RRR (ఆర్ఆర్ఆర్) నుండి Jana Gana Mana (జనగణమన) వరకూ : ఈ వారం ఓటీటీలో చూడాల్సిన చిత్రాలివే !
మీరు ఈ వీకెండ్ సూపర్‌గా ఎంజాయ్ చేయాలని భావిస్తున్నారా? మీ ఆలుమగలిద్దరూ ఓటీటీలో మంచి బ్లాక్ బస్టర్ సినిమాలను చూస్తూ, ఎంజాయ్ చేయాలని నిర్ణయించుకున్నారా? అయితే పాప్ కార్న్, మ్యాగీ, పిజ్జా.. ఇవన్నీ సిద్ధం చేసేసుకోండి. రొమాన్స్, యాక్షన్, థ్రిల్లర్.. ఇలా ఏ జానర్ సినిమా అయినా సరే, మీకు నచ్చింది ఎంచుకోండి.
ఏంటీ.. తటపటాయిస్తున్నారా? ఏం ఫర్లేదు. మేం మీకోసమే ఉన్నాం. మీరు ఎలాంటి సినిమాలు చూడాలో, మేం మీకు చెబుతాం. మీకోసమే ప్రత్యేకంగా ఓ జాబితా కూడా సిద్ధం చేశాం. ఇంకెందుకు ఆలస్యం ! ఈ లిస్ట్‌ను మీరూ ఫాలో అయిపోండి మరి !
అశోకవనంలో అర్జున కళ్యాణం (Ashoka Vanamlo Arjuna Kalyanam) : విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి విద్యాసాగర్ చింతా దర్శకత్వం వహించారు. ఫైనాన్స్ వ్యాపారం చేసుకొనే ఓ పెళ్లి కాని తెలంగాణ కుర్రాడు, తన ఊరిలో సంబంధాలు దొరక్కపోవడంతో, గోదావరి జిల్లాకు వస్తాడు. కోనసీమ అమ్మాయితో తనకు నిశ్చితార్థం జరుగుతుంది.
కానీ ఆ అమ్మాయి పెళ్లి సమయానికి జంప్ అయిపోవడంతో కథ అడ్డం తిరుగుతుంది. అప్పుడే కరోనా లాక్డౌన్ పడడంతో, హీరో ఫ్యామిలీ అంతా, పెళ్లి కూతురి ఇంటిని విడిచి వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో కథానాయకుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? అతని జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాలంటే, ఈ చిత్రం చూడాల్సిందే. ప్రస్తుతం ఆహా ఓటీటీలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
కేజీఎఫ్ 2 (KGF: Chapter 2) : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఎన్నో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. యశ్ ఈ సినిమాలో రాకీ భాయ్‌గా తన నట విశ్వరూపం చూపించాడు. కోలార్ బంగారు గనులను కొల్లగొడుతున్న మాఫియాను తుదముట్టించాక, తానే ఆ సామ్రాజ్యానికి రారాజుగా మారతాడు రాకీ. తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి కూడా చేసుకుంటాడు.
కానీ ఇదే సామ్రాజ్యాన్ని కూలదోయడానికి అధీరా (సంజయ్ దత్) బయలుదేరుతాడు. అయితే తనదైన స్టైల్‌లో దేశ రాజకీయాలనే ప్రభావితం చేసే రాకీ, అధీరా చేతిలో ఓటమి చెందుతాడా లేదా అన్నది తెలుసుకోవాలంటే ఈ కేజీఎఫ్ 2 సినిమా చూడాల్సిందే. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
ఆర్ఆర్ఆర్ (RRR) - బాహుబలి చిత్రంతో భారతదేశ చలనచిత్ర చరిత్రలోనే ఒక తిరుగులేని బావుటా ఎగురవేసిన ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్రంలో.. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్‌లు ప్రాణ స్నేహితులుగా నటించారు. చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలో నటించగా, ఎన్టీఆర్ కొమురం భీమ్‌ను పోలిన పాత్రను పోషించడం గమనార్హం. ఈ విజువల్ వండర్ జీ 5 ఓటీటీతో పాటు నెట్ ఫ్లిక్స్‌లో కూడా మీకు చూడడానికి అందుబాటులో ఉంది.
పుజు (Puzhu) - ఇది ఓ మలయాళం సినిమా. ఈ సినిమాలో నటుడు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించారు. తండ్రి, కొడుకుల మధ్య ఏర్పడిన ఓ చిన్న వివాదం వారి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తుందన్నది ఈ చిత్రం మనకు తెలియజేస్తుంది. ఈ చిత్రంలో మమ్ముట్టి తొలిసారి నెగటివ్ పాత్రలో నటించారు. సోనీ లివ్ ఓటీటీలో మీరు ఈ సినిమా చూడవచ్చు.
హృదయం (Hridayam) - ప్రణవ్ మోహన్‌లాల్, కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ చిత్రం ఓ రొమాంటిక్ ఫిల్మ్. ఈ సినిమా చూస్తే, మీకు కచ్చితంగా మీ కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. ఈ ఫీల్ గుడ్ మూవీ మీకు నిజంగానే మంచి ఫీలింగ్‌ను కలిగేలా చేస్తుంది. ఈ సినిమా హాట్ స్టార్ ఓటీటీలో మీకోసం అందుబాటులో ఉంది.
జనగణమన (Jana Gana Mana) -పృథ్వీరాజ్ సుకుమార్ నటించిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. కాలేజీ పాలిటిక్స్, కులమత వివాదాలు, పోలీస్ వ్యవస్థలోని అవినీతి.. ఇలా అనేక అంశాలను తెరమీదికి తీసుకొస్తుంది. అరవింద్ స్వామినాథన్ అనే ఓ అడ్వకేట్ పాత్రలో మనకు పృథ్వీరాజ్ ఈ సినిమాలో కనిపిస్తారు. మలయాళంలో సూపర్ హిట్ చిత్రంగా నిలిచిన ఈ చిత్రం, ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) - టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ ఈ సినిమాలో జంటగా నటించారు. వేలాది కోట్ల రూపాయలను బ్యాంకు రుణాల రూపంలో కొల్లగొట్టే ఓ అవినీతి నాయకుడిని ఎదుర్కొనేందుకు సిద్ధపడే ఓ యువకుడి కథే ఈ సర్కారు వారి పాట. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంకెందుకు ఆలస్యం.. మీరు కూడా ఈ వీకెండ్‌లో.. ఈ సినిమాలతో హ్యాపీగా ఎంజాయ్ చేసేయండి.