Ramarao On Duty Review : మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) జనాలను మెప్పించాడా ? లేదా ?

Updated on Jul 29, 2022 08:03 PM IST
Ramarao on Duty Movie Poster (రామారావు ఆన్ డ్యూటీ) మూవీ పోస్టర్
Ramarao on Duty Movie Poster (రామారావు ఆన్ డ్యూటీ) మూవీ పోస్టర్

సినిమా : రామారావు ఆన్ డ్యూటీ
నటీనటులు: రవితేజ, దివ్యాన్ష కౌశిక్, రజిషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ
దర్శకత్వం: శరత్ మండవ

కెమెరా: సత్యన్ సూర్యన్ 
ఎడిటర్: ప్రవీణ్ కె.ఎల్
సంగీతం: శ్యామ్‌ సి ఎస్
నిర్మాత: సుధాకర్ చెరుకూరి
విడుదల తేదీ: 29 జూలై 2022

రేటింగ్: 2.5 / 5

మాస్ మహారాజా రవితేజ (Ravi Teja) నటించిన తాజా సినిమా ‘రామారావు ఆన్‌ డ్యూటీ’. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూలై 29 తేదిన రిలీజైంది. రజిషా విజయన్, దివ్యాంశ కౌషిక్ హీరోయిన్లుగా నటించారు. తనికెళ్ల భరణి, తొట్టెంపూడి వేణు కీలకపాత్రలు పోషించారు. 

రవితేజ పవర్‌‌ఫుల్ డైలాగ్స్‌తో ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాకు విడుదలకు ముందే విపరీతమైన క్రేజ్ వచ్చింది. ‘ఖిలాడి‘ సినిమాతో నెగెటివ్ టాక్ తెచ్చుకున్న రవితేజ.. ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. 

కథ గురించి..

1995 సంవత్సరం.. ఆ సమయంలో జరిగిన కొన్ని నిజ సంఘటనల ఆధారంగా దర్శకుడు కథ రాసుకున్నాడు. రామారావు (రవితేజ) నీతి, నిజాయితీ కలిగిన తహశీల్దార్‌. ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రజలకు సేవ చేయడానికి మార్గమని నమ్ముతాడాయన. శ్రీకాకుళంలో భూములు కోల్పోయిన రైతుల పక్షాన నిలిచి వారికి సరైన పరిహారం అందిస్తాడు.

ఆ తర్వాత చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్‌కు బదిలీపై వస్తాడు రామారావు. ఇక్కడే తన మాజీ ప్రేయసి మాలికను (రజీషా విజయన్‌) మళ్ళీ కలుస్తాడు. ఇదే క్రమంలో ఆమె భర్త ఏడాదిగా కనిపించడం లేదని తెలుసుకుంటాడు.

ఈ మిస్సింగ్‌ కేసును ఛేదించే బాధ్యతను తాానే తీసుకుంటాడు రామారావు. ఈ క్రమంలో మాలిక భర్తతో పాటు అదే ప్రాంతానికి చెందిన మరో ఇరవై మంది కూడా ఊరి నుండి మిస్సింగ్ అని తెలుసుకొని షాక్ అవుతాడు.

ఈ మిస్సింగ్‌ కేసులను పరిశోధించే క్రమంలో రామారావుకు తెలిసిన భయంకరమైన నిజాలేమిటి? అంతమంది మిస్ అవ్వడానికి వెనుక ఎర్రచందనం మాఫియా ప్రమేయం ఏమిటి? ఈ కేసును రామారావు ఎలా ఛేదించారు? దోషులను ఎలా పట్టుకున్నారు అనేది సినిమా కథ.

 

Rama Rao on Duty

కథా విశ్లేషణ

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగి అంటే వ్యవస్థలోని లోటుపాట్లను తెలుసుకుని, వాటిని ఎలా పరిష్కరించాడనేదే కాన్సెప్ట్‌గా ఉంటుంది. అయితే ఈ కథను ఎర్రచందనం మాఫియా బ్యాక్ డ్రాప్‌లో, వాళ్లకు సహకరించే పోలీస్‌ నెట్‌వర్క్‌ను ఇన్వాల్వ్‌ చేసి సినిమాని ఆసక్తిగా మలిచారు దర్శకుడు.

దీనికి మర్డర్‌ మిస్టరీని కూడా యాడ్‌ చేసి ఇన్వెస్టిగేటివ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కథను నడిపించారు. రామారావు క్యారెక్టర్‌‌ను పరిచయం చేసిన తీరును చూసి.. సమాజంలో ఉండే సమస్యలపై పోరాడే ఉద్యోగిగా రవితేజ కనిపిస్తారని అందరూ అనుకుంటారు. అయితే తన మాజీ ప్రేయసి భర్త మిస్సింగ్ కేసు, దాని వెనుక ఉన్న మిస్టరీతో కథ ఆసక్తిగా మారుతుంది.

కథ బాగానే ఉన్నప్పటికీ, దానిని నడిపించిన తీరు ఇంటర్వెల్ తర్వాత ప్రేక్షకులలో ఉత్కంఠను పంచలేకపోయింది. తన పిన్ని కొడుకు అనంత్‌ (రాహుల్‌ రామకృష్ణ) కూడా మాఫియా నెట్‌వర్క్‌‌లో భాగమేనని రామారావు తెలుసుకునే ఎపిసోడ్‌ కొంత ఆసక్తిని రేకెత్తించినా.. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్‌ సీన్లు అన్నీ ప్రేక్షకులు ఊహించినట్టుగానే జరుగుతాయి.  

రవితేజ వంటి మాస్‌ హీరోతో ఇన్వెస్టిగేటివ్‌ సినిమా చేయాలనే ప్రయత్నం కొత్తగా అనిపించినా.. పలు కమర్షియల్‌ అంశాలు మిస్‌ అయ్యాయి. అయితే యాక్షన్ సీన్లు మాత్రం అభిమానుల్ని ఆకట్టుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడికి మంచి మార్కులే పడ్డాయి. ఇక  క్లైమాక్స్‌ అంతగా ఆసక్తిగా లేకపోవడం సినిమాకు మైనస్.

ఇక తన మిషన్‌లో సక్సెస్‌ అయిన రామారావును, ఎర్రచందనం మాఫియాను అణచివేసే స్పెషలాఫీసర్‌గా ప్రభుత్వం నియమించడమనేది మరో ట్విస్ట్. కథలోని ఈ మలుపుతో రామారావు ఆన్‌ డ్యూటీ సినిమాకు సీక్వెల్‌ ఉంటుందని దర్శకుడు హింట్‌ ఇవ్వకనే ఇచ్చేశారు.

ఎవరెవరు ఎలా చేశారంటే?

డిప్యూటీ కలెక్టర్‌‌గా, హై ఓల్టేజ్ మాస్ పెర్ఫార్మెన్స్‌తో రవితేజ తన మార్కు ఎనర్జీతో ప్రేక్షకులను అలరించారు. ఫస్టాఫ్‌లో మాస్‌ ఎలిమెంట్స్, రవితేజ యాక్టింగ్ సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్లాయి. పాటలు పెద్దగా అలరించకున్నా యాక్షన్ సీన్లలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉంది. ఇక రవితేజ చేసిన ఇన్వెస్టిగేషన్ సీన్స్‌ సినిమాకు హైలైట్‌.

అలాగే ప్రీ ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో యాక్షన్ సీన్లు బాగున్నాయి. కొత్త డైరెక్టర్‌‌ అయిన శరత్‌ మండవ రవితేజను స్క్రీన్‌ మీద డిఫరెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఈ తరహా యాక్షన్ సీన్లు రవితేజకు కొత్త కానప్పటికీ, బోర్ కొట్టకుండా తీసి మంచి మార్కులు వేయించుకున్నారు శరత్. 

చాలా కాలం తర్వాత వేణు తొట్టెంపూడి 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్, పెర్ఫామెన్స్‌ బాగున్నాయి. అయితే కథలో తనకు అంత ప్రాధాన్యత లేకపోవడం మైనస్. హీరోయిన్లు రజీషా విజయన్, దివ్యాంశ కౌషిక్ క్యారెక్టర్లకు కొంత ప్రాధాన్యత ఇచ్చారు. నాజర్, తనికెళ్ల భరణి, రాహుల్ రామకృష్ణ, అరవింద్ కృష్ణ తమ పరిధిమేరకు నటించి వారివారి పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్‌గా..

రామారావు ఆన్‌ డ్యూటీ’ సినిమాలో రవితేజ మార్క్‌ తగ్గింది. కథను రాసుకున్న తీరు బాగున్నప్పటికీ, దానిని తెరకెక్కించడంలో దర్శకుడు పెద్దగా సక్సెస్ కాలేదు. అయితే ఇన్వెస్టిగేటివ్‌ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. 

Read More:  Rama Rao On Duty: 'రామారావు ఆన్ డ్యూటీ' మాస్ నోటీస్ రిలీజ్.. ర‌వితేజ ( Ravi Teja) మాస్ డైలాగులు కేక‌


 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!