రేపే సూపర్‌స్టార్ కృష్ణ (SuperStar Krishna) అంత్యక్రియలు.. ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి కీలక ప్రకటన
దిగ్గజ నటుడు సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ (SuperStar Krishna) మృతితో ఆయన ఫ్యామిలీతో పాటు చిత్ర పరిశ్రమ, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.
కృష్ణ అంత్యక్రియలను మంగళవారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయంపై కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు స్పందించారు. కృష్ణ పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఇవ్వాళ సాయంత్రం గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నామని ఆయన తెలిపారు. రేపు ఉదయం స్టేడియం నుంచి పద్మాలయ స్టూడియోస్‌కు భౌతికకాయాన్ని తరలిస్తామన్నారు. పద్మాలయ స్టూడియోస్‌లో కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు ఆదిశేషగిరి రావు పేర్కొన్నారు.
కృష్ణ మృతిపై ఆయన కుటుంబ సభ్యులు కీలక ప్రకటన చేశారు. ‘కృష్ణ ఎంతో మందికి స్పూర్తిగా నిలిచిన గొప్ప మహనీయుడు. అందుకే ఆయనను మేమేంతో గొప్పగా ప్రేమిస్తాం. ఆయన లేరనే విషయం ప్రతీ రోజు మాకు విషాదాన్ని పంచుతుంది. అందుకే మేం ఆయనకు గుడ్ బై చెప్పడానికి ఇష్టపడటం లేదు. కృష్ణ ఎప్పడూ మాతోనే ఉంటారు’ అని ఆ ప్రకటనలో ఘట్టమనేని కుటుంబ సభ్యులు తెలిపారు.
కృష్ణ నిజమైన సూపర్‌స్టార్: అల్లు అర్జున్
కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలంటూ సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. మన అల్లూరి, మన జేమ్స్ బాండ్ అయిన కృష్ణ గారి మరణం తెలుగు వారికి తీరనిలోటు అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఇది మాటలకు అందని విషాదమని మెగాస్టార్ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కృష్ణ మృతితో తన గుండె ముక్కలైందని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అన్నారు. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవలు మాటల్లో వర్ణించలేమని చెప్పారు. కృష్ణ నిజమైన సూపర్‌స్టార్ అని బన్నీ పేర్కొన్నారు.