Brahmastra: ‘బ్రహ్మాస్త్రం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై అభిమానులను క్షమాపణలు కోరిన ఎన్టీఆర్ (NTR)
Brahmastra: పాన్ ఇండియా సినిమా 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి నటీనటులు, దర్శక, నిర్మాతలతో పాటు హీరో ఎన్టీఆర్ (NTR) కూడా హాజరయ్యారు. 'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసినందుకు ఎన్టీఆర్ అభిమానులకు క్షమాపణలు చెప్పారు. ఈ ఈవెంట్ కోసం భారీ సెట్ కూడా ఏర్పాటు చేశామని రాజమౌళి తెలిపారు.
అభిమానులకు క్షమాపణలు - ఎన్టీఆర్
'బ్రహ్మాస్త్రం' ప్రీ రిలీజ్ వేడుక సెప్టెంబర్ 2న హైదరబాద్‌లో జరగాల్సి ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తారని చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ సడన్‌గా 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను రద్దు చేశారు. చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి.. రద్దుపై వివరణ ఇచ్చింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కూడా హాజరయ్యారు.
వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పోలీసులు 'బ్రహ్మాస్త్రం' సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు బందోబస్తు ఏర్పాటు చేయలేమని చెప్పారని ఎన్టీఆర్ తెలిపారు. తన తరఫున అభిమానులను క్షమాపణలు కోరారు. పోలీసులు ఎప్పుడూ ప్రజల భద్రతను కోరుకుంటారన్నారు. మీడియా మిత్రులకు కూడా క్షమాపణలు తెలిపారు.
ఓ నటుడిగా అమితాబ్ బచ్చన్ ప్రభావం తనపై ఉందని హీరో ఎన్టీఆర్ (NTR) తెలిపారు. బిగ్ బికి తాను వీరాభిమాని అన్నారు. అమితాబ్ తరువాత అంతగా ఇష్టపడే హీరో రణ్‌బీర్ అన్నారు ఎన్టీఆర్. తెలుగు నటుడు హిందీ సినిమాలో నటించి డబ్బింగ్ కూడా చెబితే ఎలా ఉంటుందో నాగార్జున బాబాయ్ నటించిన ‘ఖుదాగవా’ చూసి తెలుసుకున్నానన్నారు. 'బ్రహ్మాస్త్రం'లో నటించిన ప్రతీ ఒక్కరికీ ఎన్టీఆర్ ఆల్ ది బెస్ట్ చెప్పారు.
రాజమౌళి ఎమన్నారంటే..
'బ్రహ్మాస్త్రం' (Brahmastra) సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెలుగులో సమర్పిస్తున్నారు. ప్రమోషన్ల వీరుడు జక్కన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను అట్టహాసంగా నిర్వహించాలని ప్లాన్ చేశారు. కానీ గణేష్ నవరాత్రుల సందర్భంగా కుదరలేదు. దీంతో మీడియా సమావేశం నిర్వహించి క్షమాపణలు కోరారు. పోలీసుల అనుమతి ఉన్నా కూడా బందోబస్తు కష్టమవడంతో ప్రీ రిలీజ్ వేడుక రద్దు చేసుకున్నామన్నారు.
కరణ్ జోహర్ గణేశ్ పూజ సరిగా చేసి ఉండకపోవడం వల్ల ఈవెంట్ రద్దు అయిందని సరదాగా అన్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ అద్భుతమైన శక్తిని కలిగి ఉంటాడన్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఎన్టీఆర్ తొడకొడితే ఫైర్ వచ్చేలా ప్లాన్ చేశామనని తెలిపారు. తన సత్తా ఏంటో సక్సెస్ ఈవెంట్‌లో చూపిస్తానని రాజమౌళి సవాల్ చేశారు.