Kantara Movie Review : దైవాగ్రహానికి గురయ్యే దారి తప్పిన మనుషుల కథ.. నటుడిగా, దర్శకుడిగా సత్తా చాటిన రిషబ్ శెట్టి !

Updated on Oct 17, 2022 02:06 PM IST
రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ సినిమాలో నటించడమే కూడా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా సత్తా చాటారు. గతంలో ఆయన కిరిక్ పార్టీ, రిక్కీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.
రిషబ్ శెట్టి (Rishab Shetty) ఈ సినిమాలో నటించడమే కూడా, మెగాఫోన్ పట్టి దర్శకుడిగా కూడా సత్తా చాటారు. గతంలో ఆయన కిరిక్ పార్టీ, రిక్కీ లాంటి సినిమాలకు దర్శకత్వం వహించారు.

నటీనటులు: రిషబ్ శెట్టి, కిషోర్ కుమార్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి, వినయ్ బిడ్డప్ప

సంగీతం: బి అజనీష్ లోక్‌నాథ్

సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్

నిర్మాతలు: విజయ్ కిరగందూర్

దర్శకత్వం : రిషబ్ శెట్టి

రేటింగ్ : 3.5/5

కథ :

ఈ సినిమా కథంతా ఓ గిరిజన ప్రాంతం చుట్టూ తిరుగుతుంది. ఆ ప్రాంతానికి ఓ స్థల చరిత్ర ఉంటుంది. తన మనసులో ఎనలేని సంతోషాన్ని నింపిన దైవశిలను పొందడం కోసం, ఓ మహారాజు దైవాజ్ఞను పాటిస్తాడు. ప్రజలకు తన భూమిని కానుకగా ఇచ్చేస్తాడు. 

అయితే ఒకరికి దానంగా ఇచ్చిన భూమిని తిరిగి పొందాలని భావించకూడదని, అది ధర్మానికి విరుద్ధమని దైవం హితవు పలుకుతుంది. ఒకవేళ రాజు లేదా అతని వారసులు గానీ భవిష్యత్తులో అటువంటి ప్రయత్నం చేస్తే, తీవ్ర పరిణామలు ఎదురవుతాయని సూచన ప్రాయంగా హెచ్చరిస్తుంది.

కొన్నేళ్ళ తర్వాత అదే ప్రాంతం దేవేంద్ర (అచ్యుత్) అనే దొర ఆధీనంలోకి వెళ్తుంది. ఇక ఆ ఊరికి ఆనుకొని ఉన్న అడవిలో మురళి (కిశోర్) అనే ఫారెస్టు ఆఫీసర్ తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఉంటాడు. సర్కారు భూములను ఊరి ప్రజలు ఆక్రమించుకున్నారని, తను ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తాడు. 

మరో వైపు, ఆ భూములను కబ్జా చేయడానికి దేవేంద్ర కూడా పావులు కదుపుతూ ఉంటాడు.ఈ క్రమంలో శివ (రిషబ్ శెట్టి) అనే యువకుడికి, ఫారెస్ట్ ఆఫీసర్ మురళికి మధ్య ఓ అనుకోని ఘటన వల్ల విరోధం ఏర్పడుతుంది. శివ ప్రేయసి లీల కూడా అదే అడవిలో ఫారెస్టు గార్డుగా పనిచేస్తుంది. 

ఓ రోజు దేవనర్తకుడైన గురవ చనిపోతాడు. అలాగే శివకు విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి. తనను ఓ లక్ష్యసాధన కోసం సంసిద్ధమవ్వమని చెబుతుంటాయి. ఈ క్రమంలో ఊరి ప్రజలను కాపాడుకోవడానికి దైవం నిర్దేశించిన లక్ష్యాలను శివ ఎలా పూర్తి చేశాడన్నదే చిత్రకథ 

సానుకూల అంశాలు :

ఇప్పటికే ఈ  "కాంతార" సినిమా గురించి ప్రభాస్, ధనుష్ లాంటి స్టార్ హీరోలు పాజిటివ్‌గా మాట్లాడడంతో, చిత్రం మీద అంచనాలు భారీగానే పెరిగాయి. అలాగే ఈ సినిమా కూడా సున్నితమైన హాస్యంతో పాటు భావోద్వేగాలకు పెద్ద పీట వేస్తుంది. 

కొన్ని యాక్షన్ సీన్లు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. అలాగే కెమెరావర్క్ కూడా చాలా బాగుంది. మనకు ఒక సరికొత్త లోకాన్ని పరిచయం చేస్తుంది. 

ఈ సినిమాకు సంబంధించి ముఖ్యంగా రిషబ్ (Rishab Shetty) నటన గురించి చెప్పుకోవాలి. చాలా ఈజ్‌తో నటించాడు. యాక్షన్ సన్నివేశాలలో, ఇమోషనల్ సీన్లలో మంచి పరిణితితో కూడిన నటనను కనబరిచాడు. కథానాయిక సప్తమి గౌడ (Saptami Gowda) కూడా చాలా సహజంగా నటించింది. ఇది ఒక గిరిజన ప్రాంతానికి చెందిన కథ కాబట్టి, దర్శకుడు సీన్స్ చాలా సహజంగా వచ్చేటట్లు ప్లాన్ చేసుకున్నాడు. కొన్ని సన్నివేశాలను ఔట్ డోర్‌లోనే తీశారు.  

ఈ సినిమాలో విలన్‌గా నటించిన అచ్యుత్.. అలాగే అటవీ శాఖ అధికారి పాత్రలో కిషోర్ తమన నటనతో మెప్పించారు. అలాగే క్లైమాక్స్ కూడా చాలా వైవిధ్యంగా, వినూత్నంగా ఉంది. అది ఈ సినిమాకి ప్లస్ పాయింట్. 

ప్రతికూల అంశాలు :

ద్వితీయార్థంలో ఈ సినిమా నత్తనడకన సాగుతుంది. అదే కొంచెం ప్రేక్షకుల సహనానికి కూడా పరీక్ష పెడుతుంది. అలాగే హీరో, హీరోయిన్ల మధ్య వచ్చే ప్రేమ సన్నివేశాలు కూడా కథకు అడ్డం పడ్డాయనే చెప్పవచ్చు. 

ఫైనల్ వర్డ్

కేజీఎఫ్, విక్రాంత్ రోణ లాంటి సినిమాల తర్వాత.. కన్నడ సినీ పరిశ్రమ నుండి వచ్చిన మరో ప్రయోగాత్మక చిత్రం ఈ "కాంతార" (Kantara). ఈ సినిమా కథ పై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఆద్యంతం ఆసక్తిగా సినిమాని తీర్చిదిద్దడంలో దర్శకుడు పాసయ్యాడనే చెప్పుకోవాలి. డిఫరెంట్ జోనర్ సినిమాలను ఇష్టపడేవారికి, ఈ సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది. 

Read More: రేటింగ్స్‌లో నయా రికార్డు.. ‘కేజీఎఫ్’ (KGF), ‘ఆర్ఆర్ఆర్’ (RRR)ను వెనక్కి నెట్టిన ‘కాంతార’ (Kantara) మూవీ

 

Advertisement
Credits: Instagram

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!