లక్షలాది రామాలయాలున్నా రామసేతు ఒక్కటే.. ఆసక్తి రేకెత్తిస్తున్న అక్షయ్ (Akshay Kumar) ‘రామ్‌సేతు’ ట్రైలర్!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ (Akshay Kumar) సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ‘సూర్యవంశీ’ చిత్రం తర్వాత ఆయనకు మరో విజయం దక్కలేదు. ‘బచ్చన్ పాండే’, ‘అత్రంగీ రే’ చిత్రాలు అంతగా ఆడలేదు. ఇటీవలే ఓటీటీలో వచ్చిన ‘కట్ పుత్లీ’ వెబ్ సిరీస్ అక్షయ్‌కు కాస్త ఊరటను ఇచ్చిందనే చెప్పాలి. ఈ సిరీస్‌కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. దీన్ని పక్కనబెడితే.. ‘రామ్‌సేతు’ (Ram Setu) సినిమాతో బిగ్ స్క్రీన్స్‌లో ప్రేక్షకులను అలరించేందుకు అక్కీ సిద్ధమవుతున్నారు.
అక్కీ హిట్ కొట్టేనా..?
అక్షయ్ నటించిన ‘రామ్‌సేతు’ ట్రైలర్ మంగళవారం రిలీజైంది. ఈ ట్రైలర్‌లోని యాక్షన్ అడ్వెంచరస్ సన్నివేశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో రాముడు నిర్మించిన రామసేతును కాపాడే క్యారెక్టర్‌లో అక్షయ్ కనిపిస్తున్నారు. రామసేతును నాశనం చేయాలనుకునే శక్తులను ఓ పురావస్తు శాఖ అధికారి ఎలా ఎదుర్కొన్నారనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు అర్థమవుతోంది. ‘ప్రపంచంలో లక్షలాది రామాలయాలు ఉండొచ్చు. కానీ రామసేతు మాత్రం ఒక్కటే ఉంది’ అంటూ ట్రైలర్ చివర్లో అక్షయ్ చెప్పిన డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. మరి, ఈ సినిమాతో ఆయన విజయాల బాట పడతారేమో చూడాలి.
ఇకపోతే, ‘గాడ్‌ఫాదర్’ చిత్రంతో మంచి పేరు సంపాదించిన హీరో సత్యదేవ్ ‘రామ్‌సేతు’ మూవీలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఇందులో అక్షయ్‌కు జోడీగా జాక్వెలిన్ ఫెర్నాండేజ్, నుష్రత్ భారుచ్చా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్.. బడా నిర్మాణ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్‌తో కలసి విక్రమ్ మల్హోత్రా, అరుణ భాటియా సంయుక్తంగా ‘రామ్‌సేతు’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో దీపావళి కానుకగా అక్టోబర్ 25న భారీగా విడుదల చేయనున్నారు.
ఇక, ఆ మధ్య రీమేక్ సినిమాలపై అక్షయ్ కుమార్ చేసిన కామెంట్లు వైరల్‌గా మారాయి. సౌత్ సినిమాలను రీమేక్ చేయడంలో ఇబ్బందులేమిటని ఈ యాక్షన్ స్టార్ ప్రశ్నించారు. ‘నా సినిమాను తెలుగులోకి రీమేక్ చేశారు. అక్కడ హిట్ కొట్టింది. ‘విక్రమార్కుడు’ చిత్రాన్ని ‘రౌడీ రాథోడ్’ పేరుతో మేం నిర్మించాం. ఇక్కడ కూడా భారీ విజయం సాధించింది. సినిమాలను రీమేక్ చేస్తే తప్పేంటి?. బాగుంటే హక్కులు కొనుక్కొని మరీ తీస్తున్నాం. సౌత్, నార్త్ అని విడిపోవడం మంచిది కాదు. ఇలా విడిపోవడాన్ని నేను వ్యతిరేకిస్తాను. సౌత్ ఇండస్ట్రీ, నార్త్ ఇండస్ట్రీ అని ఎవరైనా అంటే నాకు అసహ్యం వేస్తుంది. సినిమా ఇండస్ట్రీ అంతా ఒకటే అని నమ్ముతాను. సౌత్, నార్త్ అనే ప్రశ్నలు అడగడం మానేయాలి. మనమంతా ఒకే ఇండస్ట్రీ అని నమ్మిన రోజునే మరిన్ని మంచి చిత్రాలను నిర్మించగలుగుతాం’ అని అక్షయ్ కుమార్ చెప్పుకొచ్చారు.
Read more: సమంత (Samantha) యాటిట్యూడ్, మాటలకు అక్షయ్ కుమార్ ఫిదా? తన పక్కన నటించే చాన్స్ ఇచ్చేశారా!