలీవుడ్‌కు నిజంగానే ఆయన ఒక గాడ్‌ఫాదర్, ఎందరికో మార్గదర్శి. స్ఫూర్తిప్రదాత అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ నటించిన లూసిఫర్ సినిమాకు రీమేక్‌గా గాడ్‌ఫాదర్ సినిమా తెరకెక్కింది. మోహన్‌రాజా దర్శకత్వంలో తెరకెక్కిన గాడ్‌ఫాదర్ సినిమాలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్, నయనతార, సత్యదేవ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. విజయ దశమి కానుకగా ఈ సినిమా విడుదలవుతోంది.
గాడ్‌ఫాదర్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. సినిమాలో చిరంజీవి లుక్స్‌తో సినిమాపై క్రేజ్ మరింతగా పెరిగింది. అక్టోబర్ 5వ తేదీన గాడ్‌ఫాదర్ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో వేగం పెంచింది చిత్ర యూనిట్. ఈ క్రమంలోనే బుల్లి తెర యాంకర్ శ్రీముఖి (Sree Mukhi).. చిరంజీవికి చెందిన ప్రైవేట్ జెట్‌లో ఆయనను ఇంటర్వ్యూ చేశారు. ‘ఇన్ ద క్లౌడ్స్ విత్ గాడ్‌ఫాదర్’ పేరుతో జరిగిన ఈ ఇంటర్వ్యూలో మెగాస్టార్ చిరంజీవి గాడ్‌ఫాదర్ సినిమాపై పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
ట్విట్టర్‌లో ‘రాజకీయం’ డైలాగ్ గురించి..
ఇటీవల చిరంజీవి ట్విట్టర్‌లో షేర్ చేసిన డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ‘నేను రాజకీయం నుంచి దూరంగా ఉన్నాను. కానీ, రాజకీయం నా నుంచి దూరం కాలేదు’ ఈ డైలాగ్ సోషల్ మీడియాను కుదిపేసింది. ఈ ఇంటర్వ్యూలో ముందుగా ఈ విషయంపైనే చిరంజీవి స్పందించారు. ఈ డైలాగ్ ఇంత పాపులర్ అవుతుందని తాను కూడా ఊహించలేదని అన్నారు మెగాస్టార్.
హీరోయిన్ లేకుండానే..
నా ఇన్ని సంవత్సరాల సినీ కెరీర్‌లో హీరోయిన్ లేకుండా సినిమాలు చేయలేదు. ఇంత సీనియారిటీ, ఇమేజ్ వచ్చిన తర్వాత నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవాలనుకున్నాను. గాడ్‌ఫాదర్ సినిమాలో హీరోయిన్ లేదనే భావన కలగదు. అంత బాగా సాగిపోతుంది ఈ సినిమా.
సాల్ట్ అండ్ పెప్పర్ లుక్..
గాడ్‌ఫాదర్ సినిమాలో జీవితాన్ని కాచివడపోసిన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి క్యారెక్టర్ చేశాను. సంపూర్ణ నాయకత్వం ఉన్న పాత్ర. అటువంటి పూర్తి మెచ్యూరిటీ అనేది మధ్యవయసు దాటిన తర్వాతే వస్తుంది. ఆ మెచ్యూరిటీ ఉన్న వ్యక్తి క్యారెక్టర్‌లో కనిపిస్తున్నప్పుడు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో.. చిన్న స్ట్రీక్స్ ఉన్న జుట్టు ఉంటే బాగుంటుందని అనిపించింది. ఆ విషయాన్నే డైరెక్టర్‌కు చెప్పాను. దానిని కెమెరామెన్ కూడా బాగుంటుందని ఎంకరేజ్ చేశారు.
నయనతార గురించి..
గాడ్‌ఫాదర్ సినిమాలో నయనతార ( Nayanthara).. సత్య ప్రియ అనే క్యారెక్టర్ చేశారు. సినిమాలో ప్రియ అనే క్యారెక్టర్ పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్. ఈ క్యారెక్టర్ కోసం చాలా చరిష్మా, సీనియారిటీ, గ్లామర్ ఉన్న నటి కావాలి. అందరికీ నయనతార చేస్తే బాగుంటుందని అనిపించింది. అడిగిన వెంటనే ఒప్పుకుని అందరినీ బాగా ఎంకరేజ్ చేసింది. తన క్యారెక్టర్‌లో బాగా ఒదిగిపోయి నటించింది నయనతార.
సత్యదేవ్ (Satyadev) నా ఛాయిసే..
సత్యదేవ్‌ను ఈ క్యారెక్టర్ చేయమని నేనే అడిగాను. చేసినవి కొన్ని సినిమాలే అయినా డిక్షన్, పెర్ఫామెన్స్, వాయిస్, ప్రెజెంట్ చేసుకునే విధానం ఎప్పుడూ బాగుంటుంది. ప్రస్తుతం హీరోగా చేస్తున్నాడు. ఈ సినిమాలో తనది నెగెటివ్ పాత్రం. ఈ క్యారెక్టర్ తనకు కూడా ఉపయోగపడుతుంది. తన కారణంగా క్యారెక్టర్ కూడా బాగా వస్తుందనే ఆలోచనతో నేనే సత్యదేవ్‌ను అడిగాను. దానికి సత్యదేవ్ వెంటనే ఒప్పుకున్నాడు. (ఈ క్యారెక్టర్ సత్యదేవ్ చేయాలని నేను పట్టుబట్టినందుకు నా పేరు నిలబెడతాడని సరదాగా చెప్పారు చిరు)
వెయిట్ ఫర్ మై కమాండ్ బ్రదర్..
గాడ్‌ఫాదర్ సినిమాలో స్క్రీన్‌పై సల్మాన్‌ఖాన్ (Salman Khan) కనిపించేది తక్కువ సమయమే అయినా.. ఆ క్యారెక్టర్ నా సోల్‌మేట్ అనే చెప్పాలి. సినిమాలో నేను ఫైట్ చేయకుండా పక్కన నిలుచుని ఉన్నప్పుడు నా గురించి పోరాడే వ్యక్తికి ఒక ఇమేజ్ ఉంటే బాగుంటుంది. అటువంటి సమయంలో చరణ్ వెళ్లి సల్మాన్‌ను ఈ క్యారెక్టర్ చేయాలని అడిగాడు. దానికి సల్మాన్ వెంటనే ఒప్పుకున్నారు. అందుకు సల్మాన్ భాయ్‌కి థాంక్స్ (హ్యాట్సాఫ్, లవ్ యూ సల్మాన్ భాయ్ అని నవ్వుతూ చెప్పారు చిరంజీవి). సల్మాన్‌ఖాన్ చేయడంతో క్యారెక్టర్‌కు నిండుదనం వచ్చింది.
తార్‌మార్ తక్కర్ మార్ స్టెప్..
నేను, సల్మాన్‌ఖాన్ (Salman Khan) తార్‌మార్ తక్కర్ మార్ పాటకు చేసిన మూవ్‌మెంట్.. క్రెడిట్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాకే వెళుతుంది. మీరు, సల్మాన్ సూపర్‌స్టార్స్. చాలా క్యాజువల్‌గా, ఈజ్‌తో చేస్తే బాగుంటుందని ప్రభు, డైరెక్టర్ మోహన్ రాజా కూడా చెప్పారు. అలాగే చేశాం. సినిమాలో మా ఇద్దరిదీ కూడా కేర్‌లెస్ యాటిట్యూడ్. ఈ స్టెప్ కూడా ఆ కేర్‌లెస్‌నెస్‌ను ఎలివేట్ చేసేలా ఉంటుందని దర్శకుడు కూడా అన్నారు.
పూరీ జగన్నాథ్ యూట్యూబర్‌గా..
కరోనా టైంలో పూరీ జగన్నాథ్ (Puri Jagannadh) మాట్లాడిన పాడ్‌క్యాస్ట్‌లు చాలా విన్నాను. గాడ్‌ఫాదర్ సినిమాలో ఆ క్యారెక్టర్‌ను పూరీ చేస్తే బాగుంటుందని అనిపించింది. విషయాన్ని దర్శకుడు మోహన్‌రాజాకు చెబితే నిజంగా ఆ క్యారెక్టర్ జగన్ చేస్తారా అని ఎగ్జైట్ అయ్యారు. ఫోన్ చేసి అడిగితే ముందు చచ్చినా చేయను అన్నారు జగన్. ఎలా చేయాలని చేసి చూపిస్తాను కానీ.. కెమెరా ముందు చేయాలంటే నా వల్ల కాదు.. అది కూడా మీ ముందు చేయలేను అని చెప్పాడు జగన్. అయితే తరువాత ఒప్పుకుని అద్భుతంగా, చాలా నేచురల్‌గా చేశాడు.
థమన్ మ్యూజిక్ ఆరో ప్రాణం..
గాడ్‌ఫాదర్ సినిమా కోసం మేం పంచ ప్రాణాలు పెట్టాం. అయితే ఆరో ప్రాణం పెట్టి మరో స్టేజీకి తీసుకెళ్లాడు ఎస్ఎస్ థమన్ (SS Thaman). సినిమాలో పాటలు లేవు ఎలా అని అనుకున్నాను. నాకు వదిలేయండి అన్నయ్యా నేను చూసుకుంటాను అని చెప్పి.. సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. అది ఎలా అనేది సినిమా చూస్తేనే తెలుస్తుంది అని చెప్పారు మెగాస్టార్ చిరంజీవి ( Chiranjeevi)
Read More : మెగా154లో చిరంజీవి (Chiranjeevi), రవితేజతోపాటు వెంకటేష్, నాగార్జున (Nagarjuna) కూడా నటించనున్నారా?