విక్టరీ వెంకటేష్ (Venkatesh) క్లాసికల్ మూవీ ‘నువ్వు నాకు నచ్చావ్’కు 21 ఏళ్లు.. సినిమా గురించిన విషయాలు
విక్టరీ వెంకటేష్ (Venkatesh).. టాలీవుడ్‌లో వివాద రహితుడు.. యాంటీ ఫ్యాన్స్ లేని ఏకైక హీరో. దాదాపు 30 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో హిట్ సినిమాలు చేశారాయన. అభిమానులు అందరూ ఆయనను ముద్దుగా విక్టరీ వెంకటేష్ అని పిలుచుకుంటారు. టాలీవుడ్‌లో ఫ్యామిలీ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ ఎవరంటే అస్సలు ఆలోచించకుండా చెప్పే పేరు వెంకటేష్.
వెంకటేష్ నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో చాలా మందికి గుర్తుండిపోతాయి. అటువంటి సినిమాల్లో నువ్వు నాకు నచ్చావ్ సినిమా కూడా ఒకటి. ప్రేక్షకులకు అంతగా నచ్చిందీ చిత్రం. ఈ క్లాసికల్ సినిమా విడుదలై ఈ రోజుకు 21 సంవత్సరాలు. ఈ సినిమా గురించిన పలు ఆసక్తికర విశేషాలు ప్రత్యేకంగా మీకోసం..
వెంకటేష్ డేట్స్ సెట్ కావడంతో..
‘నువ్వేకావాలి’ అందించిన విజయంతో కె.విజయ్ భాస్కర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ ప్లాన్ చేసిన సినిమా ‘నువ్వు నాకు నచ్చావ్’. స్రవంతి రవికిషోర్ నిర్మాత. కుటుంబ ప్రేక్షకులను అలరించే కథను తరుణ్ హీరోగా తెరకెక్కించాలని ముందుగా అనుకున్నారు. అయితే మంచి కామెడీ టైమింగ్, ఎమోషనల్ సబ్జెక్ట్ కావడంతో మరో హీరోతో ప్రయత్నిద్దామని చిత్ర యూనిట్ నిర్ణయించుకున్నారు. అదే సమయంలో నిర్మాత సురేష్‌బాబు.. స్రవంతి రవికిషోర్‌కు ఫోన్ చేసి వెంకటేష్ డేట్స్ ఉన్నాయని చెప్పారు. దీంతో దర్శకుడు విజయ్ భాస్కర్, రచయిత త్రివిక్రమ్.. వెంకటేష్‌ను కలిసి కథ చెప్పారు. కథ నచ్చడంతో వెంకీ కూడా సినిమా చేయడానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు.
నాజర్‌ను అనుకున్నా..
త్రిష, గజాలాలలో ఒకరిని హీరోయిన్‌గా సెలక్ట్ చేయాలని చిత్ర యూనిట్ అనుకుంది. అయితే అప్పటికే హిందీ సినిమాలో నటించిన ఆర్తి అగర్వాల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారు. ఇక, హీరోయిన్ తండ్రి క్యారెక్టర్‌కు నాజర్‌ను తీసుకోవాలని దర్శకుడు విజయ్ భాస్కర్ సూచించారు. అయితే నిర్మాత మాత్రం ఆ క్యారెక్టర్‌ను ప్రకాష్‌రాజ్‌తో చేయించాలని అనుకున్నారు. అయితే తెలుగు సినిమాల్లో నటించకుండా ప్రకాష్‌రాజ్‌పై నిషేధం ఉంది. దాంతో ప్రకాష్‌రాజ్ లేని సీన్స్‌ను ముందుగా చిత్రీకరించారు. నిషేధం తొలగిన వెంటనే ప్రకాష్‌రాజ్ నువ్వు నాకు నచ్చావ్ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు.
వెంకటేష్ సూచనలతో..
ముందుగా అనుకున్న కథ ప్రకారం.. వాటర్ వరల్డ్‌లో బ్రహ్మానందం క్యారెక్టర్ లేదు. వెంకటేష్ సూచనలతో ఆయన క్యారెక్టర్‌ను యాడ్ చేశారు. ఆ సీన్స్‌కు థియేటర్లలో ప్రేక్షకులు ఎంతగా నవ్వుకున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఎంటర్‌టైనింగ్‌గా ఉండడంతో..
నువ్వు నాకు నచ్చావ్ సినిమా కోసం యాక్టర్స్ ఎంతగా కష్టపడ్డారో.. టెక్నికల్ స్టాఫ్ కూడా అంతకంటే ఎక్కువే కష్టపడ్డారు. దర్శకుడు విజయ్ భాస్కర్ టేకింగ్, త్రివిక్రమ్ డైలాగ్స్ సినిమాను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి. కోటి అందించిన మ్యూజిక్, ఆ సినిమాలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీనే. సినిమా ఎంటర్‌టైనింగ్‌గా ఉంటే మూడు గంటలపాటు ఉన్నా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని చెప్పడానికి ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమానే ఎగ్జాంపుల్.
సెప్టెంబరు 6, 2001లో విడుదలైన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. వెంకటేష్ (Venkatesh) కామెడీ టైమింగ్, ఆర్తి అగర్వాల్ అందం, అభినయం, బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్, ఎమ్మెస్ నారాయణ, సునీల్ డైలాగులు థియేటర్లలో నవ్వులు పూయించాయి.
Read More : Venkatesh-Anudeep KV: F3 తర్వాత 'జాతి రత్నాలు' దర్శకుడితో వెంకటేష్ సినిమా.. పొట్ట చెక్కలయ్యే కామెడీ ఖాయం!