తమిళ బాక్సాఫీసును షేక్ చేస్తున్న ‘లవ్ టుడే’ (Love Today) మూవీ.. తెలుగులో రిలీజ్ చేయనున్న దిల్ రాజు (Dil Raju)!

Updated on Nov 09, 2022 12:22 PM IST
‘లవ్ టుడే’ (Love Today) సినిమాలోని కథ, కథనాలకు తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు
‘లవ్ టుడే’ (Love Today) సినిమాలోని కథ, కథనాలకు తమిళ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవుతున్నారు

ఇటీవల కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్’ను ప్రముఖ నిర్మాత దిల్ రాజు (Dil Raju) తెలుగులోకి తీసుకొచ్చారు. అయితే ఈ చిత్రం యావరేజీగా నిలిచింది. తమిళంలో బంపర్ హిట్ సాధించినప్పటికీ తెలుగులో మాత్రం ఆశించిన సక్సెస్‌ను అందుకోలేకపోయింది. అయినా నిరుత్సాహపడకుండా మరో తమిళ మూవీని డబ్ చేసి, విడుదల చేసేందుకు దిల్ రాజు సిద్ధమవుతున్నారు. తమిళ రచయిత, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ తెరకెక్కించిన ప్రదీప్ రంగనాథన్ ‘లవ్ టుడే’ సినిమాను టాలీవుడ్‌లోకి తీసుకున్నారు దిల్ రాజు. 

తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ‘లవ్ టుడే’ చిత్రాన్ని తమిళ ఆడియెన్స్ ఆదరిస్తున్నారు.  ‘పొన్నియిన్ సెల్వన్’ లాంటి భారీ చారిత్రాత్మక సినిమాకు బ్రహ్మరథం పట్టిన కోలీవుడ్ ప్రేక్షకులు.. ‘లవ్ టుడే’ (Love Today) లాంటి చిన్న సినిమాను చూసేందుకూ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం తెరపైకి వచ్చిన ఈ ఫిల్మ్ విజయానికి కథ, కథనాలే కారణాలు. ఇంతకుముందు జయం రవి హీరోగా ‘కోమాలి’ అనే విజయవంతమైన చిత్రాన్ని తీసిన ప్రదీప్ రంగనాథన్‌కు ‘లవ్ టుడే’ రెండో మూవీ. ఈ సినిమాలో ఆయనే కథానాయకుడిగా నటించడం విశేషం. 

సీనియర్ నటులు సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, యోగిబాబు, రవీనా రవి, ఇవేనా తదితరులు కీలక పాత్రలు పోషించిన ‘లవ్ టుడే’ మూవీకి దినేష్​ పురుషోత్తమన్ ఛాయాగ్రహణం అందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా బాణీలు సమకూర్చారు. ప్రేమ, వినోదం ప్రధానాంశాలుగా రూపొందించిన ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఎస్.అఘోరం నిర్మించారు. ఆసక్తికరమైన కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమాను ప్రేక్షకులతోపాటు విమర్శకులు కూడా మెచ్చుకుంటున్నారు. ఈ మూవీ విడుదలైన మూడ్రోజుల్లోనే తమిళనాడులో రూ.15 కోట్లు వసూలు చేసి సంచలన విజయం సాధించే దిశగా దూసుకెళ్తోంది. 

 ‘లవ్ టుడే’ (Love Today)ను చూసేందుకు తమిళ ప్రేక్షకులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు

ఒకరి ఫోన్ మరొకరు మార్చుకుంటే..

‘లవ్ టుడే’ సినిమా కథాకథనాలే ఆడియెన్స్‌ను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఈ క్రమంలో అబ్బాయి.. అమ్మాయి వాళ్ల నాన్నతో వివాహం గురించి మాట్లాడేందుకు వెళ్తారు. అయితే అమ్మాయి తండ్రి వీళ్లిద్దరికీ ఓ పరీక్ష పెడతారు. ఇద్దరినీ ఒకరి ఫోన్ మరొకరు ఎక్స్‌ఛేంజ్ చేసుకుని ఒక రోజు ఉండమంటారు. దీంతో ఇరు ప్రేమికులు భయపడుతూనే ఒకరి ఫోన్ ఇంకొకరు తీసుకుంటారు. ఆ తర్వాత మెళ్లిగా ఒకరి వ్యక్తిగత విషయాలు ఇంకొకరికి తెలిసిపోతుంటాయి. ఈ క్రమంలో వాళ్లిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. చివరకు వీళ్లు పెళ్లి చేసుకున్నారా లేదా అనేదే సినిమా కథాంశం. 

‘లవ్ టుడే’ను తెలుగులో దిల్ రాజు విడుదల చేస్తున్నారని ప్రదీప్ రంగనాథన్ అధికారికంగా తెలిపారు. ఇప్పటికే డబ్బింగ్ వర్క్ కూడా పూర్తయ్యిందని తెలుస్తోంది. నవంబర్ 18న ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. యూత్ మెచ్చే అంశాలు ఉండటంతో ఈ సినిమా పంపిణీ బాధ్యతలను దిల్ రాజు తీసుకున్నారట. మరి, ఆయన నమ్మకాన్ని తెలుగు ఆడియెన్స్ ఏ మేరకు నిలబెడతారో చూడాలి. 

Read more: అడుగు ముందుకు వేయలేనేమో అనిపిస్తోంది!.. అనారోగ్యంపై స్పందిస్తూ సమంత (Samantha Ruth Prabhu) కన్నీళ్లు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!