‘కేజీఎఫ్’ (KGF) తర్వాతి స్థానంలో ‘కాంతార’ (Kantara).. బాక్సాఫీస్ వద్ద రిషబ్ (Rishab Shetty) మూవీ దండయాత్ర
కన్నడ సినిమా ‘కాంతార’ (Kantara) దేశవ్యాప్తంగా సంచనాలు సృష్టిస్తూ దూసుకెళ్తోంది. కన్నడలో బ్లాక్ బస్టర్‌గా నిలవడంతో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీల్లోకి డబ్ చేశారు. తమిళం, హిందీల్లో మంచి వసూళ్లు సాధిస్తున్న ‘కాంతార’.. తెలుగులో మాత్రం ఊహించని కలెక్షన్లతో మెస్మరైజ్ చేస్తోంది. స్ట్రెయిట్ తెలుగు చిత్రం లెవల్లో ఇక్కడ ‘కాంతార’ చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. తెలుగు నాట రిలీజైన తొలి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ.. ఫుల్ రన్‌లో రూ.25 కోట్ల మార్కును చేరుకునే దిశగా పరుగులు తీస్తోంది. దీపావళికి రిలీజ్ అవుతున్న కొత్త చిత్రాల ధాటిని తట్టుకుని స్థిరంగా వసూళ్లను సాధిస్తే.. అనుకున్న టార్గెట్‌ను చేరుకోవడం ‘కాంతార’కు కష్టం కాకపోవచ్చు.
రికార్డుల పరంగానూ ‘కాంతార’ హవా చూపిస్తోంది. ఎన్నో పెద్ద సినిమాలను అధిగమించి ఐఎండీబీలో అత్యధిక రేటింగ్స్‌ను సాధించిందీ చిత్రం. ఐఎండీబీ ర్యాంకింగ్స్‌లో టాప్–250 భారతీయ సినిమాల్లో మొదటి స్థానంలో నిలిచి.. ఈ సినిమా అందర్నీ ఆశ్చర్యపరిచింది. తాజాగా మరో రికార్డును ‘కాంతార’ సొంతం చేసుకుంది. అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ సినిమాల లిస్టులో ఈ చిత్రం మూడో స్థానంలో నిలిచింది.
అత్యధిక కలెక్షన్లు సాధించిన కన్నడ చిత్రాల్లో రూ.1,207 కోట్లతో ‘కేజీఎఫ్ 2’ అగ్రస్థానంలో ఉంది. రెండో స్థానంలో రూ.250 కోట్లతో ‘కేజీఎఫ్ 1’.. మూడు, నాలుగు స్థానాల్లో ‘విక్రాంత్ రోణ’, ‘జేమ్స్’ నిలిచాయి. తాజాగా ఈ జాబితాలోకి ‘కాంతార’ మూవీ చేరింది. రూ.170 కోట్ల వసూళ్లు సాధించిన ‘కాంతార’.. ‘విక్రాంత్ రోణ’, ‘జేమ్స్’ను వెనక్కి నెట్టి మూడో ప్లేస్‌లో నిలిచింది. ఒక చిన్న సినిమా ఈ స్థాయిలో కలెక్షన్లు సాధించడం మామూలు విషయం కాదు. కన్నడతో పాటు తెలుగులోనూ సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ రన్‌ను కొనసాగిస్తున్న ‘కాంతార’.. మరిన్ని కొత్త రికార్డులను సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఓవరాల్‌గా థియేట్రికల్ రన్ ముగిసే సమయానికి రూ.200 కోట్ల మార్కును ‘కాంతార’ సినిమా సులువుగా చేరుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. పెద్దగా ప్రమోషన్లు చేయనప్పటికీ మౌత్ టాక్‌తో ఈ మూవీ ఇంతలా ప్రజాదరణ పొందుతుండటం గొప్ప విషయమనే చెప్పాలి. ఇక, రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘కాంతార’ చిత్రం నుంచి తాజాగా ‘వరాహ రూపం’ సాంగ్ లిరికల్ వీడియో యూట్యూబ్‌లో రిలీజైంది. భూత కోల నృత్య రూపకానికి సంబంధించిన లిరికల్, మేకింగ్ చూపిస్తూ ఈ వీడియో సాగింది. పాటలో సంగీత దర్శకుడు అజనీష్ లోక్‌నాథ్‌ను చూడొచ్చు. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది.