N. T. Rama Rao Birth Anniversary: తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌కు వందేళ్లు
N. T. Rama Rao Birth Anniversary: నందమూరి తారక రామారావు తెలుగు సినీ ప్రపంచంలో చరిత్ర సృష్టించిన మహానటుడు. తెలుగు ప్రజల ఉన్నతికి కృషి చేసిన మహనీయుడు. సినిమా, రాజకీయం రెండింటినీ రెండు కళ్లుగా భావించిన మహోన్నత వ్యక్తి. ఎన్టీఆర్ శత జయంతి నేడు. నందమూరి తారక రామారావు మే 28, 1923 న జన్మించారు. ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమాతో తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన ఎన్టీఆర్.. ఆ తర్వాత తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే అగ్ర స్థానంలో నిలిచారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో మొత్తం 400 సినిమాల్లో నటించారు.
ఎన్టీఆర్ (NT Rama Rao) నటుడిగానే కాకుండా, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకునక్నారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో ఎన్టీఆర్‌కు మించిన నటుడు లేరంటే అతిశయోక్తి కాదు. రాముడు, కృష్ణుడు లాంటి పౌరాణిక పాత్రల్లో ఎన్టీఆర్ జీవించారనే చెప్పాలి. పురాణ పురుషులు అంటే ఇలాగే ఉండేవారేమో? అన్నంతగా ఎన్టీఆర్ ఆ పాత్రల్లో ఒదిగిపోయేవారు.
ఎన్టీఆర్ బాల్యం
నందమూరి తారక రామారావు స్వగ్రామం కృష్ణాజిల్లా నిమ్మకూరు. ఎన్టీఆర్ తల్లిదండ్రులు లక్ష్మయ్య, వెంకట రామమ్మలు. ఎన్టీఆర్‌కు ముందు కృష్ణ అని పేరు పెట్టాలనుకున్నారు.. కానీ మేనమామ తారక రాముడని నామకరణం చేశారు. కాలేజీ రోజుల నుంచి ఎన్టీఆర్ నాటకాలు వేసేవారు. ఎన్టీఆర్ మంచి చిత్రకారుడు. రాష్ట్రవ్యాప్త చిత్రలేఖన పోటీలలో ఆయనకు బహుమతి కూడా వచ్చింది.
ఎన్టీఆర్ కుటుంబం
1942 మే నెలలో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నారు ఎన్టీఆర్. వీరికి 11 మంది పిల్లలు. ఏడుగురు కుమారులు. నలుగురు కుమార్తెలు. కుమారులు జయకృష్ణ, సాయికృష్ణ. హరికృష్ణ, మోహనకృష్ణ, బాలకృష్ణ, రామకృష్ణ, జయశంకర్ కృష్ణ. లోకేశ్వరి, దగ్గుబాటి పురంధరేశ్వరి, నారా భువనేశ్వరి, కంటమనేని ఉమామహేశ్వరి ఎన్టీఆర్ కుమార్తెలు. 70 ఏళ్ల వయసులో లక్ష్మీపార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు ఎన్టీఆర్.
సినీ ప్రయాణం
నందమూరి తారక రామారావు కాలేజీలో చదివే రోజుల్లో, కుటుంబానికి కొన్ని ఆర్థిక ఇబ్బందులు రావడంతో పాల వ్యాపారం చేశారు. ఆ తర్వాత కిరాణా కొట్టు నడిపారు. అనంతరం మంగళగిరిలో సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఉద్యోగం సంపాదించారు. కానీ సినిమాలపై ఉన్న ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేసి నటన వైపు ప్రయాణం మొదలుపెట్టారు.
ఎల్వీ ప్రసాద్ దగ్గర ఎన్టీఆర్ ఫోటోలను చూసిన నిర్మాత బీ.ఏ. సుబ్బారావు మద్రాసు పిలిపించారు. 'పల్లెటూరి పిల్ల'లో కథానాయకుడిగా ఎంపిక చేశారు. ఆ తర్వాత 'మనదేశం' అనే సినిమాలో నటించారు. పల్లెటూరి పిల్ల కన్నా ముందే ‘మనదేశం’ సినిమా రిలీజ్ అయింది. ఇక ఆ తర్వాత నటించిన పాతాళభైరవి, మల్లీశ్వరి, మాయాబజార్, అడవిరాముడు, నర్తనశాల, యమగోల... ఇలా వందల సినిమాలు చేసి తెలుగు నాట అగ్ర కథానాయకుడిగా వెలుగొందారు ఎన్టీఆర్.
1968వ సంవత్సరంలో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకున్నారు ఎన్టీఆర్. నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఎన్.టి.ఆర్. కథానాయకుడు, ఎన్.టి.ఆర్. మహానాయకుడు సినిమాలను ఆయన పుత్రరత్నం బాలకృష్ణ తెరకెక్కించారు. ఈ సినిమాల్లో ఎన్టీఆర్ పాత్రలో ఆయన కొడుకుగా బాలకృష్ణే నటించారు.
రాజకీయ జీవితం
రామారావు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయిన ఘనత ఎన్టీఆర్‌కే దక్కింది. మూడు పర్యాయాల్లో మొత్తం ఏడు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఎన్టీఆర్ పనిచేశారు. రెండు రూపాయలకు కిలో బియ్యం అందించిన మొదటి సీఎంగా నిలిచారు.
ఎన్టీఆర్ శత జయంతి
భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ తనకంటూ ఓ పేజీని రూపొందించుకున్నారు. తన నట విశ్వరూపంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. రాజకీయాల ద్వారా ప్రజల హృదయాలలో నిలిచిపోయిన మహోన్నతమైన మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ జన్మించి వంద సంవత్సరాలు అయింది. దీంతో నందమూరి కుటుంబం, తెలుగుదేశం పార్టీ శత జయంతి ఉత్సవాలు నిర్వహిస్తోంది.