తలైవా అభిమానులకు గుడ్ న్యూస్.. ఒకేరోజు రెండు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రజినీకాంత్ (Rajinikanth)
తలైవా రజినీకాంత్ (Rajinikanth) ఆయన ఫ్యాన్స్‌కు భారీ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఆయన చిత్రాల కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు శుభవార్త చెప్పారు. ఒకేరోజు రెండు సినిమాలకు సూపర్ స్టార్ పచ్చజెండా ఊపారు. తద్వారా ఫ్యాన్స్‌కు రజినీ డబుల్ ట్రీట్ ఇచ్చారు. తమిళంలో భారీ సినిమాలు తీస్తూ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థగా పేరు తెచ్చుకున్న లైకా ప్రొడక్షన్స్‌లో ఆయన ఈ రెండు సినిమాలు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూజా కార్యక్రమాలు నవంబర్ 5న చెన్నైలో జరగనున్నట్లు వెల్లడించారు.
రజినీకాంత్ గత చిత్రం ‘అన్నాత్తే’ తమిళంలో భారీ విజయం సాధించింది. తెలుగులో ఓ మోస్తరు హిట్‌గా నిలిచింది. ఈ నేపథ్యంలో తలైవా చేయబోయే తదుపరి ప్రాజెక్టులపై భారీ అంచనాలు నెలకొన్నాయి. లైకా ప్రొడక్షన్స్‌లో ఆయన చేయబోయే సినిమాలకు దర్శకులు ఎవరనే వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటిస్తారని తెలిసింది. ఇందులో ఒక మూవీకి శిబి చక్రవర్తి డైరెక్షన్ చేస్తారని సమాచారం. లైకా సంస్థ అధినేత తమిళకుమారన్.. చైర్మన్ సుభాస్కరన్, బ్యానర్ డిప్యూటీ చైర్మన్ ప్రేమ్ శివసామీతో రజినీకాంత్ ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
రజినీ ప్రస్తుతం ‘జైలర్’ మూవీ షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ మూవీకి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. గత మూవీ ‘బీస్ట్’ పరాజయం పాలవ్వడంతో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని డైరెక్టర్ నెల్సన్ కసి మీద ఉన్నారు. రజినీ చిత్రంతో ఈ అవకాశాన్ని ఆయన ఎలా ఉపయోగించుకుంటారో చూడాలి. ఇక ‘జైలర్’ మూవీని వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కన్నడ బిగ్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఓ ప్రధాన పాత్రను పోషిస్తున్న ‘జైలర్’ చిత్రానికి.. ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచంద్రన్ బాణీలు సమకూర్చుతున్నారు.