Superstar Krishna: సూపర్‌స్టార్ కృష్ణ కన్నుమూత .. తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం కృషి చేసిన నటశేఖరుడు !
టాలీవుడ్ సీనియర్ హీరో సూపర్‌స్టార్ కృష్ణ (Krishna) కన్నుమూశారు. 79 ఏళ్ల కృష్ణ అనారోగ్యంతో సోమవారం హైదరాబాద్‌లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో చేరారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని గమనించిన వైద్యులు తనను ఐసీయూకి తరలించారు. ఆ తర్వాత సుమారు నాలుగు గంటల పాటు డయాలసిస్ చేశారు. సోమవారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కృష్ణ ఆరోగ్య పరిస్థితి బాగా విషమించింది. మంగళవారం తెల్లవారుఝామున 4.09 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు.
కృష్ణ మరణవార్త ఆయన అభిమానులను బాగా కలచివేసింది. అలాగే కృష్ణ తనయుడు మహేష్ బాబుతో పాటు ఆయన (Krishna) కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ క్రమంలో స్టేట్ వైడ్‌లోని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తమ అభిమాన హీరో ఇక లేరంటూ సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు. ఆయనతో తమ అనుబంధాన్ని పంచుకున్నారు.
'తేనె మనసులు' సినిమాతో తెలుగు చిత్ర రంగానికి కృష్ణ హీరోగా పరిచయమయ్యారు . ఈ సినిమా తొలి ఈస్ట్ మన్ కలర్ సోషల్ చిత్రంగా విడుదలైంది. ఆ తర్వాత ఒక దశాబ్దం పాటు, తెలుగు సినీ పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోగా కృష్ణ కొనసాగారు. దాదాపు 340 చిత్రాలలో నటించారు. ఒక్క సంవత్సరంలో దాదాపు పది సినిమాలలో నటించిన ఘనత కూడా సూపర్ స్టార్ కృష్ణకే దక్కుతుంది.
హీరోగానే కాకుండా నిర్మాతగా, దర్శకుడిగా కూడా కృష్ణ సినిమాల పట్ల తనకున్న అంకిత భావాన్ని చాటుకున్నారు. అలాగే 18 సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు. కౌబాయ్ సినిమాలు, జేమ్స్ బాండ్ సినిమాలతో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురించారు. తెలుగు సినిమా పరిశ్రమకు కృష్ణ తనదైన శైలిలో ఎన్నో సేవలను అందించారు. రాజకీయ రంగంలోకి అడుగుపెట్టి ఎంపీగానూ గెలిచారు. కృష్ణ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం పేరు "శ్రీశ్రీ". ఈ చిత్రం 2016 లో విడుదలైంది.
Read More: ప్రయోగాలకు కేరాఫ్‌గా నిలిచిన సూపర్‌స్టార్ కృష్ణ టాప్10 సినిమాలు