Bimbisara Review: టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో ఆసక్తికరంగా సాగిన కల్యాణ్‌రామ్ (Kalyan Ram) ‘బింబిసార’ సినిమా!
సినిమా : బింబిసార
సంగీతం : ఎమ్‌ఎమ్ కీరవాణి
అంశం : సోషియో ఫాంటసీ, యాక్షన్
నిర్మాతలు : ఎన్టీఆర్ ఆర్ట్స్
కథ, దర్శకత్వం: మల్లిడి వశిష్ట్
విడుదల తేదీ : 05 ఆగస్టు 2022
రేటింగ్ : 3 / 5
లక్ష్మీ కళ్యాణం, అతనొక్కడే, హరే రామ్, ఇజం, పటాస్, 118, షేర్, ఎమ్మెల్యే లాంటి సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకున్న నటుడు కళ్యాణ్ రామ్. ఈ మధ్యకాలంలో ఓ సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఆయన.
కల్యాణ్ రామ్ (Kalyan Ram) హీరోగా నటించిన కొత్త సినిమా ‘బింబిసార‘. మొదటిసారిగా ఓ వైవిధ్యమైన కథాంశంతో ఈ సోషియో ఫాంటసీ సినిమాలో నటించారు కల్యాణ్‌రామ్. బింబిసారుడిగా అలనాటి సామ్రాజ్యాధినేత పాత్రలో కనిపించి, సినిమాపై మరింత అంచనాలను పెంచే ప్రయత్నం చేశారు.
ఈ సినిమా ట్రైలర్, టీజర్‌తో పాటు ఫస్ట్ లుక్‌కు విడుదలకు ముందే మంచి క్రేజ్ వచ్చింది. కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కింది 'బింబిసార'. భారీ అంచనాల మధ్య ఈ రోజు అనగా ఆగస్టు 5వ తేదీన విడుదలైన ఈ సినిమా టాక్ ఎలా ఉందో మనమూ ఓసారి పరిశీలిద్దాం ..!
కథ?
బింబిసారుడు... క్రీస్తు పూర్వానికి ఎన్నోసంవత్సరాల క్రితం త్రిగర్తల సామ్రాజ్యాన్ని పరిపాలించిన అధినాయకుడు. ఆ కాలంతో ఈ కాలాన్ని ముడిపెడుతూ.. సమాంతరంగా ఈ సినిమా కథ నడుస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే, రెండు వేరు వేరు టైమ్‌లైన్లలో నడిచే కథతో 'బింబిసార' సినిమా తెరకెక్కింది. బింబిసార అనే గొప్ప చక్రవర్తి తనను తాను దేవుడిగా, రాక్షసుడిగా ప్రకటించుకుంటాడు. ప్రపంచాన్ని జయించాలని యుద్దాలు చేస్తుంటాడు.
ఇదే క్రమంలో అనుకోని ఓ సందర్భంలో కాల యంత్రం ద్వాారా అదే బింబిసారుడు ఆధునిక కాలానికి చేరుకుంటాడు. ఇక్కడే కథ అనేక మలుపులు తిరుగుతుంది. బింబిసారుడి కాలానికి చెందిన ఓ అద్భుత గ్రంథాన్ని హస్తగతం చేసుకోవడానికి కొందరు కుటిల ప్రయత్నాలు చేస్తుంటారు ? మరి ఆధునిక కాలానికి చేరుకున్న బింబిసారుడు వారిని ఎలా తుదముట్టించాడన్నదే చిత్రకథ. రెండు వేరు వేరు టైమ్‌లైన్లలో సాగే కథలు ఒక కీలకమైన పాయింట్ చుట్టూనే తిరుగుతుంటాయి. అదేంటో తెలుసుకోవాలంటే, ఈ సినిమా చూడాల్సిందే.
ఎలా ఉందంటే?
సోషియో ఫాంటసీ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. కల్యాణ్‌రామ్ తాతయ్య, సీనియర్ నటుడు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావుకు ఇలాంటి పాత్రలు కొత్తేమీ కాదు. సోషియో ఫాంటసీ సినిమాలకు ఆయన పెట్టింది పేరు. ఆయన స్ఫూర్తితోనే 'బింబిసార' సినిమాను తెరకెక్కించానని కల్యాణ్‌రామ్ పలు ఇంటర్వ్యూలలో చెప్పారు కూడా.
'బింబిసార' సినిమాలో టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ అనేది నేటి తరానికి కొత్తగా అనిపించే అంశం. అయితే మాములు టైం ట్రావెల్ కాన్సెప్టుతో కాకుండా, సమాంతర ప్రపంచంలో సినిమా కథను నడపడం విశేషం. ఇక్కడ రెండు టైమ్‌లైన్లలో, ఒకదానితో మరొకటి సంబంధం ఉండదు. అయితే దర్శకుడు దానిని ఎలా కనెక్ట్ చేశారు అనేది థియేటర్లలో సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
సాలిడ్ యాక్షన్ సీన్లతో బింబిసారుడి ప్రపంచాన్ని పరిచయం చేస్తూ మొదలవుతుంది సినిమా. బింబిసార ఎంత క్రూరుడు అనే విషయాన్ని చూపించడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. సినిమా ఫస్ట్ ఆఫ్ మొత్తం యాక్షన్ సీన్లు, కల్యాణ్‌రామ్ యాక్టింగ్‌తోనే సాగిపోతుంది.
ఇంటర్వెల్ తర్వాత సినిమా కథ మొత్తం వర్తమాన ప్రపంచంలో సాగుతుంది. బింబిసారుడే స్వయంగా ఆధునిక కాలానికి తగట్టుగా తనను మార్చుకోవడంతో, కథ మరింత ఆసక్తికరంగా మారుతుంది.
ఎవరెవరు ఎలా నటించారంటే?
బింబిసారుడిగా, ఆధునిక యువకుడిగా.. రెండు గెటప్‌లలోనూ నందమూరి కళ్యాణ్ రామ్ అద్భుతంగా నటించారు. ముఖ్యంగా ఇలాంటి ఓ విభిన్నమైన పాత్రను పోషించడం కోసం కల్యాణ్ పడిన శ్రమను ప్రశంసించాల్సిందే. కానీ కథానాయికలకే అసలు స్క్రీన్ స్పేస్ దొరకలేదు. కేథరిన్ త్రెసా సినిమా మొత్తానికి కేవలం పది నిమిషాలు మాత్రమే కనిపిస్తుంది. అలాగే సంయుక్త మీనన్ పాత్రకు కూడా అంత ప్రాధాన్యమేమీ లేదు.
ఇక రాజీవ్ కనకాల చేసింది చిన్న పాత్ర అయినా కథకు బలాన్ని చేకూర్చింది. అలాగే శ్రీనివాసరెడ్డి ఉన్నంతలో కాస్త నవ్వులు పూయించడానికి ప్రయత్నిస్తాడు. బ్రహ్మజీ, చమ్మక్ చంద్ర తమ పాత్రల పరిధి మేరకు అక్కడక్కడ కామెడీ పండించారు.
ముఖ్యంగా హీరో డైలాగ్ డెలివరీ, మాడ్యులేషన్ సినిమా కథకు సరిగ్గా సరిపోయాయని చెప్పవచ్చు. అలాగే కథనాన్ని దర్శకుడు నడిపిన విధానం కూడా బాగుంది. ఇక విశ్వానందన్ వర్మ పాత్రలో ప్రకాష్‌రాజ్ నటన బాగుంటుంది. అయితే సెకండాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. ప్రీ క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ వరకు ఎక్కువగా సెంటిమెంట్ మీదే దర్శకుడు ఆధారపడ్డాడేమో అనిపిస్తుంది. మొత్తానికి ఒక డిఫరెంట్ సబ్జెక్టును సినిమాగా తెరకెక్కించడంలో దర్శకుడు వశిష్ట కాస్త మంచి మార్కులే సాధించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే.. కల్యాణ్‌రామ్ (Kalyan Ram) నటించిన బింబిసార అన్ని వర్గాల ప్రేక్షకులు చూడదగిన సోషియో ఫాంటసీ సినిమా.
Read More : నటనలో అక్షరాభ్యాసం చేసింది బాలకృష్ణ బాబాయ్ : వీడియో రిలీజ్ చేసిన కల్యాణ్‌రామ్ (Kalyan Ram)