Chiranjeevi At IFFI : తెలుగు అభిమానుల ప్రేమకు దాసుడ్ని.. ఎప్పటికీ సినిమాలను వదిలిపెట్టను: మెగాస్టార్ చిరంజీవి
ఎప్పటికీ సినిమాలను వదిలిపెట్టనని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. అభిమానులకు తానెప్పుడూ రుణపడి ఉంటానని ఆయన చెప్పారు. సోమవారం సాయంత్రం గోవాలో నిర్వహించిన 53వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (ఇఫి) ముగగింపు వేడుకల్లో ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్’ పురస్కారాన్ని చిరంజీవి అందుకున్నారు. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఈ అవార్డును చిరుకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన పైవ్యాఖ్యలు చేశారు.
అభిమానుల ప్రేమే ఈ స్థాయికి తీసుకొచ్చింది: చిరంజీవి
‘పదేళ్ల విరామం తీసుకుని తిరిగి సినీ పరిశ్రమలోకి వచ్చాక కూడా అభిమానులు నాపై చూపించిన అభిమానం తగ్గలేదు సరికదా మరింత రెట్టింపయ్యింది. వాళ్లందరికీ నేను రుణపడి ఉంటా. ఇక ఎప్పటికీ సినిమాలను వదిలిపెట్టను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానుల ప్రేమకు నేనెప్పుడూ దాసుడ్ని. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
యువ హీరోలు తనకు పోటీ కాదని.. తానే వారికి పోటీ అని చిరంజీవి అన్నారు. సినీ పరిశ్రమలో ఉండటం తన అదృష్టమన్నారు. సినిమా రంగంలోకి రావాలనుకునేవాళ్లకు చిత్రసీమ గొప్ప వేదిక అని చిరు పేర్కొన్నారు. ఎక్కడైనా అవినీతి ఉంటుందేమో కానీ.. ఇక్కడ ఉండదన్నారు. ఇండస్ట్రీలో ప్రతిభే కొలమానమని.. తాను గతంలో ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నానని చెప్పారు. అప్పుడు అక్కడ దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని బాధపడ్డానన్నారు.
‘ఇప్పుడు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది’ అని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ వేదికపై సీనియర్ నటి ఆశాపరేఖ్, హిందీ హీరో అక్షయ్ కుమార్‌తో పాటు యంగ్ హీరోలు రానా, ఆయుష్మాన్ ఖురానాలను సత్కరించారు.‘సినిమాబండి’ మూవీకి తొలి చిత్ర దర్శకుడిగా ప్రత్యేక ప్రోత్సాహక సత్కారాన్ని ప్రవీణ్ కాండ్రేగుల అందుకున్నారు.