పునర్వైభవం కోసం బాలీవుడ్ (Bollywood) ఎదురుచూపులు.. ఆశలన్నీ ఆ ఆరు చిత్రాలపైనే!

Updated on Oct 06, 2022 03:32 PM IST
బాలీవుడ్ (Bollywood) పుంజుకోవాలంటే ‘రామసేతు’, ‘గుడ్ బై’, ‘థ్యాంక్ గాడ్’ లాంటి సినిమాలు తప్పక విజయం సాధించాలి
బాలీవుడ్ (Bollywood) పుంజుకోవాలంటే ‘రామసేతు’, ‘గుడ్ బై’, ‘థ్యాంక్ గాడ్’ లాంటి సినిమాలు తప్పక విజయం సాధించాలి

హిందీ చిత్రపరిశ్రమకు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోందనే చెప్పాలి. బాలీవుడ్‌ (Bollywood)లో బడా హీరోల సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద ఢమాల్ అంటున్నాయి. ‘షంషేరా’, ‘బచ్చన్ పాండే’, ‘పృథ్వీరాజ్ చౌహాన్’ లాంటి భారీ చిత్రాలు ఉత్తరాది ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాయి. ఇటీవలే విడుదలైన ‘బ్రహ్మాస్త్ర’ కూడా ఓ మోస్తరు విజయం సాధించింది. ‘కశ్మీర్ ఫైల్స్’, ‘భూల్ భులయ్యా’ వంటి ఒకట్రెండు సినిమాలను మినహాయిస్తే పెద్దగా హిట్స్ లేవు.  

సౌత్ సినిమాలదే పైచేయి

‘ఆర్ఆర్ఆర్’, ‘కేజీఎఫ్ 2’, ‘కార్తికేయ’ లాంటి సౌత్ సినిమాలు బాలీవుడ్‌లో రికార్డు స్థాయిలో కలెక్షన్లను కొల్లగొట్టాయి. కానీ హిందీ సినిమాలు మాత్రం స్థానిక ఆడియెన్స్‌ను మెప్పించడంలో విఫలమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే మూడు నెలల కాలంలో పలు పెద్ద సినిమాలు హిందీలో రిలీజ్ కానున్నాయి. ఇండస్ట్రీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ఈసారి బిగ్ బీ అమితాబ్‌తోపాటు స్టార్ హీరోలు అజయ్ దేవగణ్, అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ తమ చిత్రాలతో రెడీ అవుతున్నారు.

అమితాబ్ నటించిన ‘గుడ్ బై’ చిత్రం, అజయ్ దేవగణ్, సిద్ధార్థ్ మల్హోత్రా కలసి యాక్ట్ చేసిన ‘థ్యాంక్యూ’.. అక్షయ్ కుమార్ మూవీ ‘రామసేతు’, వరుణ్ ధావన్ యాక్ట్ చేసిన ‘బేడియా’, రణ్‌వీర్ ‘సర్కస్’ సినిమాలు వచ్చే మూడ్నెళ్లలో రిలీజ్ కానున్నాయి. వీటిపై బాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. మరి ఈ సినిమాల విశేషాలేంటో తెలుసుకుందాం.. 

రెండు సినిమాలతో పలకరించనున్న అజయ్ దేవగణ్

బాలీవుడ్‌లో ఖాన్ త్రయం తర్వాత అంత పాపులారిటీ ఉన్న హీరోల్లో అజయ్ దేవగణ్ (Ajay Devgn) ఒకరు. ఈ ఏడాది రన్‌వే 34తో ఆయన ప్రేక్షకుల ముందుకొచ్చారు. కంటెంట్ బాగున్నప్పటికీ థియేటర్లలో ఈ సినిమా పెద్దగా ఆడలేదు. దీంతో ఎలాగైనా మంచి హిట్ కొట్టాలనే కసిమీదున్నారీ స్టార్ హీరో. ఈ ఏడాది ద్వితీయార్థంలో రెండు సినిమాలను రిలీజ్ చేయనున్నారు అజయ్ దేవగణ్. అందులో ఒకటి ‘థ్యాంక్యూ’ కాగా, మరొకటి ‘దృశ్యం 2’. 

‘థ్యాంక్యూ’ చిత్రంలో చిత్రగుప్తుడి పాత్రలో అజయ్ దేవగణ్​ నటించారు. ఈ సినిమాలో యంగ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా యాక్ట్ చేశారు. అక్టోబర్ 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ కూడా నటిస్తున్నారు. ఈ చిత్రంతో పాటు ‘దృశ్యం’ సీక్వెల్‍తోనూ ప్రేక్షకులను పలకరించనున్నారు అజయ్ దేవగణ్. మలయాళ ‘దృశ్యం’ మూవీకి రీమేక్‌గా గతంలో అజయ్ నటించిన హిందీ దృశ్యం హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సీక్వెల్‌పై మంచి అంచనాలు నెలకొన్నాయి.

‘రామసేతు’తో రానున్న అక్షయ్ 

చాన్నాళ్లుగా మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నారు అక్షయ్ కుమార్ (Akshay Kumar). వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న ఈ బిగ్ స్టార్.. ఈసారి ‘రామసేతు’ మూవీతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. రీసెంట్‌గా ఈ చిత్రం టీజర్ రిలీజైంది. ఇందులో అక్షయ్ కుమార్ ‘రామసేతు’ను రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపించారు. సముద్రగర్భంలోకి వెళ్లి, అక్కడ ఓ దీవిని కనుగొనే సీన్స్ టీజర్‌లో కనిపించాయి. అక్షయ్ ఆర్కియాలజిస్ట్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో తెలుగు హీరో సత్యదేవ్ కూడా కీలక రోల్‌లో యాక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ దీపావళికి సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. 

అమితాబ్ అలరించేనా..?

బిగ్ బీ అమితాబ్ ఈ ఏడాది ప్రథమార్థంలో ‘ఝుండ్’ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కానీ ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో ఆయన సెలక్టివ్‌గా సినిమాలను చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన నటించిన ‘గుడ్ బై’ మూవీ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ‘పుష్ప’తో నార్త్ లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఈ మూవీలో నటించడం విశేషం. ఈ మూవీ అక్టోబర్ 7న బిగ్ స్క్రీన్స్‌పై రిలీజ్ కానుంది. ఎవరి మీద ఆధారపడకుండా సొంతకాళ్లపై నిలదొక్కుకోవాలనుకునే క్యారెక్టర్ లో రష్మిక నటించింది. రష్మికకు తండ్రి పాత్రలో అమితాబ్, తల్లి రోల్‌లో నీనా గుప్తా నటించారు. ఎమోషనల్ రోలర్ కోస్టర్‌గా ఈ మూవీ ఉండనున్నట్లు ట్రైలర్‌ను చూస్తే తెలుస్తోంది. 

రణ్‌వీర్ హిట్ కొట్టేనా?

బాలీవుడ్‌లో తక్కువ టైమ్‌లో స్టార్ హీరోగా ఎదిగిన రణ్‌వీర్ సింగ్ కూడా మరో రిలీజ్‌కు రెడీ అవుతున్నారు. వరుస హిట్లతో ఊపుమీదున్న రోహిత్ శెట్టి దర్శకత్వంలో నటిస్తున్న ‘సర్కస్’మూవీతో రణ్‌వీర్ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ కానుంది. వరుసగా ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్న రణ్‌వీర్ కెరీర్ ఈ సినిమాతో గాడిలో పడుతుందేమో చూడాలి. 

యంగ్ హీరో వరుణ్ ధావన్ కూడా ‘బేడియా’ అనే మూవీతో ఆడియెన్స్ మనసులు దోచేందుకు సిద్ధమవుతున్నారు. కృతి సనన్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ ఏడాదితో వరుణ్ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి పదేళ్లు పూర్తవుతున్నాయి. ఈ నేపథ్యంలో బేడియా హిట్‌తో ఆయన మర్చిపోలేని హిట్ కొట్టాలని చూస్తున్నారు. పైన పేర్కొన్న చిత్రాల్లో ఎన్ని మూవీలు ఆడియెన్స్‌ను ఇంప్రెస్ చేస్తాయో చూడాలి. 

Read more: బంపర్‌‌ ఆఫర్‌‌ కొట్టేసిన నేషనల్ క్రష్.. ‘ఆషికీ’ సీక్వెల్‌లో హీరోయిన్‌గా రష్మికా మందాన (Rashmika Mandanna)!

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!