మహానటి సావిత్రి (Savitri)కి చివరి రోజుల్లో సెట్‌లో అవమానం.. అన్నం కూడా పెట్టకుండా.. 

Updated on Nov 05, 2022 06:04 PM IST
సావిత్రి (Savitri)కి ఓ మూవీ సెట్‌లో అన్నం కూడా పెట్టకుండా అవమానించారని గుమ్మడి చెప్పిన పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది 
సావిత్రి (Savitri)కి ఓ మూవీ సెట్‌లో అన్నం కూడా పెట్టకుండా అవమానించారని గుమ్మడి చెప్పిన పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది 

సావిత్రి (Savitri).. ఈ పేరు తెలియని తెలుగు సినీ ప్రేక్షకులు ఉండరు. తెలుగు సినిమా గురించి మాట్లాడాల్సి వస్తే.. అది సావిత్రి పేరు లేకుండా మొదలు కాదు. హీరోలకు మాత్రమే స్టార్‌డమ్ ఉన్న రోజుల్లో ఒక హీరోయిన్‌గా వారికి దీటైన ఇమేజ్‌ను సావిత్రి సంపాదించారు. న‌ట‌న‌కే న‌ట‌న‌ను నేర్పిన స‌హ‌జ న‌టిగా ఆమెను విమర్శకులు కూడా ప్రశంసించారు. కొన్ని పాత్రలను సావిత్రి తప్ప ఇంకెవరూ చేయలేరనేంతగా గొప్పగా యాక్టింగ్‌లో ఆమె మెప్పించారు. అందుకే తరాలు మారిన ఇండస్ట్రీలో సావిత్రి స్థానం సుస్థిరం. 

కడు పేదరికం నుంచి వచ్చిన సావిత్రి వెండితెరపై అద్భుతాలు సృష్టించారు. హైదరాబాద్, చెన్నై, విజయవాడల్లో ఆమె పేరిట ఉన్న ఆస్తుల్ని ఇప్పటి లెక్కప్రకారం లెక్కగడితే వేల కోట్లు ఉంటుందట. అయితే, ఇంద్రభవనాలను  తలదన్నే ఇళ్లు, విలాసవంతమైన కార్లు ఇవేమీ సావిత్రికి మనశ్శాంతిని ఇవ్వలేదు. ఆమె అతి మంచితనంతో ఎంతగానో నష్టపోయారు. నమ్మిన బంధువులు, స్నేహితులు మోసం చేయడంతో ఆమె అన్నీ కోల్పోయారు. 

సావిత్రి చివరి రోజుల్లో ఎన్నో బాధలు పడ్డారు. ప్రొడక్షన్ బాయ్స్ కూడా ఆమెను సరిగా పట్టించుకోలేదట. ఆమె పడిన కష్టాలను స్వయంగా చూసిన సీనియర్ నటుడు గుమ్మడి (Gummadi Venkateswara Rao) ఎంతో ఆవేదన చెందారు. మరణానికి ముందు రోజుల్లో సావిత్రి పడిన కష్టాలను స్వయంగా గుమ్మడే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ పాత వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 

చివరి రోజుల్లో సావిత్రి పడిన కష్టాలను స్వయంగా గుమ్మడే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు

ఆ ఇంటర్వ్యూలో గుమ్మడి మాట్లాడుతూ సావిత్రి చివరి రోజుల గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. తాను సావిత్రికి చాలా ఆత్మీయుడినని ఆయన అన్నారు. తనను అన్న అని ఆమె పిలిచేదన్నారు. ‘సావిత్రి చివరి రోజుల్లో ఆమె పడిన కష్టాలను స్వయంగా చూశాను. అనారోగ్యంతో ఉన్న నన్ను పలకరించడానికి మా ఇంటికి వచ్చింది. అవి సావిత్రి చివరి రోజులు. డాక్టర్‌ నాకు ఇంజెక్షన్‌ ఇస్తే మగతగా పడుకుని ఉన్నా. సావిత్రి వచ్చి నన్ను పలకరించింది. 

‘నాతో కాసేపు మాట్లాడిన అనంతరం సావిత్రి వెళ్లూ.. నా తలగడను సర్దినట్లు అనిపించింది. ఏంటా అని దాన్ని తీసి చూస్తే రూ.2 వేలు ఉన్నాయి. ఫోన్‌ చేసి ఏంటమ్మా డబ్బులు పెట్టావని అడిగా. ‘మీరు మర్చిపోయారేమో అన్నయ్యా.. నేను మీ దగ్గర అప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నా.. పోయే లోపల ఎవ్వరికీ దమ్మిడి కూడా బాకీ ఉండకూడదు. నాకు 5 వేలు అడ్వాన్స్‌ వచ్చింది. దాంట్లోంచి ఇస్తున్నా’ అంది. ఆమె వ్యక్తిత్వం చూసి నా కళ్లు చెమ్మగిల్లాయి’ అంటూ గుమ్మడి భావోద్వేగానికి లోనయ్యారు. 

సావిత్రి (Savitri)కి ప్రొడక్షన్‌ వాళ్లు ఆమెకు భోజనం పెట్టలేదని గుమ్మడి అన్నారు

ఆఖరి రోజుల్లో సావిత్రి ఎన్నో అవమానాలు పడిందని గుమ్మడి అన్నారు. ‘సావిత్రి తన చివరి రోజుల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా సినిమాలు చేయసాగింది. ఒకసారి ఓ చిత్రంలో తల్లి పాత్రకు ఆమెను తీసుకున్నారు. నేను కూడా ఆ మూవీలో చేస్తున్నాను. అందరికీ ఇంటి దగ్గరి నుంచి భోజనాలు వస్తాయి. మాకు కొందరికి క్యారియర్లు వచ్చాయి. నేను భోజనం చేస్తున్నాను. ఆమె ఒక్కత్తే విడిగా కూర్చుని ఉంది. మామూలుగా ఇంటి నుంచి క్యారియర్‌ రాని వాళ్లకు ప్రొడక్షన్‌ వాళ్లు భోజనం ఏర్పాటు చేయాలి. అప్పటికి ఆమెకు ఇంటి నుంచి క్యారియర్‌ వచ్చే స్థితి కూడా లేదు. అంటే తెచ్చేవాళ్లు లేరు’ అని గుమ్మడి పేర్కొన్నారు.

‘భోజనం సమయంలో సావిత్రి నా దగ్గరకి వస్తే ‘ఏమ్మా తినలేదా’ అని అడిగా. ‘లేదన్నయ్యా నాకు ఆకలిగా లేదు’ అంది. నాకు అర్థం అయిపోయింది. ప్రొడక్షన్‌ వాళ్లు ఆమెకు భోజనం పెట్టలేదు. ఆమెకు ఇంటి దగ్గరి నుంచి కూడా రాలేదు. ‘రామ్మా.. భోజనం చేద్దాం’ అన్నా. ‘వద్దు’ అని అంది. ‘లేదమ్మా! నువ్వు వస్తే తప్ప నేను కూడా తినను’ అన్నాను. అప్పుడు ఏడ్చుకుంటూ వచ్చి భోజనం చేసింది’ అని చెబుతూ గుమ్మడి ఎమోషనల్ అయ్యారు.

Read more: Pushpa 2: బన్నీ (Allu Arjun) అభిమానులకు శుభవార్త.. ‘అవతార్ 2’ (Avatar 2)తో కలసి సందడి చేస్తానంటున్న పుష్పరాజ్!Sa

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!