రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అద్భుత నటనకు అద్దంపట్టే టాప్10 సినిమాలు..
రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju).. మాస్ సినిమాలతోపాటు కుటుంబ నేపథ్యం ఉన్న సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులు. తన డైలాగ్ డెలివరీ, నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు కృష్ణంరాజు. ఎక్కడో పల్లెటూరిలో పుట్టి.. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన కృష్ణంరాజు.. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.
ట్రీట్‌మెంట్ నిమిత్తం ఇటీవల హైదరాబాద్‌లోని హాస్పిటల్‌లో ఇటీవల చేరిన కృష్ణంరాజు.. ఆరోగ్యం విషమించడంతో ఆదివారం తెల్లవారుజామును తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, అభిమానులు, సినీ ప్రేమికులతోపాటు సినీ ఇండస్ట్రీ మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ ఉద్విగ్న సమయంలో కృష్ణంరాజు నటించిన పలు సినిమాలను గుర్తు చేసుకుని ఆయనకు నివాళులర్పిద్దాం..
1. భక్త కన్నప్ప (1976)
రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) నటవిశ్వరూపానికి ఉదాహరణ భక్త కన్నప్ప సినిమా. ఈ సినిమాలో భక్త కన్నప్పగా ఆయన నటన అద్భుతం. ఈ భక్తి ప్రధాన చిత్రంలో కృష్ణంరాజుతోపాటు వాణిశ్రీ, బాలయ్య, రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీధర్, ప్రభాకర్‌రెడ్డి, వరలక్ష్మి, జయమాలిని కీలకపాత్రలు పోషించారు. బాపు దర్శకత్వం వహించిన భక్త కన్నప్ప సినిమా కృష్ణంరాజు సినీ కెరీర్‌లో ఒక మైలు రాయిగా చెప్పుకోవచ్చు.
2. అమరదీపం (1977)
కృష్ణంరాజు (Krishnam Raju) హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తెరకెక్కించిన హిట్ సినిమా అమరదీపం. ఈ సినిమాలో కృష్ణంరాజు తన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించారు. జయసుధ హీరోయిన్‌గా నటించిన అమరదీపం సినిమాలో జయసుధ, మురళీమోహన్, కైకాల సత్యనారాయణ, ప్రభాకర్‌రెడ్డి, రమాప్రభ కీలకపాత్రలు పోషించారు. చెల్లపల్లి సత్యం అందించిన సంగీతం ఈ సినిమాకు మరింత ప్లస్ అయ్యింది.
3. రంగూన్ రౌడి (1979)
దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన సినిమా రంగూన్ రౌడి. ఈ సినిమాతో తనకున్న మాస్ ఫాలోయింగ్‌ను మరింతగా పెంచుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. రంగూన్ రౌడీ సినిమాలో ఫైట్స్, డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్‌తో మాస్ ప్రేక్షకులను అలరించారు. జయప్రద, మోహన్‌బాబు, షావుకారు జానకి, రావుగాపాలరావు, ప్రభాకర్‌రెడ్డి కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకి బీవీ రాఘవులు సంగీతం అందించారు.
4. బెబ్బులి (1980)
కృష్ణంరాజు (Krishnam Raju)ను రెబల్‌స్టార్‌గా నిలబెట్టిన సినిమాల్లో బెబ్బులి కూడా ఒకటి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో సుజాత, ప్రభాకర్‌రెడ్డి, జగ్గయ్య తదితరులు కీలకపాత్రలు పోషించారు. వీరమాచినేని మధుసూదనరావు దర్శకత్వం వహించిన బెబ్బులి సినిమాను వడ్డే శోభనాద్రి నిర్మించారు. జేవీ రాఘవులు సంగీతం అందించారు.
5. త్రిశూలం (1982)
కృష్ణంరాజు సినీ కెరీర్‌ను మలుపుతిప్పిన సినిమాల్లో త్రిశూలం కూడా ఒకటి. ఈ సినిమాలో శ్రీదేవి, జయసుధ, ప్రభాకర్ రెడ్డి, గొల్లపూడి మారుతీరావు, అల్లు రామలింగయ్య, చలపతిరావు, తులసి, రాజ్యలక్ష్మి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన త్రిశూలం సినిమాలోని కృష్ణంరాజు నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. కేవీ మహదేవన్ సంగీతం అందించిన ఈ సినిమాను యు.సూర్యనారాయణరాజు నిర్మించారు.
6. బొబ్బిలి బ్రహ్మన్న (1984)
రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) నటించిన మరో యాక్షన్ ఎంటర్‌టైనర్ బొబ్బిలి బ్రహ్మన్న. ఈ సినిమాలో బొబ్బిలి బ్రహ్మన్నగా ఆయన నటనకు విమర్శకుల ప్రశంసలు కూడా లభించాయి. యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు. బొబ్బిలి బ్రహ్మన్న సినిమాలో శారద, జయసుధ, రావు గోపాలరావు, కైకాల సత్యనారాయణ, అన్నపూర్ణ, రాజేష్, అల్లు రామలింగయ్య, నూతన్ ప్రసాద్ కీలకపాత్రలు పోషించారు. సంగీత దర్శకుడు కె.చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.
7. రావణ బ్రహ్మ (1986)
కృష్ణంరాజు నటించిన మరో క్లాసికల్ మూవీ రావణ బ్రహ్మ. యాక్షన్, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో రాధ, లక్ష్మి, రాధిక, కైకాల సత్యనారాయణ, సూర్యకాంతం, గిరిబాబు, అల్లు రామలింగయ్య, చలపతిరావు కీలకపాత్రల్లో నటించారు. రావణ బ్రహ్మ సినిమాకి కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించారు.
8. తాండ్ర పాపారాయుడు (1986)
తాండ్ర పాపారాయుడు.. ఈ సినిమాలో కృష్ణంరాజు (Krishnam Raju) నటన, డ్రెస్సింగ్‌కు ఆయన ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. యాక్షన్ డ్రామా ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో జయప్రద, జయసుధ, సుమలత, మోహన్‌బాబు, రామకృష్ణ, బాలయ్య, జేవీ సోమయాజులు, కోట శ్రీనివాసరావు ముఖ్యపాత్రలలో నటించారు. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన తాండ్ర పాపారాయుడు సినిమా అప్పట్లో సూపర్‌హిట్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది.
9. పల్నాటి పౌరుషం (1994)
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన సినిమా పల్నాటి పౌరుషం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లో ట్రెండ్ సృష్టించింది. చరణ్‌రాజ్, రాధికా శరత్‌కుమార్, సురేష్, తనికెళ్లభరణి, బ్రహ్మానందం కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో కృష్ణంరాజు అద్భుతంగా నటించి తన అభిమానులతోపాటు సినీ ప్రేమికులను కూడా మెప్పించారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించారు.
10. నాయుడు గారి కుటుంబం (1996)
కృష్ణంరాజు నటించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ నాయుడు గారి కుటుంబం. ఫ్యామిలీ డ్రామాతోపాటు యాక్షన్ సీన్లలోనూ కృష్ణంరాజు తన మార్క్ నటనతో ఆకట్టుకుంటారు. బోయిన సుబ్బారావు దర్శకత్వంలో తెరకెక్కిన నాయుడు గారి కుటుంబం సినిమాలో కృష్ణంరాజు (Krishnam Raju)తోపాటు సుమన్, సంఘవి, చంద్రమోహన్, ప్రసాద్‌బాబు తదితరులు కీలకపాత్రలు పోషించారు. కోటి సంగీతం అందించిన ఈ సినిమాను దగ్గుబాటి రామానాయుడు నిర్మించారు.
ఇవే కాకుండా కృష్ణంరాజు నటనకు అద్దంపట్టే సినిమాలు ఎన్నో ఉన్నాయి. 1940, జనవరి 20వ తేదీన ఆంధ్రప్రదేశ్ నరసాపురం జిల్లా మొగల్తూరులో పుట్టిన కృష్ణంరాజు.. 26 ఏళ్ల వయసులో 1966లో చిలక గోరింక సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. దాదాపుగా 60 సంవత్సరాల సినీ ప్రస్థానంలో 180కు పైగా సినిమాల్లో నటించారు. కృష్ణంరాజు తమ్ముడి కొడుకు ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ‘రాధే శ్యామ్’లో చివరిగా నటించారు. ఎన్నో అవార్డులను అందుకున్నారు కృష్ణంరాజు. కేంద్ర మంత్రిగానూ బాధ్యతలు నిర్వర్తించిన రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) .. 2022, సెప్టెంబర్ 11వ తేదీన తుదిశ్వాస విడిచారు.
Read More : దివికేగిన ‘సినీ ధ్రువతార’: రెబల్‌స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) అస్తమయం.. విషాదంలో ఇండస్ట్రీ