విద్యాసాగర్ మరణం పై వస్తున్న పుకార్లపై స్పందించిన మీనా (Meena) ! తన భర్త మృతిని వివాదాస్పదం చేయవద్దని అభ్యర్థన
సినీ నటి మీనా (Meena) తన భర్త మరణాంతరం తొలిసారిగా మీడియా ముందు స్పందించారు. దయచేసి తన భర్త విద్యాసాగర్ మరణాన్ని వివాదస్పదం చేయవద్దని, ఇంటర్నెట్‌లో వస్తున్న పుకార్లను, అసత్య ప్రచారాలను నమ్మవద్దని ఆమె తన విచారాన్ని వ్యక్తం చేశారు. "ఇప్పటికే నా భర్త పోయిన బాధలో ఉన్నాను. నా ప్రైవసీకి భంగం కలిగించవద్దు" అని ఆమె వాపోయారు.
సీఎం స్టాలిన్‌కు ధన్యవాదాలు
సోషల్ మీడియాలో ఈ సందర్భంగా మీనా ఓ పోస్టును పంచుకున్నారు. "నా కష్టకాలంలో నాకు అండగా ఉన్న ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. నా భర్తను కాపాడడానికి వైద్యులు ఎంతో ప్రయత్నించారు. అలాగే తమిళనాడు సీఎంతో పాటు ఆరోగ్య శాఖ మంత్రి, ఐఏఎస్ రాధాకృష్ణన్ మొదలైనవారు నాకు అండగా నిలిచారు. కానీ విధి విచిత్రమైంది. ఆయన కోలుకోవాలని భావించిన అందరికీ, వారి ప్రేమకు నా ధన్యవాదాలు" అని ఇన్ స్టాగ్రాంలో మీనా (Meena) ఓ సందేశాన్ని పోస్టు చేశారు.
మీనా భర్త విద్యాసాగర్ గతకొంతకాలంగా ఊపిరితిత్తుల బాధతో బాధపడుతున్నారు. ఇదే క్రమంలో చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రిలో చేరిన ఆయన బుధవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలో ఆయన మరణంపై కొన్ని నెగటివ్ వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఆ వార్తలను ఖండిస్తూ, నేడు మీనా ప్రకటనను విడుదల చేశారు.
విద్యాసాగర్ మరణం పై స్పందించిన ప్రముఖ డ్యాన్స్ మాస్టర్
ఇటీవలే ప్రముఖ కొరియోగ్రాఫర్ కళ మాస్టర్, మీనా (Meena) భర్త మరణ వార్తపై స్పందించారు. మీనా కుటుంబంతో తనకున్న సన్నిహిత సంబంధాలను గురించి చెబుతూ, కరోనా సోకాక విద్యాసాగర్ ఆరోగ్యం కొంత క్షీణించిందని, ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ట్రాన్స్ ప్లాంట్ చేయాలని చెప్పారని ఆమె అన్నారు. కానీ ఇంత చిన్నవయసులో మీనా తన భర్తను కోల్పోవడం బాధాకరమని ఆమె విచారాన్ని వ్యక్తం చేశారు.
తెలుగుతో పాటు తమిళంలో కూడా మంచి నటిగా మీనా (Meena) పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. చిరంజీవి, వెంకటేష్, నాగార్జున లాంటి అగ్ర కథానాయకులు అందరితోనూ ఆమె నటించారు. తెలుగులో మీనా నటించిన సీతారామయ్య గారి మనవరాలు, అబ్బాయి గారు, స్నేహం కోసం, సూర్యవంశం, వెంగమాంబ లాంటి చిత్రాలు ఆమెకు ఎంతో పేరు తీసుకొచ్చాయి. 2009 లో ఆమె విద్యాసాగర్‌ని వివాహం చేసుకున్నారు.