Chakri : 'మళ్లి కూయవే గువ్వా' అంటూ తెలుగు సినీలోకాన్ని సంగీతంతో నిద్రలేపిన.. 'మాస్టర్ ఆఫ్ మ్యూజిక్' చక్రి !

Updated on Jun 15, 2022 06:48 PM IST
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (Chakri)
మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (Chakri)

బాచి సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (Chakri). తక్కువ సమయంలోనే హిట్ సినిమాలకు బాణీలు ఇచ్చి స్టార్‌‌ మ్యుజీషియన్‌గా పేరు సంపాదించుకున్నారు. మాస్‌ పాటలతో కుర్రాళ్ల గుండెల్లో, మెలోడీ బాణీలతో సంగీత ప్రియుల మనసుల్లో, ప్రేమ పాటలతో ప్రేమికుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు చక్రి.

తక్కువ సినిమాలకు మ్యూజిక్ అందించి.. వాటితోనే ఇండస్ట్రీలో చిరకాలం గుర్తుండిపోయే పాటలను మనకందించారు. ‘పిలిచిన పలకదు ప్రేమా’ అంటూ చిన్న వయసులోనే మనందరికీ దూరమయ్యారు చక్రి. నేడు చక్రి జయంతి.

ఆల్బమ్స్‌తో కెరీర్ ప్రారంభించిన చక్రి

1974 జూన్ 15న తెలంగాణలోని కంబాలపల్లిలో జన్మించారు చక్రి. చక్రి పూర్తి పేరు గిల్లా చక్రధర్. సంగీతం అంటే చక్రికి చిన్నప్పటి నుంచే ఇష్టం. తండ్రి అనుమతి, సహకారంతో సంగీతం నేర్చుకుని.. విపరీతంగా సాధన చేసేవారు చక్రి. ముందుగా ఒక ఆల్బమ్ తయారు చేసి దానిని ఇండస్ట్రీలోని డైరెక్టర్లు, నిర్మాతలకు వినిపించడానికి తిరిగేవారు చక్రి.

ఈయన ఏం సంగీతం చేయగలడు అని చాలామంది నిరుత్సాహపరచేవారు. అయినా చక్రి ప్రయత్నించేవారు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్​ దర్శకత్వం వహించిన మొదటి సినిమా ‘బాచి’లో చక్రికి అవకాశం దక్కింది.

భార్య శ్రావణితో మ్యూజిక్ డైరెక్టర్ చక్రి (Chakri)

పూరి జగన్నాథ్‌ ‘బాచి’ సినిమాతో ఎంట్రీ..

జగపతిబాబు హీరోగా నటించిన ‘బాచి’ సినిమా దర్శకుడిగా పూరి జగన్నాథ్‌కే కాదు.. మ్యూజిక్ డైరెక్టర్‌‌గా చక్రికి కూడా మంచిపేరు తెచ్చిపెట్టింది. తరువాత పూరి జగన్నాథ్‌ సినిమాలకు వరుసగా చక్రి సంగీతం అందించేవారు. పూరీ దర్శకత్వంలో వచ్చిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’, ‘ఇడియట్’, ‘అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి’, ‘ఆంధ్రావాలా’, ‘శివమణి’, ‘దేశముదురు’ సినిమాలకు చక్రి సంగీతం అందించారు.

చక్రి బాణీల్లో కొత్తదనం ఉండడంతో ఆయనతో సినిమాకు సంగీతం చేయించుకోవడానికి డైరెక్టర్లు ఎగబడేవారు. అమ్మాయిలు అబ్బాయిలు, సత్యం, వీడే, దేవదాస్, ఢీ, కృష్ణ, మస్కా, సింహా, దేనికైనా రెడీ, అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, వెన్నెల్లో హాయ్ హాయ్ సినిమాల్లో సంగీతానికి చక్రికి మంచి పేరు వచ్చింది.

సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సంగీతం మీద ఉన్న మక్కువతో చక్రి ప్రైవేట్ ఆల్బమ్స్‌ కూడా చేసేవారు. అప్పట్లో ఆయన ఆల్బమ్స్‌కు మంచి మార్కెట్‌ ఉండేది. గాయకుడిగా కొన్ని పాటలను ఆలపించి అలరించారు కూడా. చక్రి తన అభిమాన సంఘాల ద్వారా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేవారు. 2014 డిసెంబర్ 15న చక్రి తుది శ్వాస విడిచారు.

చిన్నవయసులోనే చక్రి లాంటి ప్రతిభ ఉన్న సంగీత దర్శకుడు కన్నుమూయడం తెలుగు సినిమాకు తీరని లోటే! ఇప్పటికీ ఆయన అభిమానులు కొందరు ఆయన పంథాలోనే పయనిస్తూ.. పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం విశేషం.

Read More : మణిరత్నం (Maniratnam) 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో రీఎంట్రీ ఇవ్వబోతున్న షాలినీ?

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!