చిరు (Chiranjeevi Konidela) సినిమా వెయ్యి కోట్లు రాబట్టాలి.. అదే ఆయన ఇమేజ్‌కు తగిన చిత్రం: తమ్మారెడ్డి భరద్వాజ
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela) నటించిన ‘గాడ్‌ఫాదర్’ మూవీ ఇటీవల దసరా పండుగకు రిలీజైన విషయం తెలిసిందే. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది. దీంతో బాస్ ఈజ్ బ్యాక్ అంటూ మెగా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతున్నారు. ఈ సినిమా రన్ దాదాపుగా ముగియడంతో తదుపరి చేయబోయే సినిమాలపై చిరు దృష్టి సారిస్తున్నారు. ఆయన నటిస్తున్న కొత్త మూవీ ‘వాల్తేరు వీరయ్య’. దీపావళి సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ టీజర్ విడుదలై.. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది.
ఇక చిరంజీవికి ఉన్న స్టార్ డమ్ అంతా ఇంతా కాదు. సరైన హిట్ పడితే ఆయన సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. కానీ కమ్ బ్యాక్‌లో మెగాస్టార్‌కు కరెక్ట్ హిట్ పడలేదు. ‘గాడ్‌ఫాదర్’ (God Father)కు పాజిటివ్ టాక్ వచ్చినా నిలకడగా కలెక్షన్లు సాధించడంలో ఆ సినిమా విఫలమైంది. దీంతో తర్వాతి ప్రాజెక్టులతో అయినా దుమ్మురేపాలని చిరు భావిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కనబెడితే.. చిరంజీవి గురించి సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ (Thammareddy Bharadwaja) పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. చిరుకు వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉందన్నారు.
‘ఏ హీరోతో ఏ కంటెంట్ మూవీ తీయాలి? ఆ కథానాయకుడికి ఉన్న ఇమేజ్ ఎంత? ఆ హీరోపై ఎంత వస్తుందనేది చూసుకుంటూ నిర్మాత బడ్జెట్ పెట్టాలి. చిరంజీవితో ఈ సినిమా చేశాం.. ఇంత వస్తే చాలనుకుంటున్నారు. నిజానికి చిరంజీవికి హీరోగా వెయ్యి కోట్లు రాబట్టే సత్తా ఉంది. ఆయన ఇమేజ్‌కు తగ్గ మూవీ చేస్తే ఆ వసూళ్లు తప్పకుండా వస్తాయి. అలా కలెక్ట్ చేసిన సినిమానే చిరు ఇమేజ్‌కు తగిన సినిమా అని నేను భావిస్తాను’ అని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పారు.
ఇటీవల వచ్చిన ‘కార్తికేయ 2’, ‘కాంతార’ లాంటి చిన్న బడ్జెట్ సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంపై తమ్మారెడ్డి భరద్వాజ హర్షం వ్యక్తం చేశారు. ఈ రెండు సినిమాలు సుమారుగా రూ.16 కోట్లతో నిర్మించిన సినిమాలని.. వీటిని తక్కువ బడ్జెట్‌తో తీయడం వల్ల హిట్ టాక్‌తో ఎక్కువ లాభాలు అందుకున్నాయని పేర్కొన్నారు. అదే భారీ పెట్టుబడితో ఆ సినిమాలను నిర్మించి ఉంటే ఈ స్థాయి లాభాలు వచ్చేవి కాదన్నారు. రూ.30 కోట్ల చిత్రానికి రూ.100 కోట్లు ఖర్చు పెట్టేసి.. ఆ స్థాయి కలెక్షన్లు రాలేదంటే సరికాదని తమ్మారెడ్డి చెప్పుకొచ్చారు.