HBD Rajendra Prasad : తెలుగువారి ‘హాస్య నటకిరీటి’ రాజేంద్రప్రసాద్ .. కామెడీకి కేరాఫ్ అడ్రస్ ఈయన సినిమాలే !

Updated on Jul 19, 2022 07:41 PM IST
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) పేరు తెలుగు వారికి సుపరిచితమే. అప్పుల అప్పారావు, అహనా పెళ్లంట లాంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చాయి.
రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad) పేరు తెలుగు వారికి సుపరిచితమే. అప్పుల అప్పారావు, అహనా పెళ్లంట లాంటి చిత్రాలు ఈయనకు మంచి పేరు తెచ్చాయి.

టాలీవుడ్‌లో కామెడీ కింగ్‌గా అతడికి అతడే సాటి. హాస్య గుళికలతో మ్యాజిక్ చేయగల ఘనాపాటి. నవ్వుల రాజుగా చిత్రసీమను ఏలిన మన 'రాజేంద్ర ప్రసాద్' (Rajendra Prasad).. తెలుగు ప్రజల మదిలో 'నట కిరీటి'గా ఎప్పటికీ నిలిచే ఉంటారు. అందులో సందేహమే లేదు. ఈ రోజు ఆయన జన్మదినం సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం మీకోసం

ఎన్టీఆర్‌తో పరిచయం

1956 జూలై 19 తేదిన కృష్ణా జిల్లా గుడివాడకు దగ్గరలోని దొండపాడు గ్రామంలో ఓ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) అనుకోకుండా సినిమాలలోకి వచ్చారట. అంతకు ముందు ఆయన సిరామిక్ ఇంజనీరింగ్ చదివి, కొన్నాళ్లు ఉద్యోగం కూడా చేయడం విశేషం. 

ఆయన తండ్రి కుటుంబానికి, ఎన్టీఆర్ కుటుంబానికి బాగా పరిచయం ఉండేది. అందువల్ల రాజేంద్రప్రసాద్ నిమ్మకూరు వెళ్లినప్పుడల్లా ఎన్టీఆర్‌ను తప్పకుండా కలిసేవారట. ఆయన ప్రోత్సహంతోటే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కూడా చేరారు. 

తొలి చిత్రం బాపుతో..

దర్శకుడు బాపు దర్శకత్వంలో తొలిసారిగా రాజేంద్రప్రసాద్ 'స్నేహం' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా హిట్ కావడంతో ఆయనకు వెనువెంటనే అవకాశాలొచ్చాయి. మంచుపల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్ళి చూపులు, రామరాజ్యంలో భీమరాజు మొదలైన సినిమాలు రాజేంద్రప్రసాద్‌కు మంచి పేరు తీసుకొచ్చాయి. 

కానీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ ఉండాలని, కొన్ని పాత్రలకు తనను మాత్రమే తీసుకోవాలనే ఆలోచన దర్శకులకు రావాలని ఓ సందర్భంలో ఎన్టీఆర్ అన్నారట. ఆ మాటలు తనను బాగా ఆలోచింపజేసాయని.. అందుకే తన బాడీ లాంగ్వేజ్‌కి నప్పే కామెడీ సినిమాల మీదే ఎక్కువగా ఫోకస్ చేశానని పలు ఇంటర్వ్యూలలో తెలిపారు రాజేంద్ర ప్రసాద్

 

Rajendra Prasad in Gali Sampath

ఫుల్ లెంగ్త్ కామెడీ సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ (Rajendra Prasad)  ఇండస్ట్రీకి వచ్చాక ఒక కల్చర్.. రాకముందు ఒక కల్చర్ అనేది చిత్రసీమలో ఉండేది అనడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఆ రోజులలో సినిమాలలో హాస్య నటులు ఉన్నా.. వారితో పూర్తిస్థాయి హాస్యకథా చిత్రాలు తీయడానికి దర్శకులు వెనుకాడేవారు. ఒకవేళ హాస్యభరితమైన సినిమాలు తీసినా, అందులో కూడా టాప్ హీరోలే నటించేవారు. చలం, రాజబాబు, పద్మనాభం లాంటి హాస్యనటులను హీరోలుగా పెట్టి సినిమాలు తీసి దర్శకులు హిట్‌‌లు కొట్టినా, ఎందుకో ఆ సంప్రదాయం తర్వాత ముందు వెళ్లలేదు. 

కానీ రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)  ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక మాత్రం, ఆయన కోసమే దర్శకులు కొత్త కథలు రాసుకొనేవారట. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు, ఆయనకు ఉన్న పాపులారిటీ ఎలాంటిదో. ఒక్కో సంవత్సరం రాజేంద్రప్రసాద్ డజను సినిమాలు చేసిన రోజులు కూడా ఉన్నాయట. 

కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్

ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం, అప్పుల అప్పారావు, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, గోల్‌మాల్ గోవిందం, పెళ్లి పుస్తకం, మిస్టర్ పెళ్లాం, లేడీస్ టైలర్, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, జోకర్, అత్తింట్లో అద్దె మొగుడు, అహనా పెళ్ళంట  లాంటి సినిమాలు రాజేంద్ర ప్రసాద్‌కు కామెడీ జోనర్‌లో తిరుగే లేదని చాటి చెప్పాయి.

 

Rajendra Prasad in Ladies Tailor

నటనకు స్కోప్ ఉన్నా పాత్రలలోనూ..

వరుసగా కామెడీ సినిమాలు చేసినా కూడా, రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad)  అప్పుడప్పుడు ఎన్నో సినిమాలలో నటనకు స్కోప్ ఉన్న మంచి మంచి పాత్రలూ చేశారు. ముఖ్యంగా నవయుగం, ముత్యమంత ముద్దు, కాష్మోరా, ఎర్రమందారం, ఉదయం, ఆ నలుగురు, మీ శ్రేయోభిలాషి లాంటి సినిమాలలో రాజేంద్రప్రసాద్ ఆర్ద్రతతో నిండిన పాత్రలూ పోషించారు.

హాలీవుడ్‌లో కూడా..

రాజేంద్రప్రసాద్ తెలుగు, తమిళ భాషలలో నటించడమే కాకుండా.. ఓ హాలీవుడ్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. 'క్విక్ గన్ మురుగన్' పేరిట ఆయన నటించిన ఇంగ్లీష్ పిక్చర్ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాలో ఇండియన్ కౌబాయ్ పాత్రలో ఒక డిఫరెంట్ కామెడీ హీరో రోల్‌ని రాజేంద్రప్రసాద్ పోషించారు.   

 

Rajendra Prasad in Saileru Neekkevaru

అవార్డులు రివార్డులు

ఎర్రమందారం, ఆ నలుగురు  సినిమాలలో నటనకు గాను రాజేంద్రప్రసాద్ ఉత్తమ నటుడిగా రెండు సార్లు నంది పురస్కారం అందుకున్నారు. అలాగే జులాయి, శ్రీమంతుడు, మహానటి  సినిమాలలోని నటనకు గాను ఉత్తమ సహాయ నటుడిగా సైమా అవార్డు అందుకున్నారు. 

డబ్బింగ్ ఆర్టిస్టుగా

శంకర్ దర్శకత్వం వహించిన బాయ్స్ సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్‌లో నటుడు వివేక్‌కు రాజేంద్రప్రసాద్ వాయిస్ అందించారు. అలాగే తెనాలి సినిమాలో నటుడు జయరామ్‌కు కూడా డబ్బింగ్ చెప్పారు

పౌరాణిక పాత్రలలో

కన్నయ్య కిట్టయ్య సినిమాలో సాక్షాత్తు శ్రీక్రిష్ణుడి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనువిందు చేశారు. అలాగే దేవుళ్లు సినిమాలో హనుమంతుడి పాత్రను కూడా పోషించారు. 

సెకండ్ ఇన్నింగ్స్

గత పది సంవత్సరాల నుండి రాజేంద్రప్రసాద్ ఎక్కువగా సహాయ పాత్రలే చేస్తున్నారు. అప్పుడప్పుడు మాత్రమే ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సరిలేరు నీకెవ్వరు,  దాగుడుమూతల దండాకోర్, సేనాపతి, డ్రీమ్, గాలి సంపత్,ఎఫ్ 2 లాంటి సినిమాలలో మాత్రం కాస్త వైవిధ్యమైన పాత్రలను పోషించారు రాజేంద్రప్రసాద్

 

 

Rajendra Prasad in Aa Naluguru

ఏదేమైనా, కొన్ని తరాల పాటు కామెడీ జోనర్‌లో సోలో హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన ఘనత రాజేంద్రప్రసాద్‌కు కచ్చితంగా దొరుకుతుంది అనడంలో సందేహం లేదు. 

Read More:  ఎఫ్3 (F3) నాలుగు రోజుల్లో అంత వ‌సూళ్లు చేసిందా!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!