Anushka Shetty Birthday Special : అరుంధతి, భాగమతి, దేవసేన, రుద్రమ్మ.. తెలుగు తెరపై స్త్రీ శక్తికి సిసలైన అర్థం చెప్పిన సూపర్ లేడీ !
టాలీవుడ్‌లో 'సూపర్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాక.. తన నటనతో దక్షిణాది సిసీ రంగంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి అనుష్క శెట్టి (Anushka Shetty). యోగా శిక్షకురాలిగా కూడా అనుష్కకి మంచి పేరుంది. ఆమె ఎందరో సెలబ్రిటీలకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం విశేషం.
తన కెరీర్‌లో ఎన్నో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్న అనుష్క, లేడీ ఓరియెంటేడ్ సినిమాలలో కూడా నటించి మెప్పించారు. ఆ తర్వాత అగ్ర కథానాయికగా ఎదిగారు. అనుష్క పుట్టినరోజు సందర్భంగా పింక్ విల్లా స్పెషల్ స్టోరి మీకోసం
కర్ణాటక భామ
అనుష్క శెట్టి 1981 నవంబర్ 7 వ తేదీన కర్ణాటకలోని మంగళూరులో జన్మించారు. తుళు భాష మాట్లాడే బంట్ కమ్యునిటీకి చెందిన అమ్మాయి ఈమె. అనుష్క బెంగళూరులోని మౌంట్ కార్మిల్ కాలేజ్‌లో కంప్యూటర్ సైన్సులో డిగ్రీ చేశాక.. యోగాలో ప్రొఫెషనల్ ట్రైనింగ్ తీసుకున్నారు. ప్రముఖ యోగా శిక్షకుడు, హీరోయిన్ భూమిక భర్త భరత్ ఠాగూర్ వద్ద యోగాలోని మెళకువలు నేర్చుకున్నారు.
కథానాయికగా ఎన్నో మైలు రాళ్ళు
అనుష్క శెట్టి యోగా ట్రైనర్‌గా పలువురు సెలబ్రిటీలకు శిక్షణ ఇచ్చేవారు. నాగార్జున్ లాంటి నటులకు కూడా ఆమె యోగాలో మెళకువలు నేర్పిన సందర్భాలున్నాయి. చిత్రమేంటంటే, నాగార్జున నటించిన 'సూపర్' చిత్రంతోనే అనుష్కకు తెలుగు చిత్ర పరిశ్రమలో తొలి అవకాశం వచ్చింది. ఈమె అసలు పేరు స్వీటీ శెట్టి. కానీ ఇండస్ట్రీకి వచ్చాక.. ఆమె తన పేరును అనుష్క శెట్టిగా మార్చుకున్నారు.
'సూపర్' సినిమా తరువాత మహానంది, విక్రమార్కుడు, అస్త్రం, రెండు, స్టాలిన్, డాన్, స్వాగతం, బలాదూర్, ఒక్క మగాడు, శౌర్యం, కింగ్, చింతకాయల రవి సినిమాల్లో అనుష్క నటించారు. టాలీవుడ్‌లోని అగ్ర కథానాయకులు అందరితోనూ ఆమె నటించారు.
అరుంధతిగా అదరగొట్టిన బొమ్మాళి
'అరుంధతి' సినిమా అనుష్క శెట్టికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కోడి రామకృష్ణ దర్శకత్వంలో నిర్మాత ఎమ్. శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో అరుంధతి, జేజమ్మ.. అనే రెండు విభిన్నమైన పాత్రలలో అనుష్క థియేటర్లలో దుమ్మురేపారు.
'అరుంధతి' చిత్రం అనుష్కకు తన కెరీర్‌లోనే ఓ మైలురాయిగా నిలిచింది. ఈ సినిమాను రూ.13 కోట్లతో నిర్మించారు. ఇదే సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 68 కోట్లను వసూలు చేసింది. అరుంధతి సినిమా హిట్ అయ్యాక, అనుష్క అనేక లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో నటించారు. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రతో పాటు.. భాగమతి, రుద్రమదేవి చిత్రాలలోని అనుష్క నటన ఆమెను కెరీర్‌లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. అనుష్క అరుంధతితో పాటు.. పంచాక్షరి, వర్ణ లాంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు.
ఛాలెంజింగ్ పాత్రలలో కూడా..
'వేదం' సినిమాలో అనుష్క శెట్టి 'అమలాపురం సరోజ' అనే వేశ్య పాత్రలో నటించారు. ఆ పాత్రకు గాను ఆమెకు విమర్శకుల ప్రశంసలు కూడా దక్కాయి. ఈ సినిమా తమిళ రీమేక్ 'వానమ్'లో సరోజ పాత్రకు అనుష్కనే దర్శకుడు ఎంపిక చేశారు.
హిట్ పెయిర్ ప్రభాస్ & అనుష్క
హీరో ప్రభాస్ సరసన అనుష్క 'బిల్లా' సినిమాలో నటించారు. వీరిద్దరి కాంబోకి మంచి పేరు వచ్చింది. 'బిల్లా' తరువాత 'మిర్చి' సినిమాలో ప్రభాస్, అనుష్క కలిసి నటించారు. 'మిర్చి' సినిమా షూటింగ్‌లోనే అనుష్క దర్శకుడు రాజమౌళి కంట పడింది. దీంతో రాజమౌళి ప్రభాస్ హీరోగా తెరకెక్కించిన 'బాహుబలి' సినిమా కోసం అనుష్కను కథానాయికగా ఎంపిక చేశారు.
అమ్మ పాత్రలో అనుష్క
ప్రభాస్‌తో అనుష్క శెట్టి (Anushka Shetty) నటించిన 'బాహుబలి, బాహుబలి 2' చిత్రాలు బ్లాక్ బాస్టర్ హిట్ సాధించాయి. 'బాహుబలి' సినిమాలో అనుష్క ప్రభాస్‌కు ఇల్లాలిగా, తల్లిగా రెండు భిన్న పాత్రలలో నటించారు. 'బాహుబలి'లో అనుష్క నటనకు మంచి గుర్తింపు దక్కింది.
సైజ్ జీరో కోసం..
'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చాలా బరువు పెరిగారు. అంతేకాదు, అలా పెరిగిన వెయిట్ తగ్గించుకోవడం కోసం.. ఆ తర్వాత చాలా వర్కవుట్స్ చేశారు. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ అంతా ఇంతా కాదు.
సైరా సినిమాలో
చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క కొద్దిసేపు ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' అనుష్క నటించిన చివరి సినిమా. ఈ సినిమా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో విడుదలైంది.
ప్రతిభకు పురస్కారాలెన్నో
అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ అనుష్క శెట్టి 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. అలాగే అరుంధతి, సైజ్ జీరో సినిమాలలో నటించి మెప్పించిన అనుష్కకు, ఆ చిత్రాలకు గాను నంది అవార్డులు వరించాయి. వీటితో పాటు తమిళనాడు ప్రభుత్వం అందించే చలనచిత్ర అవార్డులను కూడా అనుష్క కైవసం చేసుకున్నారు.
స్వీటీకి ఇష్టమైనవారెవరు?
అనుష్కకు బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్‌తో పాటు, అభిషేక్ బచ్చన్ అంటే కూడా చాలా ఇష్టమట. అలాగే ఓ ఫ్రెంచ్ సినిమాలో నటించాలనేది అనుష్క డ్రీమ్. తనకు కథ నచ్చితే హిందీతో పాటు, ఏ భాషా చిత్రంలోనైనా నటిస్తానని ఆమె పలు ఇంటర్వ్యూలలో తెలిపారు.
Read More: Anushka Shetty: "స్వీటీ మనసు బంగారం"!.. అనుష్క శెట్టి 17 ఏళ్ల సినీ ప్రయాణంపై స్పెషల్ స్టోరి