Priyanka Jawalkar: నటసింహం బాలకృష్ణకు జోడీగా ప్రియాంక జవాల్కర్?.. విజయ్ హీరోయిన్ ఫేట్ మారేనా..!
టాలీవుడ్లో సొంత భాష హీరోయిన్లు తగ్గిపోతున్నారు. కన్నడ, తమిళ, మళయాళ చిత్రసీమలకు చెందిన కథానాయికలకే ఇక్కడ అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. ముంబై నుంచి కూడా హీరోయిన్లను మనవాళ్లు దిగుమతి చేసుకుంటున్నారు. కానీ తెలుగు అమ్మాయిలకు మాత్రం అంతగా ప్రోత్సాహం లభించడం లేదనేది కాదనలేని వాస్తవం. ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లను చూసుకుంటే ఇది స్పష్టమవుతోంది.
అగ్ర హీరోయిన్లుగా చెప్పుకునే అనుష్క, పూజ హెగ్డే, రష్మిక మందన్న కన్నడ భామలు. ఈ మధ్య వరుస హిట్లు అందుకున్న కృతి శెట్టి కూడా కన్నడిగనే. రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా, తమన్నా, శ్రియ ఉత్తరాదికి చెందిన వారు కాగా.. సమంత, శ్రుతి హాసన్‌ది తమిళనాడు. నిత్యా మీనన్, నయనతార కేరళకు చెందిన వారనేది తెలిసిందే. ఇతర భాషల వారు నటించడంలో తప్పులేదు గానీ.. తెలుగు వారికీ అవకాశాలు ఇవ్వాలనేది సినీ విశ్లేషకులు వాదన. దీన్ని అటుంచితే.. ప్రియాంక జవాల్కర్ గురించి వినే ఉంటారు. అనంతపురంలో పుట్టి పెరిగిన ఈ తెలుగుమ్మాయి.. ‘టాక్సీవాలా’తో టాలీవుడ్‍లో అడుగుపెట్టారు.
‘తిమ్మరుసు’, ‘ఎస్ఆర్ కల్యాణమండపం’ సినిమాలతో ప్రియాంక వరుస విజయాలు అందుకున్నారు. తన అందం, అభినయంతో యువతలో మంచి పాపులారిటీ తెచ్చుకున్నారీ ముద్దుగుమ్మ. అయితే అదే స్థాయిలో జోరును కొనసాగించడంలో ఆమె విఫలమయ్యారు. ఈ తరుణంలో ఆమె ఓ క్రేజీ చాన్స్‌ను దక్కించుకున్నారని తెలుస్తోంది. ఏకంగా నటసింహం బాలకృష్ణ సరసన నటించే అవకాశం ప్రియాంక జవాల్కర్ (Priyanka Jawalkar)కు వరించిందని సమాచారం.
బాలయ్యతో అనిల్ రావిపూడి తీయనున్న సినిమా (NBK 108)లో శ్రీలీల కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇదే చిత్రంలో బాలకృష్ణ (Balakrishna)కు జోడీగా ప్రియాంక జవాల్కర్ సందడి చేయనున్నారని వినికిడి. దీనిపై మూవీ యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. శక్తిమంతమైన యాక్షన్ కథాంశంతో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 8న ప్రారంభమవుతుంది. ఒకవేళ బాలయ్య సరసన ఆఫర్ వస్తే మాత్రం ప్రియాంక ఫేట్ మారినట్లేనని చెప్పొచ్చు.
Read more: Tollywood : థియేటర్లలో ఎక్కువ రోజులు సందడి చేసిన టాలీవుడ్ టాప్10 సినిమాలు