EXCLUSIVE : ఓపిక, తెగువ ఉంటేనే ఇండస్ట్రీలో రాణించగలం : డైరెక్టర్ వి. జయశంకర్ (V. Jayashankarr)

Updated on Nov 05, 2022 03:53 PM IST
"ఓపిక, తెగువ, నమ్మకం ఉంటేనే సినీ రంగంలో రాణించగలం" అని చెబుతున్న దర్శకుడు వి.జయశంకర్ (V.Jayashankarr) గారితో ముఖాముఖి
"ఓపిక, తెగువ, నమ్మకం ఉంటేనే సినీ రంగంలో రాణించగలం" అని చెబుతున్న దర్శకుడు వి.జయశంకర్ (V.Jayashankarr) గారితో ముఖాముఖి

సినీరంగం అంటేనే ఓ రంగుల ప్రపంచం. కొన్ని అవకాశాలు అనేవి లక్ మీద ఆధారపడి ఉంటే.. మరికొన్ని మనలోని టాలెంట్‌ను బట్టి తలుపు తడతాయి. ప్రతిభ ఉన్నా కూడా, కొన్నిసార్లు మనం చేసే ప్రయత్నాలు ఫెయిల్ కావడం సహజం. అయినా సరే, క్రుంగిపోకుండా పట్టువదలని విక్రమార్కుడిలా దూసుకుపోతేనే జీవితం సాఫీగా సాగిపోతుంది. ఎన్నో కొత్త దారులనూ చూపిస్తుంది. 

"ఓపిక, తెగువ, నమ్మకం ఉంటేనే సినీ రంగంలో రాణించగలం" అని చెబుతున్న టాలీవుడ్ యువ దర్శకుడు వి.జయశంకర్ (V. Jayashankarr) గారితో ముఖాముఖి ఈ రోజు పింక్విల్లా తెలుగు పాఠకులకు ప్రత్యేకం ..!

నమస్తే జయశంకర్ గారు. మీ కుటుంబ నేపథ్యంతో పాటు పరిశ్రమలో తొలి అవకాశం ఎలా వచ్చిందో చెబుతారా ?

మా నాన్నగారిది టింబర్ డిపో బిజినెస్. నాకు బాల్యం నుండీ  సినిమాలంటే చాలా ఇష్టం. చిత్ర పరిశ్రమలో పనిచేయాలని ఉండేది. అందుకే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జాబ్ చేస్తున్నా కూడా, నా ధ్యాసంతా సినిమాల మీదే ఉండేది. ఈ క్రమంలో తొలి ప్రయత్నంగా ప్రముఖ నవలా రచయిత, సినీ రైటర్ కొమ్మనాపల్లి గణపతిరావు గారితో కలిసి మాట్లాడాను. ఆయన ఓ పరీక్ష పెట్టి, తన వద్ద అసిస్టెంట్ రైటర్‌గా అవకాశం ఇచ్చారు. ఆ అనుభవం తోటే తర్వాతి కాలంలో అభిషేకం, అపరంజి వంటి టీవీ సీరియల్స్‌కు రైటింగ్ అసిస్టెంట్‌గా పనిచేశాను. 

తొలి సినిమా అనుభవాలేమిటి?

తొలుత నాకు డైరెక్షన్ అవకాశాలు ఏమీ రాలేదు. అందుకే రైటింగ్ మీద నా ఫోకస్ ఎక్కువగా ఉండేది. ఇదే క్రమంలో సంపత్ నంది గారి వద్ద రైటింగ్ అసిస్టెంట్‌గా చేరాను. ఆయనకు నా వర్క్ నచ్చడంతో.. "పేపర్ బాయ్‌‌" సినిమాని డైరెక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. సంపత్ గారే ఈ ప్రాజెక్టుకి నిర్మాత. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ వారు డిస్ట్రిబ్యూట్ చేశారు. అదే నా లైఫ్‌లో పెద్ద టర్నింగ్ పాయింట్. ఈ సినిమా రిలీజ్ సమయంలో అల్లు అరవింద్ గారు మంచి భరోసా ఇచ్చారు. అనేక విలువైన సలహాలు ఇచ్చారు. 

మీ తొలి చిత్రం "పేపర్ బాయ్" అనుకున్నంత సక్సెస్ అయ్యిందని మీరు భావిస్తున్నారా ?

2018 లో "పేపర్ బాయ్" రిలీజ్ అయ్యింది. సినిమా బాగానే ఆడినా, మేం ఊహించిన రిజల్ట్ రాలేదు. అయితే లాక్డౌన్ సమయంలో, అమెజాన్ ప్రైమ్‌లో ఇదే సినిమాకి అనుకోని రెస్పాన్స్ వచ్చింది. రికార్డు స్థాయిలో ఈ చిత్రానికి వ్యూస్ వచ్చాయి. అది మాకు చాలా ఆనందం కలిగించింది. మా శ్రమకు తగ్గ ఫలితం వచ్చిందని మేం భావించాం. ఆ తర్వాత నాకు అల్లు అరవింద్ గారి ‘ఆహా ‘ సంస్థలో క్రియేటివ్ బోర్డు మెంబర్‌గా అవకాశమొచ్చింది.

 

V Jayashankarr

మీరు ప్రస్తుతం 'అరి' అనే పేరుతో ఓ సినిమాని తెరకెక్కించారు. అసలు ఈ సినిమా ఛాన్స్ మీకు ఎలా వచ్చింది ?

మేం 'పేపర్ బాయ్' సినిమాని అమెరికాలో రిలీజ్ చేసినప్పుడు.. అక్కడ ఓ ప్రాంతానికి ప్రముఖ వ్యాపారవేత్త ఆర్వీ రెడ్డి గారు మా సినిమాని డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆయనకు నా వర్క్ నచ్చడంతో.. తానే ప్రొడ్యూసర్‌గా  'అరి' సినిమాని నిర్మించారు. శేషు మారంరెడ్డి గారు కూడా ఈ సినిమాకి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు

'అరి'.. ఈ సినిమా టైటిల్ చాలా విచిత్రంగా ఉంది ? అంత క్యాచీగా కూడా లేదు. మరి ఈ సినిమా అన్ని తరగతుల ప్రేక్షకులకూ చేరుతుందని మీరు భావిస్తున్నారా?

ఏ సినిమాకైనా టైటిల్ ప్రధానమే అయినప్పటికీ, కంటెంట్ కూడా చాలా ముఖ్యమనేదే నా అభిప్రాయం. మా కంటెంట్ మీద మాకు చాలా నమ్మకం ఉంది. కచ్చితంగా ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులనూ అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. అరిషడ్వర్గాలను గురించి ఒక కొత్త కోణంలో చెప్పే ప్రయత్నమే ఈ  అరి (Ari) చిత్రం. అందుకే కథకు తగిన విధంగానే టైటిల్‌ను ఎంపిక చేశాం. ఇది ఓ ఆంథాలజీ మూవీ. మై నేమ్ ఈజ్ నోబడీ అనేది ట్యాగ్ లైన్. కొన్ని వైవిధ్యమైన కథల సమాహారమే 'అరి' చిత్రం. 

ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) గారిని ప్రధాన పాత్రగా ఎంపిక చేయడానికి కారణం ఏమిటి?

అయ్యో.. అనసూయ గారు ఈ సినిమాలో ప్రధాన పాత్ర కాదండీ. మా ఆంథాలజీలోని ఒకానొక కథలో ఆమె కూడా కనిపిస్తారు. ఆమెతో సరిసమానంగా అనేక పాత్రలు ఈ చిత్రంలో ఉన్నాయి. అవన్నీ ప్రధాన పాత్రలే. అలాగే ఈ చిత్రంలో ప్రతి చిన్న పాత్రకు కూడా చాలా ప్రాధాన్యం ఉంటుంది. అన్ని కమర్షియల్ హంగులు కలిగిన ప్రయోగాత్మక చిత్రమిది.

Ari Film Director V. Jayashankarr

ఈ సినిమా ఆంథాలజీ మూవీ అంటున్నారు? మరి, ఈ చిత్రంలోని పాత్రలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయా? 

ఈ సినిమాలో ఒక పాత్రతో మరో పాత్రకు ఇంటర్ లింక్ ఉంటుంది. అయితే డైరెక్ట్ లింక్ ఉండదు. అలాగే ఇంకా చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్స్ సినిమాలో ఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుడిలో ఉత్సుకతను రేకెత్తిస్తాయి. 

'అరి' చిత్రంలో సాయికుమార్, సుమన్, ఆమని లాంటి సీనియర్ నటులెందరో నటించారు. మీరేమో కొత్త దర్శకుడు. మరి మీకు వారితో కలిసి పనిచేస్తున్నప్పుడు ఏమని అనిపించింది?

ఈ సినిమాలో నాతో కలిసి పనిచేసిన సీనియర్ నటులందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. చాలా ఓపికగా సహకరించారు.  ఇది ఒక రకంగా నాకు కొత్త లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్. ముఖ్యంగా ఏదైనా డైలాగ్ ఇంప్రవైజ్ చేయాలంటే, వారు 100 % ఎఫర్ట్ పెట్టేవారు. ఇంకెంత బాగా యాక్ట్ చేయవచ్చో చేసి చూపించేవారు. అలాగే తమ పాత్రకు సంబంధించి సలహాలు ఇచ్చేవారు. వారిచ్చే ఇన్‌పుట్స్ అన్ని కూడా చాలా విలువైనవి. 

ఈ సినిమా షూటింగ్ ఎన్ని రోజులలో పూర్తిచేశారు?

ఈ సినిమా షూటింగ్ దాదాపు 30 రోజులలో పూర్తయ్యింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్‌తో పాటు ఇతరత్రా టెక్నికల్ వర్క్, ఫైనాన్స్.. ఇలా వీటన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రాజెక్టును ఒక కొలిక్కి తీసుకొచ్చేసరికి రెండు సంవత్సరాలు పట్టింది

 

 

V Jayashankarr

అనూప్ రూబెన్స్ లాంటి పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్‌ను ఈ ప్రాజెక్టుకి ఎంచుకోవడానికి కారణం ఏమిటి?

అనూప్ నాకు ముందు నుండే పరిచయం. ఆయన కంపోజ్ చేసిన పాటలు చాలా విన్నాను. చాలా ఫీల్ ఉంటుంది ఆ సాంగ్స్‌లో. ఆయన ఈ సినిమాకు అందించిన రెండు పాటలు కూడా అద్భుతంగా ఉన్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 

ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారా? లేదా థియేట్రికల్ రిలీజ్ కోసం ప్లాన్ చేస్తున్నారా?

ఈ విషయం గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదండి. డిస్ట్రిబ్యూషన్‌కు సంబంధించి ప్రస్తుతం ఓ ప్రముఖ పంపిణీ సంస్థతో సంప్రదింపులు జరుగుతున్నాయి. నవంబర్ చివరి వారం నుండి ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. 

'అరి' సినిమాను ప్రేక్షకులు ఎందుకు చూడాలి? ఇందులోని అంశాలేమిటి?

అరి (Ari) ఒక ఫిలసాఫికల్ మూవీ. 'మనిషి ఎలా బ్రతకాలి.. ఎలా బ్రతకకూడదు' అనే అంశాన్ని తాత్విక కోణంలో తెలియజేసిన చిత్రమిది. ఇందులోని పాత్రల స్వభావాలను బట్టి కూడా మనం మంచి, చెడుల తారతమ్యాన్ని తెలుసుకోవచ్చు. ఇది ఒక ఆలోచింపజేసే ప్రయత్నం.

V Jayashankarr

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మీకు నచ్చిన దర్శకులు ఎవరు?

అలనాటి మేటి దర్శకుడు ఆదుర్తి సుబ్బారావుతో పాటు కె.రాఘవేంద్రరావు గారి దర్శకత్వం అంటే చాలా ఇష్టం. అలాగే ఈ తరంలో త్రివిక్రమ్ శ్రీనివాస్  డైరెక్షన్ అంటే ఇష్టం.  

మీ ఫేవరేట్ హీరో ఎవరు? భవిష్యత్తులో ఏ కథానాయకుడితో కలిసి పనిచేయాలని భావిస్తున్నారు ?

చిరంజీవి, మహేష్ బాబు నాకు ఇష్టమైన తారలు. వీరితో కలిసి పనిచేయాలని ఏ దర్శకుడికైనా ఉంటుంది. మహేష్ నటించిన శ్రీమంతుడు, మహర్షి లాంటి సినిమాలు నాకు చాలా ఇష్టం. 

చాలా సినిమాలు నేడు థియేటర్‌లో రిలీజ్‌ కాకుండా, ఓటీటీ మాధ్యమాలలోకి వచ్చేస్తున్నాయి? అలాగే వెబ్ సిరీస్‌ల హవా కూడా  నడుస్తోంది? ఈ క్రమంలో సినీ రచయితలు స్క్రిప్ట్ రాసే విధానంలో ఏవైనా మార్పులను మీరు గమనించారా?

మనం ప్రస్తుతం సినిమాల పరంగా మంచి కంటెంటే ఇవ్వగలుగుతున్నాం. అయితే వెబ్ సిరీస్ రైటింగ్ వేరుగా ఉంటుంది. సినిమా స్క్రిప్ట్ రాసే విధానానికి, దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే ఫార్మాట్‌ను బట్టి మనం స్క్రిప్ట్‌లో మార్పులు చేసుకుంటూ ఉండాలి. కొన్ని సబ్జెక్టులు కొన్ని ఫార్మాట్లకు మాత్రమే సూట్ అవుతాయి. 

లాక్డౌన్ సమయంలో థియేటర్‌లో రిలీజ్ కావాల్సిన సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేశాయి. కానీ రెండింటికీ వేరు వేరు ఆడియన్స్ ఉంటారు.  నిజం చెప్పాలంటే వెబ్ సిరీస్‌కు కంటెంట్ రాయడం చాలా కష్టం. 

 

Vitamin She

సినీ రంగంలోకి రావాలనుకొనే వర్థమాన రచయితలు, యువకులకు మీరేమైనా చెప్పాలని భావిస్తున్నారా ?

ఈ రంగంలో నెగ్గుకు రావాలంటే ఎంతో ఓపిక ఉండాలి. నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉండాలి. సెల్ఫ్ మోటివేషన్ చాలా ముఖ్యం. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఎందుకంటే, సాహిత్యం మాదిరిగానే సినిమా కూడా ఒక ఆర్ట్ ఫామ్. 

షేక్స్‌పియర్, రవీంద్రనాథ్ టాగూర్ లాంటి వారికే సాహిత్య రంగాన ఆటుపోట్లు తప్పలేదు. మనం ఏ మాత్రం? అయితే ప్రగాఢమైన ఆకాంక్ష ఉంటే, మన గమ్యాన్ని మనం చేరుకోగలం.

అలాగే ఈ రంగంలో సబ్జెక్టు నాలెడ్జి ఉండడం అనేది చాలా ముఖ్యం. మనం ఏ స్థాయిలో ఉన్నామన్నది మన రైటింగ్‌లోనే ఎదుటివారికి తెలిసిపోతుంది. అందుకే కథలు చదవాలి.. కథలు రాయాలి. అలాగే సినిమాలు చూడాలి. మీరు చూసే సినిమాను అనేక కోణాలలో విశ్లేషించాలి. అప్పుడే మీ ఊహాశక్తి కూడా పెరుగుతుంది. 

మీ హాబీలు ఏమిటి?

బుక్ రీడింగ్ నా సీరియస్ హాబీ. ప్రాచీన సాహిత్యంతో పాటు మోడరన్ లిటరేచర్ కూడా నేను చదువుతుంటాను. తెలుగులో రంగనాయకమ్మ గారి సాహిత్యం ఇష్టం. అలాగే షార్ట్ ఫిల్మ్స్ తీయడం కూడా నా హాబీ. అందుకే లాక్ డౌన్ సమయంలో "విటమిన్ షి" అనే షార్ట్ ఫిల్మ్ తీశాను. 

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేటి సమాజానికి ఏదో చెప్పాలన్న తపనతో "విటమిన్ షి" తీశాను. నిజానికి ఇదే సబ్జెక్టును ఓ ఫీచర్ ఫిల్మ్‌గా మలచాలన్న ఆలోచన కూడా ఉంది. నేను తీసిన "విటమిన్ షి" షార్ట్ ఫిలింకి  300 M వ్యూస్ రావడం విశేషమే. తొలుత ఈ షార్ట్ ఫిలిం తీస్తానంటే, తెలిసిన వాళ్లు తిట్టారు. ఒక ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్ అయ్యుండి, షార్ట్ ఫిల్మ్స్ లాంటివి తీస్తే .. కెరీర్ ఇరకాటంలో పడుతుందని తెలిపారు. కానీ ఆ ఫిల్మ్‌కు వచ్చిన రెస్పాన్స్ చూశాక, అందరూ ఆశ్చర్యపోయారు.  

మీ భవిష్యత్ ప్రాజెక్టులు ఏమిటి?

ఎకనామిక్ హిట్‌మన్ నేపథ్యంలో ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాను.. అలాగే నా స్నేహితుడు రవి ప్రొడక్షన్‌లో కూడా ఓ సినిమాకి దర్శకత్వం వహించే యోచన ఉంది. 

Read More : సుకుమార్, దేవీశ్రీ ప్రసాద్ లేకపోతే 'పుష్ప' లేనే లేదు: సాక్షి ఎక్సలెన్స్ అవార్డ్స్ వేడుకల్లో అల్లు అర్జున్

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!