అనుష్క (Anushka) తర్వాతి సినిమా నుంచి క్రేజీ అప్డేట్.. 'అన్విత రవళి శెట్టి' గా షెఫ్ పాత్రలో స్వీటీ!
తెలుగు చిత్రపరిశ్రమలో ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనుష్క (Anushka). తెలుగు, తమిళ భాషల్లో అగ్రకథానాయికగా రాణించిన అనుష్క కొంతకాలంగా ఇటు తెలుగులో గానీ.. అటు తమిళంలో గాని సినిమాలు చేయడం లేదు. ఈ నేపథ్యంలో అనుష్క ఇక సినిమాలు చేయడం మానుకున్నట్టేనన్న ప్రచారం కూడా జోరుగానే సాగింది.
వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా అండే స్వీటీ.. 'బాహుబలి' (Bahubali) సినిమా తర్వాత సైలెంట్ అయ్యింది. అయితే ఈ సినిమా తర్వాత హీరో ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీ కాగా.. అనుష్క మాత్రం మరే ప్రాజెక్ట్ ప్రకటించలేదు. 'నిశ్శబ్దం' తర్వాత ఆమె నుంచి ఇంకో సినిమా రాలేదు. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యతనిస్తూ, ఇతర హీరోల సరసన హీరోయిన్‌గా నటించే సినిమాలను చాలావరకు అనుష్క పక్కనబెట్టేసింది. దీంతో ఈ బ్యూటీ కెరీర్ చాలా నెమ్మదిగా సాగుతోంది.
ఈ నేపథ్యంలోనే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో ఒక సినిమా చేయడానికి అనుష్క అంగీకరించినట్టుగా ఒక వార్త వినిపించింది. నాయిక ప్రధానమైన ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty) ఒక ముఖ్యమైన పాత్రను పోషించనున్నట్టు వార్తలు వచ్చాయి. యూవీ క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక, ఈ సినిమాకు పి. మహేష్ బాబు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాను ప్రకటించినప్పటినుంచీ, ఇందులో అనుష్క పాత్ర ఎలా ఉండబోతుందా, ఈ సినిమాలో ఆమె ఎలా కనిపిస్తుందా అనే ఆసక్తి స్వీటీ అభిమానుల్లో నెలకొంది. తాజాగా, అనుష్క బర్త్‌డే సందర్భంగా.. ఈ సినిమాలో నుంచి ఆమె పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను (Anushka First Look) చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
ఇందులో అనుష్క చెఫ్ పాత్రలో నటిస్తున్నట్లుగా ఈ పోస్టర్ చూస్తే అర్థమవుతోంది. ప్రొఫెషనల్ చెఫ్ 'అన్విత రవళి శెట్టి' (Anvitha Ravali Shetty) పాత్రలో ఆమె ఈ సినిమాలో నటిస్తోంది. కెరియర్ పరంగా అనుష్కకు ఇది 48వ సినిమా కావడం విశేషం.
‘వినూత్నమైన కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. అనుష్క పాత్ర కొత్త పంథాలో ఉంటుంది. చాలా విరామం తర్వాత ఆమె నటిస్తున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది’ అని చిత్రబృందం పేర్కొంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్ లో రూపొందుతున్న ఈ సినిమాకి, త్వరలోనే టైటిల్ ను ఖరారు చేయనున్నారు. మిగతా నటీనటుల వివరాలు కూడా త్వరలోనే తెలియనున్నాయి.