Dr D Ramanaidu : డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు జయంతి ( కారంచేడు నుండి ఫిల్మ్ నగర్ వరకూ.. ఓ విజేత ప్రయాణం)
డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు (D. Ramanaidu). సినిమా అంటే ఏంటో పూర్తిగా తెలిసిన వ్యక్తి. చిత్ర నిర్మాణంపై స్పష్టమైన అవగాహన ఉన్న ప్రొడ్యూసర్. నిర్మాతగానే కాకుండా వెండితెరపై కూడా నటించి మెప్పించారు. తన సంపాదనలో ఎక్కువ శాతం సినిమాకే ఖర్చు చేసేవారు. టెక్నాలజీని బట్టి సినిమా.. సినిమాను బట్టి వసూళ్లు.. ఇది రామానాయుడి బిజినెస్ మైండ్.
అందుకే స్టూడియో, కలర్ ల్యాబ్, రికార్డింగ్ థియేటర్, డిస్ట్రిబ్యూషన్, పోస్టర్స్ ప్రింటింగ్, గ్రాఫిక్స్ యూనిట్‌తో సహా, సినిమా నిర్మాణానికి సంబంధించిన అన్ని సదుపాయాలను దర్శకులకు అందించారు. "రామానాయుడు స్టూడియో"ను నిర్మించి 'ఔరా' అనిపించారు. అంతేకాదు, శతాధిక చిత్రాలను నిర్మించి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్ట్ రికార్డు కూడా సొంతం చేసుకున్నారు. రాజకీయాలలోకి వచ్చి, ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ కూడా చేశారు.
సురేష్ ప్రొడక్షన్స్.. ఆయన కలల కుటీరం
(D. Ramanaidu) దగ్గుబాటి రామానాయుడు 1936 జూన్ 6 తేదిన జన్మించారు. ప్రకాశం జిల్లా కారంచేడు రామానాయుడు సొంతూరు. కారంచేడులో 'నమ్మిన బంటు' సినిమా షూటింగ్ జరిగినప్పుడు, బంధువుల మాట విని రామానాయుడు ఓ సన్నివేశంలో నటించారు. ఆ తర్వాత 'అనురాగం' అనే చిత్రాన్ని నిర్మిస్తున్న ఓ ప్రొడ్యూసర్, భాగస్వామ్య నిర్మాత కోసం రామానాయుడిని సంప్రదించారు. తండ్రిని ఒప్పించి 'అనురాగం' చిత్రంలో పెట్టుబడులు పెట్టారు రామానాయుడు. అదే చిత్రం లాభాలు తేవడంతో, చిత్ర నిర్మాణ రంగం పట్ల ఆయనకు ఆసక్తి పెరిగింది. ఆ తర్వాత తన పెద్ద కుమారుడు సురేష్ బాబు పేరిట సురేష్ ప్రొడక్షన్స్ అనే సంస్థను స్థాపించారు.
1964లో రామానాయుడు తన సొంత ప్రొడక్షన్‌లో 'రాముడు-భీముడు' అనే చిత్రాన్ని నిర్మించారు. తొలి చిత్రమే బ్లాక్ బస్టర్ కావడంతో ఆయనకు తిరుగులేకుండా పోయింది. . ఇక అప్పటి నుంచి వరుస విజయాలతో నిర్మాతగా, ప్రపంచ స్థాయిలో పేరు సంపాదించారు. ఆ తర్వాత శోభన్ బాబు హీరోగా రామానాయుడు తెరకెక్కించిన 'సోగ్గాడు' అప్పట్లో సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది.
దర్శకులకు ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని అందించాలనే తపన రామానాయుడికి ఉండేది. అప్పుడే సినిమాకు విలువ ఉంటుందని ఆయన నమ్మేవారు. కానీ ఒకానొక దశలో రామానాయుడిని సైతం నష్టాలనేవి కోలుకోలేని దెబ్బ కొట్టాయి. కానీ 'ప్రేమ్ నగర్' సినిమాతో మళ్లీ సక్సెస్ కొట్టి, పరిశ్రమలో విజేతగా నిలిచారు ఆయన. 1971లో విడుదలైన 'ప్రేమ్ నగర్' సినిమా బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురిపించింది.
దర్శకులకు అండగా నిలిచిన నిర్మాత
సినిమాకు ఎంత బడ్జెట్ అయినా, నిర్మాతగా రామానాయుడు భరించేవారు. ఎందుకంటే రామానాయడు విజన్ ఉన్న నిర్మాత. అందుకనే దర్శకులకు అభిమాన నిర్మాతగా మారారు. దేవత, తాత మనవడు, కలియుగ పాండవులు, అగ్నిపూలు, ప్రేమించుకుందాం రా, అల్లరి, ప్రేమించు, దృశ్యం వంటి ఎన్నో సినిమాలు నిర్మించి రామానాయుడు సక్సెస్ అయ్యారు.
దాదాపు 21 మంది దర్శకులను వెండితెరకు పరిచయం చేశారు. పదుల సంఖ్యలో హీరో, హీరోయిన్లకు అవకాశం కల్పించారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడం, బెంగాలీ, పంజాబీ, మరాఠీ భాషలలో కూడా సినిమాలు నిర్మించారు రామానాయుడు.
ఎన్నో అవార్డులు
ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో సినిమాలను నిర్మించిన ప్రొడ్యూసర్‌గా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో రామానాయుడు చోటు సంపాదించారు. 2013లో దగ్గుబాటి రామానాయుడు (D. Ramanaidu) సినీ రంగానికి చేసిన సేవలను గుర్తిస్తూ, భారత ప్రభుత్వం పద్శ విభూషణ్‌ను ప్రకటించింది. 2010 సెప్టెంబరు 9న మరల భారత ప్రభుత్వం దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారంతో సత్కరించింది.
రామానాయుడు తన సినీ కెరీర్‌లో రెండు జాతీయ అవార్డులు, రెండు ఫిలిమ్ ఫేర్ అవార్డులు అందుకున్నారు. విశాఖపట్నంలో కూడా తన పేరిట ఓ స్టూడియోని నిర్మించారు. కాన్సర్ వ్యాధితో రామానాయుడు 2015 ఫిబ్రవరి 18 న తుది శ్వాస విడిచారు.
ఎంతో మందికి సినిమా లైఫ్ ఇచ్చారు
వై. నాగేశ్వరరావు, కె.మురళీ మోహన్ రావు, బి. గోపాల్, జయంత్ సి. పరాన్జీ, చంద్రమహేష్ వంటి దర్శకులకు అవకాశం కల్పించారు రామానాయుడు. వాణిశ్రీ, టబు, దివ్యవాణి, వెంకటేష్, అంజలా జవేరీ, హరీష్, కరిష్మా కపూర్ వంటి ఎందరో తారలను వెండితెరకి పరిచయం చేశారు.