‘కాంతార’ (Kantara)లోని ఆ శబ్దాన్ని దయచేసి అనుకరించొద్దు.. ప్రేక్షకులకు రిషబ్ శెట్టి (Rishab Shetty) విజ్ఞప్తి

Updated on Oct 21, 2022 06:57 PM IST
‘ఓ..’ అనేది శబ్దం మాత్రమే కాదని.. తమకు సెంటిమెంట్ అని ‘కాంతార’ (Kantara) సినిమా దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) అన్నారు
‘ఓ..’ అనేది శబ్దం మాత్రమే కాదని.. తమకు సెంటిమెంట్ అని ‘కాంతార’ (Kantara) సినిమా దర్శకుడు, కథానాయకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty) అన్నారు

కన్నడ చిత్రం ‘కాంతార’ (Kantara) బాక్సాపీస్ వద్ద హంగామా చేస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ.. వసూళ్ల జాతర చేస్తోంది. కలెక్షన్ల విషయంలో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్–3 గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇప్పటికే రూ.175 కోట్లు వసూలు చేసిన ‘కాంతార’.. దీపావళి వరకు సక్సెస్‌ఫుల్ రన్‌ను కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక తుళునాడులోని ఆచారాలను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను దర్శకుడు, హీరో రిషబ్ శెట్టి (Rishab Shetty) తెరకెక్కించారు. 

కోస్టల్ కర్ణాటకలో కనిపించే భూతకోల సంస్కృతిని ‘కాంతార’ ద్వారా తెలియజేసే ప్రయత్నం చేశారు రిషబ్ శెట్టి. అందులో ఆయన నూటికి నూరుపాళ్లు విజయవంతం అయ్యారనే చెప్పాలి. సినిమా మొత్తం ఒకెత్తయితే.. క్లైమాక్స్‌లో వచ్చే భూతకోల సన్నివేశాలు మరోఎత్తుగా నిలిచాయి. సినిమా ఆఖర్లో దేవుడు ఆవహించిన సమయంలో కోల ఆడే వ్యక్తులు ‘ఓ..’ అంటూ వింత శబ్దాన్ని చేస్తారని ఈ చిత్రంలో చూపించారు. ‘కాంతార’లో క్లైమాక్స్‌తోపాటు పలు కీలక సన్నివేశాల సమయంలో ‘ఓ..’ అనే ధ్వని వినిపిస్తుంది. ఇలా వినిపించిన ప్రతిసారి థియేటర్లు దద్దరిల్లిపోయేలా ఆడియెన్స్ రియాక్ట్ అవుతున్నారు. 

ప్లీజ్.. అలా అరవకండి

‘కాంతార’ చూసి బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకులు కూడా ‘ఓ..’ అంటూ కేకలు వేస్తూ సినిమాపై తమ అభిమానాన్ని, ప్రేమను చూపిస్తున్నారు. ఈ విషయంపై తాజాగా రిషబ్ శెట్టి స్పందించారు. దయచేసి ఎవ్వరూ ‘ఓ..’ అనే శబ్దాన్ని అనుకరించొద్దని ఆయన కోరారు. ‘ఓ.. అనేది ఒక శబ్దం మాత్రమే కాదు. అది మాకు సెంటిమెంట్. ‘కాంతార’ను చూసిన ప్రేక్షకులకు నాదో విన్నపం. సినిమాలో ఉపయోగించిన శబ్దాలను ఎవ్వరూ అనుకరించొద్దు. ఇదొక ఆచారం, ఆధ్యాత్మిక నమ్మకం. అలాగే ఇది సున్నితమైన అంశం. దీనివల్ల ఆచారం దెబ్బతినే ప్రమాదం ఉంది’ అని రిషబ్ శెట్టి పేర్కొన్నారు. 

ఇకపోతే, రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రాన్ని హొంబాలే సంస్థ నిర్మించింది. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించారు. సీనియర్ నటులు అచ్యుత్ కుమార్, కిషోర్, ప్రమోద్ శెట్టి కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ నుంచి ‘వరాహ రూపం’ లిరికల్ వీడియో సాంగ్ ఇటీవలే యూట్యూబ్‌లో రిలీజై ట్రెండింగ్‌లో ఉంది. 

Read more: నా శరీరం ఇంకా వణుకుతోంది.. సినిమా అంటే ‘కాంతార’ (Kantara)లా ఉండాలి: కంగనా రనౌత్ (Kangana Ranaut)

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!