Mrunal Thakur: హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా!.. అలాంటి పాత్రలు చేయొద్దా?: ట్రోలర్స్‌కు మృణాల్ కౌంటర్
ఒకే ఒక్క సినిమాతో తెలుగు ప్రేక్షకులందర్నీ మాయలో పడేశారు మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur). బహుశా ఈ పేరు చెబితే ఎవరూ గుర్తు పట్టకపోవచ్చేమో.. కానీ ‘సీతారామం’ (SitaRamam) హీరోయిన్ అంటే మాత్రం ఠక్కున గుర్తుకు వచ్చేస్తారు. సీత పాత్రలో ఆమె నటనకు, భావోద్వేగాలు పలికిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. అందం, అభినయంతో తొలి చిత్రంతోనే తెలుగువారికి మృణాల్ చేరువయ్యారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను హిందీలో ‘పిప్పా’ (Pippa) అనే సినిమా చేస్తున్నానని.. అందులో హీరో సోదరి పాత్రను పోషిస్తున్నానని తెలిపారు.
‘పిప్పా’లో బాలీవుడ్ యువ నటుడు ఇషాన్ ఖట్టర్ హీరోగా నటిస్తున్నారు. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో తన క్యారెక్టర్ నచ్చడంతోనే నటించడానికి ఓకే చెప్పానని చెప్పారు మృణాల్. అయితే అది తెలిసి కొందరు ఎందుకు ఆ పాత్ర ఒప్పుకున్నావని.. సోదరిగా చేసిన మీరు ఇకపై ఆ కథానాయకుడి పక్కన నటించరా అంటూ తనను సోషల్ మీడియా వేదికగా విమర్శిస్తున్నారని మృణాల్ అన్నారు. ఈ సందర్భంగా ట్రోల్స్ పై అసహనం వ్యక్తం చేసిన ఈ మరాఠీ బ్యూటీ.. హీరోయిన్స్ ఇలాంటి పాత్రలు చేయొద్దా అని ఎదురు ప్రశ్నించారు.
వెంటనే ఓకే చేశా: మృణాల్
‘హీరోయిన్లు.. హీరోయిన్లుగానే చెయ్యాలా? ఇతర పాత్రలు చేస్తే తప్పా? సోదరి, భార్య, తల్లి లాంటి క్యారెక్టర్స్ చేయకూడదా? ఇలాంటి మూస పద్దతిని బ్రేక్ చేసినప్పుడే మనలోని అసలైన సత్తా బయటపడుతుంది. కెరీర్‌లో వెనక్కి తిరిగిచూసుకుంటే.. ఓ గొప్ప పాత్రను వదులుకున్నాననే బాధ ఉండొద్దు. అందుకే ఈ రోల్ నచ్చడంతో సోదరి పాత్ర అయినప్పటికీ వెంటనే ఓకే చేశాను’ అంటూ మృణాల్ ఠాకూర్ ట్రోలర్స్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇక, ‘పిప్పా’ సినిమా బ్రిగేడియర్ మోహతా రాసిన ‘ది బర్నింగ్ చాఫీస్’ అనే పుస్తకం ఆధారంగా రూపొందుతోంది. మరి, ఈ మూవీతో మృణాల్ ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటారో చూడాలి.