Telugu Movies: తెలుగు సినిమా చరిత్రలో.. ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్లు నమోదు చేసిన చిత్రాలివే !
ప్రతి సంవత్సరం టాలీవుడ్ పరిశ్రమలో కొన్ని వందల సంఖ్యలో సినిమాలు (Telugu Movies) విడుదల అవుతుంటాయి. కానీ అందులో కూడా ప్రేక్షకాదరణ పొందేవి కొన్ని మాత్రమే. అలాంటి సినిమాలలో కూడా విశేష ఆదరణ పొంది సూపర్ హిట్లుగా, బ్లాక్ బస్టర్స్‌గా నిలబడగలిగిన చిత్రాలు మాత్రం నిజంగానే చరిత్రలో నిలిచిపోతాయి. ఆల్ టైమ్ రికార్డ్స్ సాధించి సినీ చరిత్ర పుటల్లోకి ఎక్కేస్తాయి. అలాంటి చిత్రాలలో కొన్ని మీకోసం
బాహుబలి ది కంక్లూజన్ (Bahubali The Conclusion) : ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి తొలి భాగానికి కొనసాగింపు ఈ చిత్రం. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడన్న ప్రశ్నకు ఈ సినిమాలోనే ప్రేక్షకులకు సమాధానం దొరుకుతుంది. అమరేంద్ర బాహుబలి కుమారుడైన మహేంద్ర బాహుబలి ఎలా భళ్లాలదేవుడి పై పగ తీర్చుకుంటాడో ఈ చిత్రంలో చూడవచ్చు
ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ.1810 కోట్లు వసూళ్లు సాధించింది ఈ చిత్రం. అలాగే అనేక చలనచిత్ర రికార్డులను కూడా ఇది తిరగరాసింది. విదేశాలలో కూడా ఈ చిత్రం ఎంతో ఆదరణను పొందింది. పలు అవార్డులు, రివార్డులను కూడా గెలుచుకుంది. ఎందరో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.
ఆర్ఆర్ఆర్ (RRR) : ఎస్ ఎస్ రాజమౌళి మెగాఫోన్ నుండి రూపొందిన మరో విజువల్ వండర్ ఆర్ఆర్ఆర్. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో రామ్ చరణ్.. అలాగే తెలంగాణ గిరిజన ఉద్యమ నాయకుడు కొమురం భీమ్‌ను పోలిన పాత్రలో జూనియర్ ఎన్టీఆర్‌లు ఒదిగిపోయారు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 1200 కోట్లు వసూళ్లు నమోదు చేసింది ఈ చిత్రం. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ చిత్రం, డిజిటల్ మాధ్యమంలో కూడా కొత్త రికార్డులను తిరగరాస్తోంది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి గొప్పగా సమీక్షలు రాశాయి.
బాహుబలి ది బిగినింగ్ (Bahubali The Beginning) : ప్రభాస్ హీరోగా ఎస్ ఎస్ రాజమౌళి తొలిసారిగా చేసిన జానపద ప్రయోగం బాహుబలి చిత్రం. ఈ సినిమా శివుడనే యువకుడు ఎలా తన జన్మ రహస్యం తెలుసుకుంటాడో మనకు తెలియజేస్తుంది. గిరిజన ప్రాంతంలో పెరిగిన శివుడు తన తండ్రి అమరేంద్ర బాహుబలి అని తెలుసుకున్నాక, భళ్లాలదేవుడి వద్ద బందీగా ఉన్న తన తల్లిని విడిపించడానికి ప్రణాళికలు రచిస్తాడు.
తర్వాత తన తండ్రి మరణానికి కారణం నమ్మకస్తుడైన కట్టప్పే అని తెలుసుకొని ఆశ్చర్యపోతాడు. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న విషయం రెండో భాగంలో చూపిస్తామని దర్శకుడు చెప్పడంతో.. ఆ చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బాహుబలి ది బిగినింగ్ చిత్రం దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది.
సాహో (Saaho) : బాహుబలి సినిమా రెండు భాగాలు కూడా సూపర్ సక్సెస్ కావడంతో, ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయారు. ఈ క్రమంలో యువ దర్శకుడు సుజీత్‌కు ఆయన అవకాశమిచ్చారు. శ్రద్ధాకపూర్ ఈ సినిమాలో కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో సిద్ధార్థ్ నందన్ సాహోగా, అశోక చక్రవర్తిగా రెండు విభిన్న పాత్రలలో ప్రభాస్ కనిపిస్తారు.
దాదాపు రూ.433 కోట్లను ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కొల్లగొట్టింది. అయితే ఇదే సినిమాపై నెగటివ్ టాక్ కూడా రావడం గమనార్హం. ముఖ్యంగా దర్శకుడి అనుభవ రాహిత్యం సినిమాలో కొట్టొచ్చినట్లు కనిపించిందని కూడా పలు విమర్శలు వచ్చాయి. ఏదేమైనా, సాహో ఆ సంవత్సరం 2019 లో విడుదలైన తెలుగు సినిమాలలో (Telugu Movies) ఒకానొక హయ్యస్ట్ గ్రాసర్‌గానే నిలిచింది.
పుష్ప ది రైజ్ (Pushpa The Rise) : సుకుమార్ దర్శకత్వంలో ఎర్ర చందనపు స్మగ్లర్ల జీవితంపై తెరకెక్కించిన చిత్రం పుష్ప ది రైజ్. ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్పరాజ్ పాత్రలో మాస్ అప్పీలింగ్ ఉన్న క్యారెక్టరైజేషన్‌తో రెచ్చిపోయారనే చెప్పాలి. తెలుగుతో పాటు హిందీ భాషలో కూడా ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది.
దాదాపు ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రానికి ఉత్తరాదిలో భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. నటి సమంత పై చిత్రీకరించిన ప్రత్యేక గీతం కూడా మంచి ఆదరణను పొంది, సినిమా విజయానికి దోహదపడిందని చెప్పవచ్చు. మలయాళం స్టార్ ఫాహద్ ఫాజిల్ ఈ చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. ఉత్తరాదిలో కూడా సూపర్ కలెక్షన్లు రాబట్టిన తెలుగు సినిమాలలో (Telugu Movies) పుష్ప కూడా ఒకటిని మనం చెప్పుకోవచ్చు.
అలవైకుంఠాపురంలో (Ala Vaikunthapurramuloo) : త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎవరి స్వార్థం కోసమో, చిన్నప్పుడే తనను కన్న తల్లిదండ్రులకు దూరమైన బంటు అనే పాత్రలో అల్లు అర్జున్ జీవించారని చెప్పాలి. పైగా ఈ సినిమాలో సాంగ్స్ కూడా ఈ చిత్ర విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు.
ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 280 కోట్లను వసూలు చేసిన ఈ చిత్రం, తర్వాత హిందీలో కూడా డబ్ చేయబడింది. దించక్ అనే ఛానల్‌లో మంచి టీఆర్పీని కూడా దక్కించుకుంది. తమన్ సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్ పాత్ర పోషించారు. అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. 2020 లో విడుదలైన తెలుగు సినిమాలలో (Telugu Movies) ఈ చిత్రం మెరుగైన కలెక్షన్లనే రాబట్టిందని చెప్పవచ్చు.
సరిలేరు నీకెవ్వరు (Sarileru Neekkevaru) : అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ చిత్రంలో సమాజంలోని ముష్కరుల ఆగడాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రయత్నించే సైనికుడి పాత్రలో మహేష్ బాబు నటించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ విజయ్ శాంతి కూడా ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర పోషించారు.
దాదాపు రూ.260 కోట్లు వసూళ్లు చేసిన ఈ చిత్రంలో యాక్షన్‌తో పాటు కామెడీ కూడా సమపాళ్లలో ఉంటుంది. ముఖ్యంగా కథానాయిక రష్మికతో దర్శకుడు చేయించిన వెరైటీ కామెడీ కూడా మాస్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు హెల్ప్ అయ్యింది. ప్రకాష్ రాజ్ ఈ చిత్రంలో విలన్‌గా నటించారు
సైరా నరసింహారెడ్డి (Sye Raa) : సురేంద్ర రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తీసుకొని తెరకెక్కించిన చిత్రం సైరా. ఈ చిత్రంలో చిరంజీవి సరసన తమన్నా, నయనతార నటించారు. అలాగే బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించారు.
రేనాటి చోళుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బ్రిటీష్ వారికి శిస్తు కట్టకుండా, తన హక్కులకై పోరాటం చేస్తూ.. ప్రజలలో ఎలా స్వాతంత్ర్య కాంక్షను రగిలిస్తాడన్నదే ఈ చిత్రకథ. ఈ సినిమాకి రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహరించారు.
దాదాపు రూ. 240 కోట్ల వసూళ్లను సాధించింది ఈ చిత్రం. అయితే, సినిమా బడ్జెట్‌తో పోలిస్తే, ఓవరాల్‌గా ఈ సినిమా ద్వారా నిర్మాతలకు మిగిలింది తక్కువేనని చెప్పాలి. తెలుగు చిత్రాలలో (Telugu Movies) చారిత్రక కథాంశాలతో తెరకెక్కిన అతి కొద్ది సినిమాలలో సైరా నరసింహారెడ్డి కూడా ఒకటి అని చెప్పుకోవచ్చు.
రంగస్థలం (Rangasthalam) : సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రంగస్థలం' చిత్రంలో చెవిటితనంతో బాధపడే గ్రామీణ యువకుడు చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్, అతడి ప్రేయసి పాత్రలో సమంత నటించారు. తన అన్నను చంపిన రాజకీయ నాయకుడిపై పగ తీర్చుకోవడానికి ఓ యువకుడు తనకంటూ ఏర్పరచుకున్న ఓ లక్ష్యమే ఈ 'రంగస్థలం' సినిమా కథ.
ఆది పినిశెట్టి, అనసూయ భరద్వాజ్, జగపతి బాబు మొదలైన వారు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 216 కోట్లు వసూళ్లు సాధించిందీ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు. ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.
భరత్ అను నేను (Bharat Anu Nenu) : కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సమకాలీన రాజకీయ పరిస్థితులకు అద్దం పడుతుంది. ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన ఓ చదువుకున్న యువకుడు ఎలా అవినీతిపరులైన రాజకీయ నాయకులను ఎదుర్కొంటాడు? తన పాలనలో ఎలాంటి సంస్కరణలు తీసుకువస్తాడు? అన్నదే ఈ సినిమా కథ.
దాదాపు రూ.187 కోట్ల వసూళ్లు సాధించిన ఈ చిత్రం 2018 లో విడుదలైంది. డివివి దానయ్య ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. కైర అద్వానీ కథానాయికగా నటించారు. దేవీశ్రీప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా తర్వాత తమిళంలోకి కూడా డబ్బింగ్ వెర్షన్ రూపంలో విడుదలైంది. 2018 లో విడుదలైన తెలుగు సినిమాలలో (Telugu Movies) ఈ సినిమాకి కూడా ఓ ప్రత్యేక స్థానం ఉంటుంది.
ఈ టాప్ టాన్ చిత్రాలు కూడా టాలీవుడ్‌లో అత్యధిక కలెక్షన్స్ నమోదు చేసిన చిత్రాలుగా రికార్డులను నమోదు చేసినవే.