MM Keeravani : సినీ సంగీత ప్రపంచాన అద్భుత వాణి.. మరకతమణి కీరవాణి !

Updated on Jul 04, 2022 06:55 PM IST
'అన్నమయ్య' చిత్రంలోని పాటలన్నింటికీ కీరవాణి (Keeravani) ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి స్వరకల్పన చేశారు.
'అన్నమయ్య' చిత్రంలోని పాటలన్నింటికీ కీరవాణి (Keeravani) ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి స్వరకల్పన చేశారు.

Keeravani: కోడూరి మరకతమణి కీరవాణి.. సినీ ఇండస్ట్రీకి ఎం.ఎం కీరవాణిగా సుపరిచితులు. అలాగే బాలీవుడ్ పరిశ్రమకు ఎం.ఎం.క్రీమ్‌గా కూడా ఈయన పరిచయమవ్వడం విశేషం. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళికి వరుసకు సోదరుడైన కీరవాణి భారతదేశం గర్వించదగ్గ సంగీత దర్శకులలో ముందువరుసలో ఉంటారు. 

తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషా చిత్రాలకు సైతం సంగీతాన్ని అందించిన కీరవాణి తాను స్వరకల్పన చేసిన 'అన్నమయ్య' చిత్రానికి జాతీయ పురస్కారం కూడా అందుకున్నారు. 

ఈ రోజు కీరవాణి (Keeravani) జన్మదినం సందర్భంగా, ఈయన స్వరాలు సమకూర్చిన సినిమాలలోని టాప్ 10 పాటలు మీకోసం ప్రత్యేకం. 

తెలుసా మనసా (క్రిమినల్) : వెన్నెలకంటి రచించిన ఈ అద్భుతమైన గీతాన్ని చిత్ర, ఎస్బీ బాలు ఆలపించారు. ఈ గీతానికి కీరవాణి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇప్పటికి కూడా ఈ ప్రేమగీతానికి ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది.

 

పూసింది పూసింది పున్నాగ (సీతారామయ్య గారి మనవరాలు) : వేటూరి కలం నుండి జాలువారిన ఈ పాట అచ్చ తెలుగు పదాలతో, అందమైన పదాల అల్లికలతో వినసొంపుగా ఉంటుంది. ఈ పాటకు అంత రమణీయతను అద్దిన ఘనత కీరవాణి గారిదే.

 

సీతమ్మ అందాలు (శుభ సంకల్పం) : ఎస్బీ బాలు, చిత్ర, శైలజ కలిసి ఆలపించిన ఈ గీతాన్ని వేటూరి రాయగా, కీరవాణి గారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పల్లె అందాల మధ్య, పచ్చని చెట్ల మధ్య సాగే ఈ పాటలో సంగీతం కూడా అంతే శ్రావ్యంగా, మధురంగా ఉంటుంది.

 

హృదయమనే కోవెల (పెళ్లి సందడి) : కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్లి సందడి చిత్రం ఎంత పెద్ద సూపర్ హిట్ సినిమానో మనకు తెలియంది కాదు. మొత్తం తొమ్మిది పాటలు కలిగిన మ్యూజికల్ బ్లాక్ బస్టర్ సినిమా ఇది. ఇందులో 'హృదయమనే కోవెల' అంటూ సాగే ప్రేమగీతానికి కీరవాణి అందించిన సంగీతం అత్యద్భుతమనే అనుకోవాలి. 

 

అపురూపమైనదమ్మ ఆడజన్మ (పవిత్ర బంధం) : స్త్రీ ఔన్నత్యాన్ని తెలిపే ఈ సెంటిమెంట్ సాంగ్‌‌ను సిరివెన్నెల సీతారామశాస్త్రి రాయగా, జేసుదాసు తన బాణీలో అద్భుతంగా ఈ గీతాన్ని ఆలపించారు. కీరవాణి (Keeravani) స్వరకల్పన చేసిన మరో గొప్ప గీతమిది.

ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి (స్టూడెంట్ నెంబర్ 1) : చంద్రబోస్ కలం నుండి జాలువారిన ఈ కాలేజీ ఫేర్‌వెల్ గీతానికి కీరవాణి స్వరకల్పన చేయడమే కాకుండా, తానే స్వయంగా పాడారు. తెలుగు రాష్ట్రాలలోని దాదాపు ప్రతీ విద్యార్థికి ఈ గీతం సుపరిచితమే.

మౌనంగానే ఎదగమని (నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్) : రవితేజ కథానాయకుడిగా నటించిన 'నా ఆటోగ్రాఫ్.. స్వీట్ మెమోరీస్' సినిమాలోని 'మౌనంగానే ఎదగమని' అంటూ సాగే పాట యువతలో ప్రేరణను, ఆత్మస్థైర్యాన్ని నింపే గొప్ప గీతంగా చరిత్రలో నిలిచిపోయింది. ఈ గీతాన్ని చంద్రబోస్ వ్రాయగా, గాయని చిత్ర ఆలపించారు. కీరవాణి (Keeravani) ఈ పాటకు అమోఘమైన రీతిలో స్వరకల్పన చేశారు.

అన్నమాచార్యుని కీర్తనలు : వాగ్గేయకారుడు తాళ్ళపాక అన్నమాచార్యుని జీవితకథ ఆధారంగా తెరకెక్కిన 'అన్నమయ్య' చిత్రంలోని పాటలన్నింటికీ కీరవాణి (Keeravani) ఎంతో శ్రమకోర్చి, పరిశోధించి స్వరకల్పన చేశారు. ఆ విధంగా ఆయన ప్రతిభ జగద్విఖ్యాతం అయ్యింది. పైగా జాతీయ పురస్కారం కూడా ఆయనను వరించింది.

నిప్పులే శ్వాసగా (బాహుబలి) : ఇనగంటి సుందర్ కలం నుండి జాలువారిన ఈ పాటకు కీరవాణి స్వరకల్పన చేయడమే కాకుండా, గాయకుడిగా కూడా వ్యవహరించారు. పదాలకు తగ్గ బాణీలను అద్భుతమైన రీతిలో అందించారు. 

 


 

ఈ గీతాలన్నీ కూడా బహుళ ప్రేక్షకాదారణ పొందినవే. అలాగే సినీ అభిమానుల గుండెలలో చిరస్థాయిగా నిలిచిపోయినవే. 

Read: 'మళ్లి కూయవే గువ్వా' అంటూ తెలుగు సినీలోకాన్ని సంగీతంతో నిద్రలేపిన.. 'మాస్టర్ ఆఫ్ మ్యూజిక్' చక్రి !

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!