Annamayya : 25 ఏళ్ల క్రితం రిలీజ్ అయిన‌ అన్న‌మ‌య్య ఓ అద్భుతం

Updated on May 24, 2022 10:26 AM IST
Nagarjuna: అన్నమయ్య పాత్రలో ప్ర‌జ‌లు నాగార్జునను ఆద‌రిస్తారా.. అత‌నికి ఉన్న ఇమేజ్ త‌గ్గిపోదా? అంటూ  అప్పట్లో నెగెటివ్ టాక్ మొద‌లైంది.  కానీ అటువంటి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది.
Nagarjuna: అన్నమయ్య పాత్రలో ప్ర‌జ‌లు నాగార్జునను ఆద‌రిస్తారా.. అత‌నికి ఉన్న ఇమేజ్ త‌గ్గిపోదా? అంటూ అప్పట్లో నెగెటివ్ టాక్ మొద‌లైంది. కానీ అటువంటి అభిప్రాయాలను పటాపంచలు చేస్తూ, ఈ సినిమా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచింది. ఎన్నో అవార్డులను కైవసం చేసుకుంది.

అక్కినేని నాగేశ్వ‌రరావు కుమారుడు నాగార్జున (Nagarjuna) 'విక్ర‌మ్' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత మ‌జ్ను, ఆఖ‌రి పోరాటం, శివ‌, హ‌లో బ్ర‌ద‌ర్స్ వంటి హిట్ సినిమాల‌లో మాస్, క్లాస్ పాత్ర‌ల్లో కూడా రాణించారు. తెలుగు ప్రేక్ష‌కుల్లో త‌న‌కంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. అంత వ‌ర‌కు బానే ఉంది. ఇక, ఆ త‌ర్వాత నాగార్జున‌కు ఓ స‌వాల్ ఎదురైంది. 

ద‌ర్శ‌కేంద్రుడు రాఘ‌వేంద్ర‌రావు "తాళ్లపాక అన్నమయ్య" జీవిత చరిత్రను సినిమాగా మలచాలని ఉందని, అందులో టైటిల్ రోల్‌లో న‌టించాల‌ని నాగార్జున‌ను కోరారు. అన్నమయ్య స్టోరీలైన్ విన్నాక అక్కినేని నాగార్జున తొలుత తటపటాయించినా, ఆ తర్వాత ఒప్పుకున్నారు.  అయితే అన్నమయ్య లాంటి ఒక వాగ్గేయకారుడి పాత్రలో ప్ర‌జ‌లు నాగార్జునను ఆద‌రిస్తారా.. అత‌నికి ఉన్న ఇమేజ్ త‌గ్గిపోదా? అంటూ నెగెటివ్ టాక్ మొద‌లైంది.

కానీ, నాగార్జున అవేవి ప‌ట్టించుకోలేదు. పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుని పాత్రలో, నాగార్జున అద్భుతంగా న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించాడు.  భ‌క్తిరసప్రధానమైన సినిమాలు చేయ‌డం త‌న వ‌ల్ల కూడా సాధ్య‌మేనని నిరూపించాడు.

అన్న‌మ‌య్య‌ పాత్రలో నాగార్జున నటించారు అనే కన్నా, జీవించారని చెప్పాలి .రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన తొలి పౌరాణిక చిత్రం అన్నమయ్యే కావడం విశేషం. ఈ సినిమాను తెలుగుతో పాటు త‌మిళం, హిందీ భాషలలో కూడా డ‌బ్ చేసి రిలీజ్ చేశారు. దొరస్వామిరాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా, కీరవాణి ఈ చిత్రానికి అద్భుతమైన బాణీలను అందించారు. అన్నమయ్య చిత్రంలోని ప్రతీ పాట కూడా శ్రోతలను విపరీతంగా ఆకట్టుకోవడం గమనార్హం. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్లస్ పాయింట్. 

అన్నమయ్య పాత్రకు న్యాయం చేసేందుకు నాగార్జున చాలా కసరత్తు చేశారు. పైగా గొప్ప ఆధ్యాత్మికవాది పాత్రలో నటిస్తున్నారు కాబట్టి, నియమ నిష్టలతో కూడిన జీవితాన్ని గడపడం అలవాటు చేసుకున్నారు. ముఖ్యంగా మాంసాహారం మానేశారు. కటిక నేల పై నిద్రించేవారు. పాత్ర ఔచిత్యానికి భంగం కలగకూడదని, ఇన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు నాగార్జున. ఇక రచయిత జె.కె.భారవి ఈ చిత్రం కోసం చాలా పరిశోధనలు చేశారు. ఎన్నో గ్రంథాలు సేకరించి, వాటిలోని సారాన్ని ఔపోసన పట్టారు. చారిత్రక ఆధారాలతో, కథను తయారుచేసుకున్నారు. 

అయినా సినిమా విడుదల అయ్యాక దర్శక, నిర్మాతలు అందరికీ ఒకటే టెన్షన్. బాక్సాఫీసు ఫలితంపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కానీ ప్రేక్షకులు సానుకూలంగానే తీర్పునిచ్చారు. ముఖ్యంగా వెంకటేశ్వరస్వామి పాత్రలో నటించిన సుమన్‌కి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. స్వయానా రాష్ట్రపతే ఆయనతో ఫోన్ చేసి మాట్లాడడం, అప్పట్లో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. 

 

Nagarjuna: అన్న‌మ‌య్య సినిమా తీయాల‌నే ఆశ నెర‌వేర‌కుండానే చిత్ర క‌వి ఆత్రేయ మ‌ర‌ణించారు.

తెలుగు వాగ్గేయకారుడు అన్నమయ్య జీవిత చరిత్రను ఆధారంగా చేసుకొని ఈ సినిమాను నిర్మించారు. అన్నమయ్యపై చిత్రాన్ని తీయాలని గతంలో జంధ్యాలతో పాటు చాలా మంది ద‌ర్శ‌కులు అనుకున్నారు. అలాగే చిత్రక‌వి ఆత్రేయ 18 పాట‌ల‌ను సేక‌రించి.. స్వ‌యంగా ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల‌నుకున్నారు. కానీ ఈ ప్రయత్నాలు ఏవీ నెరవేరలేదు. 

అయితే, ఒక అద్భుత‌మైన దృశ్య కావ్యంగా 'అన్న‌మ‌య్య' చిత్రాన్ని మలచాలని ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర‌రావు (Kovelamudi Raghavendra Rao) అనుకున్నారు. ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 1997లో ఇదే ప్రాజెక్టు పట్టాలెక్కింది. అక్కినేని నాగార్జున  అన్న‌మ‌య్య‌గా నటించగా, ఆయన భార్య తిమ్మక్క పాత్రలో ర‌మ్య‌కృష్ణ‌, మరో సతీమణిగా కస్తూరి నటించారు. ఇక  క‌లియుగ దైవం వేంక‌టేశ్వ‌ర స్వామి పాత్రలో సుమ‌న్ ఒదిగిపోయారు. ఈ సినిమా పాట‌లు ఓ ట్రెండ్‌ను సృష్టించాయి. 

ముఖ్యంగా అన్నమాచార్యుని సంకీర్తనలకు జనాలు బ్రహ్మరథం పట్టారు. అలాగే ఎస్పీ బాలు, చిత్ర‌, ఎస్పీ శైల‌జా.. ఈ సినిమాలోని పాట‌లకు తమ గాత్రంతో ప్రాణం పోశారు. 

 

Nagarjuna: అన్న‌మ‌య్య నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు కెరీయ‌ర్‌లో అతి పెద్ద హిట్‌గా  నిలిచింది. 

"ఏలే ఏలే మ‌ర‌దాల" అంటూ అన్న‌మ‌య్య, తన మ‌ర‌ద‌ళ్ల‌తో ఆడిన వలపు ఆటలు ప్రేక్ష‌కుల‌కు న‌చ్చాయి. ఈ పాటకు రొమాంటిక్ టచ్ ఇస్తూ, ఇక్కడే దర్శకుడు రాఘవేంద్రరావు తన ప్రతిభను చూపారు.

అలాగే  'అంతర్యామి అలసితి సొలసితి' పాట‌లో నాగార్జున న‌ట‌న చూసిన, ప్ర‌తీ ప్రేక్షకుడు కన్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. అంత‌లా నాగ‌ర్జున అన్నమాచార్యుని పాత్ర‌లో ఒదిగిపోయారు. 'అన్న‌మ‌య్య' చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 42 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. రెండు కేంద్రాల్లో 176 రోజులు ఆడి చ‌రిత్ర సృష్టించింది. అన్న‌మ‌య్య క‌థ‌ను ర‌చ‌యిత జె.కె. భార‌వి చాలా పకడ్బందీగా రాశారు, ఇదే క్రమంలో దర్శకుడు రాఘవేంద్రరావు వద్దకు కథను వినిపించేందుకు వెళ్లారు.

క‌థ విన్న రాఘ‌వేంద్ర‌రావు భార‌వికి ప‌ది వేల రూపాయ‌లు అడ్వాన్స్‌గా ఇచ్చి. త‌న‌కు ఆ క‌థను ఇవ్వ‌మ‌ని అడిగార‌ట‌. తర్వాత, ఈ కథను సినిమాగా తీయాలని ఉందని, చాలామందికి చెప్పారట. అయితే చాలా మంది సినీ ప్ర‌ముఖులు, నాగార్జున ఇమేజ్ స్థాయికి ఈ పాత్ర అసలు సరిపోదని అభిప్రాయపడడం గమనార్హం. అయినా, రాఘ‌వేంద్రరావు అన్న‌మ‌య్య‌పై పెట్టుకున్న న‌మ్మ‌కానికి, ఆ రోజుల్లోనే రూ.10 కోట్ల షేర్ వ‌చ్చింది. అంతేకాదు నాగార్జున‌, రాఘ‌వేంద్ర‌రావు.. వీరిరువురి కెరీర్‌లో అతి పెద్ద హిట్‌గా అప్ప‌టికీ, ఇప్ప‌టికీ ఈ సినిమా నిలిచింది. 

 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!