Sammathame Movie Review (సమ్మతమే సినిమా సమీక్ష): కిరణ్ అబ్బవరం యాక్టింగ్ హైలెట్.. అయినా ఇదో సాదాసీదా ప్రేమకథే !
నటీనటులు: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
నిర్మాత: కంకణాల ప్రవీణ
దర్శకత్వం : గోపీనాథ్ రెడ్డి
రేటింగ్ : 2.5/5
Sammathame Movie Review: కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జంటగా నటించిన చిత్రం 'సమ్మతమే' (Sammathame). విడుదలకు ముందే ఈ చిత్రం ప్రమోషన్లతో పాపులారిటీని సంపాదించుకుంది. దీంతో ఈ సినిమాపై సగటు సినీ ప్రేక్షకులకు అంచనాలు బాగానే ఏర్పడ్డాయి.
కథ
సంప్రదాయ భావాలు కలిగిన ఓ యువకుడి కథ ఈ 'సమ్మతమే'. కృష్ణ (కిరణ్ అబ్బవరం) చిన్నప్పటి నుండి తల్లి లేకుండా పెరుగుతాడు. అందుకే, ఒక ఇంటికి ఇల్లాలు లేకపోవడం వల్ల కలిగే లోటు ఏంటో తనకు అర్థమవుతుంది. కనుక తను చేసుకోబోయే అమ్మాయి పద్ధతిగా, సంప్రదాయబద్ధంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అనుకోకుండా ఆధునిక భావాలు కలిగిన శాన్వి (చాందిని చౌదరి) తో ప్రేమలో పడతాడు. ఆమెనే పెళ్లి చేసుకోవాలని భావిస్తాడు.
కానీ హీరో అతి ప్రేమను కథానాయిక తట్టుకోలేకపోతుంది. ఈ అతి ప్రేమ వల్ల తన ఐడెంటెటీ మిస్ అవుతోందని ఆమె అభిప్రాయ పడుతుంది. కానీ నయానో, భయానో కథానాయికను తన దారికి తెచ్చుకోవడానికి హీరో ప్రయత్నిస్తాడు. ఆమెకు కట్టుబాట్లు పెట్టడం, తర్వాత అనుమానించడం.. మరల తనదే తప్పని తెలుసుకొని క్షమాపణ అడగడం.. ఇవన్నీ ఈ సినిమాలో హీరో చేసే పనులు.
ఒక వ్యక్తి వ్యక్తిగత స్వేచ్ఛను ఎవరూ హరించకూడదని, భర్త అయినా సరే.. భార్యకి ఇవ్వాల్సిన స్వేచ్ఛను ఇవ్వాలని ఈ సినిమా చెబుతుంది. అయితే సినిమా పెద్ద ట్విస్టులు లేకుండా, రొటీన్‌గా సాగిపోవడం ఒక్కటే మైనస్. అలాగే క్లైమాక్స్ కూడా సాదాసీదాగా ఉంటుంది. కానీ చివరాంకంలో కొన్ని సంభాషణలు ఆలోచింపజేసేలా ఉంటాయి.
ప్లస్ పాయింట్స్ :
ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) గురించి. అతని డైలాగ్ డెలివరీ, హావభావాలు ఆకట్టుకుంటాయి. గత చిత్రాలతో పోలిస్తే, ఈ చిత్రంలో కిరణ్ మంచి పరిణితితో నటించాడనే చెప్పాలి. ఇక చాందిని చౌదరి (Chandini Chowdary) కూడా తన పాత్ర పరిధి మేరకు మంచి నటననే కనబరిచింది. అలాగే సినిమా నిర్మాణ విలువలు కూడా బాగున్నాయి. సతీష్ రెడ్డి కెమెరా వర్క్ కూడా చాలా బాగుందనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్ :
సినిమా కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, అదే కథను ప్రేక్షకులకు కన్విన్సింగ్‌గా చెప్పడంలో దర్శకుడు కాస్త తడబడ్డాడేమో అనిపిస్తుంది. అలాగే స్క్రీన్ ప్లే కూడా అంత ఆకట్టుకొనే విధంగా ఉండకపోవడం ఈ చిత్రానికి ప్రధాన లోపం. దీంతో నటీ నటుల మధ్య ఇమోషన్స్‌ను పండించాల్సిన సీన్స్ అంతగా ఎలివేట్ కాలేదేమో అనిపిస్తుంది. దీంతో ప్రేక్షకుడికి ఒక రొటీన్ సినిమా చూస్తున్న భావనే కలుగుతుంది.
ఏదేమైనా, ఈ 'సమ్మతమే' అందరికీ సమ్మతం కాకపోవచ్చు. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయి కదా !
Read More: ఆ రెండు సంవత్సరాలు చాలా సినిమాలు మిస్ అయ్యాను.. నిర్మాత ఇబ్బంది పెట్టారు : చాందిని చౌదరి