Celebrity Love Marriages: సినీ 'ప్రేమ' బంధం .. డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న కథానాయికలు వీరే !

Updated on Jul 05, 2022 07:01 PM IST
డైరెక్టర్లను లవ్‌ మ్యారేజ్ (Love Marriage) చేసుకున్న హీరోయిన్లు
డైరెక్టర్లను లవ్‌ మ్యారేజ్ (Love Marriage) చేసుకున్న హీరోయిన్లు

ఒకే ఇండస్ట్రీకి చెందినవారు ప్రేమించి పెళ్లి (Love Marriages) చేసుకోవడం సర్వ సాధారణం. అందులోనూ గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్లు ప్రేమలో పడడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం మామూలు విషయమే. నటులు తమ తోటి నటీమణులను వివాహం చేసుకోవడం అనేది చాలా సందర్భాలలో జరిగింది.  

అయితే, కథానాయికలను దర్శకులు ప్రేమించి, పెళ్లి చేసుకున్న ఘటనలు మాత్రం కొంచెం తక్కువే అని చెప్పాలి. అలా డైరెక్టర్లను ప్రేమించి పెళ్లి చేసుకున్న హీరోయిన్ల కథా కమామీషు ఏంటో మనమూ తెలుసుకుందామా?

భర్త సెల్వమణితో రోజా

రోజా , సెల్వమణి (Roja, Selvamani)

సర్పయాగం సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు హీరోయిన్ రోజా. మెగాస్టార్ చిరంజీవి ముఠామేస్త్రి, భైరవద్వీపం, బొబ్బిలి సింహం, శుభలగ్నం, అన్నమయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాలతో స్టార్ హీరోయిన్‌గా పేరు సంపాదించుకున్నారు రోజా. శంభో శివ శంభో, గోలీమార్, వీర, శ్రీరామరాజ్యం సినిమాల్లో కీలక పాత్రలు చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.

రాజకీయాల్లోకి వెళ్లి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన రోజా.. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో నటించారు. టీవీ షోలతో కూడా తన క్రేజ్‌ను మరింతగా పెంచుకున్నారు.

డైరెక్టర్‌‌ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు రోజా. పెళ్లి చేసుకునే సమయానికి సెల్వమణి అసిస్టెంట్ డైరెక్టర్‌‌గా ఉన్నారు. ఒక సినిమా షూటింగ్‌లో వీరిద్దరి మధ్య ఏర్పడిన స్నేహబంధం ప్రేమగా మారి బలపడింది. దాంతో వీరిద్దరూ 2002లో  వివాహం చేసుకున్నారు.

రమ్యకృష్ణ – కృష్ణవంశీ

రమ్యకృష్ణ , కృష్ణవంశీ (Ramya Krishna, Krishna Vamsi)

తెలుగు, తమిళంతోపాటు హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్నారు  రమ్యకృష్ణ. టాలీవుడ్‌లో దాదాపుగా అందరు స్టార్ హీరోల సరసన నటించిన రమ్యకృష్ణ కెరీర్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్‌లో ఉంది. సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా ఆమె తన నటనతో అభిమానులను అలరిస్తున్నారు.

ఇక, అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కిన 'చంద్రలేఖ' సినిమాలో రమ్యకృష్ణ హీరోయిన్‌గా నటించారు. కృష్ణవంశీ దర్శకుడు. 1998 సంవత్సరంలో 'చంద్రలేఖ' సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. తర్వాత ఐదు సంవత్సరాలకు 2003 జూన్‌లో పెళ్లి చేసుకున్నారు.

సుహాసిని మణిరత్నం

సుహాసిని, మణిరత్నం (Suhasini, Mani Ratnam)

1981 సంవత్సరంలో 'కొత్త జీవితాలు' సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు హీరోయిన్ సుహాసిని. తెలుగులో అందరు స్టార్లతో స్క్రీన్ షేర్ చేసుకున్న సుహాసిని.. తన అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా అభిమానులను అలరిస్తున్నారు సుహాసిని.

క్లాసికల్ డైరెక్టర్‌‌ మణిరత్నంను సుహాసిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 1988లో వీరిద్దరి వివాహం జరిగింది. సుహాసిని, మణిరత్నం కలిసి ఏ సినిమాకూ పని చేయలేదు. అయినా వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. కాగా, లోకనాయకుడు కమల్ హాసన్ అన్నయ్య చారు హాసన్‌ కూతురే సుహాసిని.

ఖుష్బూ సుందర్

ఖుష్బూ, సుందర్ (Khushbu, Sundar)

ఖుష్బూ.. తమిళంతోపాటు తెలుగులో కూడా పలు సినిమాల్లో నటించారు. తెలుగులో స్టార్‌‌ హీరోల సరసన నటించి గ్లామర్‌‌ క్వీన్‌ అనే పేరు తెచ్చుకున్నారు. నటనలో కూడా తనకు తానే సాటి అని పలు సినిమాల ద్వారా నిరూపించుకున్నారు ఖుష్బూ. నటీనటులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. అయితే ఖుష్బూకు ఉన్న అభిమానులు ప్రత్యేకం. తొలిసారిగా ఒక హీరోయిన్‌కు గుడి కట్టారు ఖుష్బూ అభిమానులు. ప్రస్తుతం ఖుష్బూ.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్‌‌లో సెకండ్ ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నారు.

ఇక, ఖుష్బూ తమిళ డైరెక్టర్ సుందర్‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూరై మురెన్ అనే తమిళ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ పెళ్లి వరకు దారితీసింది. 2000 సంవత్సరంలో ఖుష్బూ, సుందర్ పెళ్లి చేసుకున్నారు.

లిస్సీ ప్రియదర్శన్

లిజీ, ప్రియదర్శన్ (Lissy, Priyadarshan)

సుమన్ హీరోగా తెరకెక్కిన ఆత్మబంధం, 20వ శతాబ్దం సినిమాల్లో హీరోయిన్‌గా నటించారు మలయాళ నటి లిజీ. మలయాళంలో స్టార్‌‌ హీరోయిన్‌గా చాలాకాలం కొనసాగారు. తెలుగులో నాగార్జున, అమల హీరో,,హీరోయిన్లుగా తెరకెక్కిన ‘నిర్ణయం’, బాలకృష్ణ హీరోగా చేసిన ‘గాండీవం’ సినిమాలను డైరెక్ట్‌ చేశారు ప్రియదర్శన్.

మలయాళం, తమిళ్, హిందీ భాషల్లో సూపర్‌‌హిట్‌ సినిమాలను తెరకెక్కించిన ప్రియదర్శన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు లిజీ. 1990లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2016 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ‘హలో’ సినిమాలో అక్కినేని అఖిల్‌ పక్కన, ‘చిత్రలహరి’ సినిమాలో సాయిధరమ్‌ తేజ్ సరసన హీరోయిన్‌గా నటించిన ‘కల్యాణి ప్రియదర్శన్‌’ లిజీ, ప్రియదర్శన్‌ల కూతురే.

రాశి – శ్రీ ముని (Raasi – Sri Muni)

రాశి, శ్రీ ముని (Raasi, Sri Muni)

పెళ్లిపందిరి సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది రాశి. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో జగపతిబాబు హీరోగా నటించారు. ఆ తర్వాత వచ్చిన గోకులంలో సీత, శుభాకాంక్షలు, దేవుళ్లు, నిజం సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు రాశి. గిరిజా కల్యాణం, జానకి కలగనలేదు సీరియల్స్‌తో మరింత మంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక, సినిమాలు చేస్తున్న సమయంలోనే డైరెక్టర్‌‌ శ్రీ మునిని పెళ్లి చేసుకున్నారు రాశి. 2005 సంవత్సరంలో  వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు రాశి. తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తున్నారు.

ప్రీత – హరి గోపాలకృష్ణన్ (Preetha – Hari Gopala Krishnan)

ప్రీత, హరి గోపాలకృష్ణన్ (Preetha, Hari Gopala Krishnan)

'రుక్మిణి' సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టారు ప్రీత విజయ్ కుమార్. రవిరాజా పినిశెట్టి దర్శకత్వం వహించిన 'రుక్మిణి' సినిమాలో వినీత్‌కు జోడీగా నటించి మంచిపేరు తెచ్చుకున్నారు ప్రీత. ఆ తర్వాత వైఫ్, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, మా అన్నయ్య, ప్రియమైన నీకు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. తెలుగుతోపాటు తమిళం, మలయాళంలో కూడా సినిమాలు చేశారు ప్రీత.

ప్రీత కూడా డైరెక్టర్‌‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.  ఇక తమిళంలో స్టార్ హీరో సూర్యతో ఆరు, సింగం, సింగం 2, సింగం 3 వంటి సూపర్‌‌ హిట్‌ సినిమాలు తెరకెక్కించిన డైరెక్టర్‌‌ హరి గోపాలకృష్ణన్. 2002 సంవత్సరంలో వీరిద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు.

పూర్ణిమ – భాగ్యరాజా (Poornima -– Bhagyaraj)

పూర్ణిమ, భాగ్యరాజా (Poornima, Bhagyaraj)

మెగాస్టార్ చిరంజీవి నటించిన సూపర్‌‌హిట్‌ సినిమా 'మంత్రి గారి వియ్యంకుడు' సినిమాలో హీరోయిన్‌గా చేశారు పూర్ణిమ. తమిళం, మలయాళం, హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 'డార్లింగ్..డార్లింగ్..డార్లింగ్' సినిమా షూటింగ్ సమయంలో పూర్ణిమ, భాగ్యరాజాల మధ్యా ప్రేమ మొదలైంది.

సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే స్టార్ డైరెక్టర్ భాగ్యరాజాను ప్రేమించారు పూర్ణిమ. స్టార్ డైరెక్టర్‌‌గా, యాక్టర్‌‌గా ఉన్న భాగ్యరాజాను పూర్ణిమ 1984 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. కాగా, పూర్ణిమ కూడా ఇటీవలే కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్‌ చేసి 'నిను వీడని నీడను నేనే' సినిమాలో హీరో సందీప్ కిషన్‌కు తల్లిగా నటించారు.  

అమలాపాల్‌ – విజయ్ (Amala Paul – Vijay)

అమలాపాల్‌, విజయ్ (Amala Paul, Vijay)

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన ‘నాయక్’ సినిమాలో నటించారు అమలా పాల్. బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, లవ్‌ ఫెయిల్యూర్, జెండాపై కపిరాజు, పిట్ట కథలు సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు అమలాపాల్.

‘దైవ తిరుమగల్’ సినిమా షూటింగ్‌ జరుగుతున్న సమయంలో తమిళ దర్శకుడు ఏఎల్ విజయ్‌తో ప్రేమలో పడ్డారు అమలాపాల్. 2014లో ప్రేమ పెళ్లి చేసుకున్న వీరిద్దరూ 2017లో విడాకులు తీసుకున్నారు.

నయనతార – విఘ్నేష్‌ శివన్ (Nayanthara – Vignesh Shivan)

నయనతార – విఘ్నేష్‌ శివన్ (Nayanthara Vignesh Shivan)

చంద్రముఖి సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు నయనతార. తెలుగులో దాదాపు స్టార్ హీరోలందరి సరసన నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగారామె. తన గ్లామర్, నటనతో అభిమానులను సైతం సంపాదించుకున్నారు నయన్. గజిని, లక్ష్మి, బాస్, దుబాయ్ శీను, తులసి, బిల్లా, అదుర్స్, శ్రీరామరాజ్యం, అమ్మోరు తల్లి, పెద్దన్న సినిమాలతో నటిగా మంచి పేరు తెచ్చుకున్నారు నయనతార.

తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ను ప్రేమించారు నయనతార. పలు సినిమాలకు దర్శకత్వం వహించిన విఘ్నేష్‌ – నయనతార కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. కాగా, వీరిద్దరూ 2022, జూన్‌ 9వ తేదీన వీరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.

Read More : ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ (Tollywood) సెలబ్రిటీలు

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!