దాస‌రి నారాయ‌ణ రావు (Dasari Narayana Rao) : చిత్రసీమకు కళామతల్లి అందించిన గురువు

Updated on May 04, 2022 08:17 PM IST
తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు(Dr Dasari Narayana rao) . 151 సినిమాల‌కు డైరెక్ట్ చేశారు.
తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు(Dr Dasari Narayana rao) . 151 సినిమాల‌కు డైరెక్ట్ చేశారు.

మెగాఫోన్‌ను ఎలా పట్టుకోవాలో, నేటి దర్శకులు ఆయనను చూసే నేర్చుకోవాలి. దర్శకత్వం అనే కళలో రాణించాలంటే, ఏ డైరెక్టర్ అయినా ఆయన తీసిన చిత్రాలే చూడాలి. తెలుగు సినీ పరిశ్రమకు ఆయన ఓ  విశ్వవిద్యాలయం. ఆయన తీసిన ప్రతీ చిత్రమూ, ఓ పరిశోధక గ్రంథం. ఆయనే మేటి దర్శకుడు డాక్టర్ దాసరి నారాయణరావు

భారతదేశంలో తెలుగు సినిమాల ఖ్యాతిని రెట్టింపు చేసిన ద‌ర్శ‌కుడు డాక్ట‌ర్ దాస‌రి నారాయ‌ణ‌రావు (Dr Dasari Narayana rao). దర్శకత్వంలో మేరునగధీరుడైన దాస‌రి 151 సినిమాల‌కు పైగా దర్శకత్వం వహించారు. క‌ళామతల్లి ముద్దుబిడ్డ‌గా ఎంతో మంది  సినీ క‌ళాకారుల‌కు జీవితాన్నిచ్చారు. వారి ఆశలకు, ఆశయాలకు తాను వెలుగునిచ్చారు.

ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించిన మేటి డైరెక్టరుగా..  గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించిన మ‌హా ద‌ర్శ‌కుడు దాసరి.  24 క్రాఫ్ట్స్‌లో ఆయనది అందె వేసిన చేయి. తాను దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు ఆయనే  కథ, మాటలు, పాటలు, స్క్రీన్ ప్లే  అందించేవారు. అనేక చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. పలు చిత్రాలలో నటుడిగానూ తన విశ్వరూపం చూపారు.ఆ విధంగా ప్రేక్ష‌కుల గుండెల్లో ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్నారు. 

 


 

దాస‌రి నారాయ‌ణ రావు   చిత్రం

తాత‌పై మనవడి ప్రేమను కురిపించి .. అమ్మ‌తో రాజీనామా చేయించి.. అబ‌ద్ధాల‌తో మేడ క‌ట్టించి.. అవ‌తార మెత్తిన లంచాన్ని వ‌ధించి.. లెక్క‌లేన‌న్ని విజ‌యాల్ని వ‌రించి.. లెక్క‌చేయ‌కుండా వివాదాల‌ను ప‌రిష్క‌రించి.. శ‌తాధిక సినిమాల‌తో మెప్పించి.. ప్రేమ‌తో ప్రేక్ష‌కుల‌ను అభిషేకించిన‌ దాస‌రికి ఇదే సినీ అభిమానగణం తరఫున  ఘన నివాళి.

దాస‌రి నారాయ‌ణ రావు గారు ఎప్ప‌టికీ గుర్తుండిపోతారని మంచు విష్ణు ట్వీట్ చేశారు. "అంద‌రికీ గురువు దాస‌రి గారే. దాస‌రి నారాయ‌ణ రావు గారి స్థానాన్ని ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేరు. గురువును కోల్పోవ‌డం చాలా బాధాక‌రం" 

చిరంజీవి త‌న గురువు దాస‌రినారాయ‌ణ రావును గుర్తు చేసుకుంటూ ఓ ట్వీట్ పెట్టారు. దాస‌రి జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా నివాళి అర్పించారు. "దర్శకులందరికి గురువుగారు, పరిశ్రమలో అందరికి  ఆపద్బంధువు" అంటూ దాస‌రిని గుర్తుచేసుకున్నారు. త‌న‌కు మార్గ‌ద‌ర్శి, ఆప్తులు అయ‌న దాస‌రి జ‌న్మ‌దినోత్స‌వం రోజు, ఆయనను స్మ‌రించుకుంటున్నామ‌ని ట్వీట్ చేశారు.దాస‌రి నారాయ‌ణ‌రావు ఎప్పుడూ త‌న గుండెల్లో స‌జీవంగానే ఉంటార‌ని చిరంజీవి ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టారు.

దాస‌రి నారాయ‌ణరావు గారు గురువుగా, కుటుంబ స‌భ్యుడిగా ఎప్పుడూ త‌మ‌తోనే ఉంటార‌ని న‌టి జ‌య‌సుధ ట్వీట్ చేశారు. దాస‌రి జ‌యంతి రోజున ఆయ‌న‌తో ఉన్న జ్ఞాప‌కాల‌ను ఆమె గుర్తుచేసుకున్నారు.

 

దాస‌రి నారాయ‌ణ రావు   & యస్వీ రంగారావు

చ‌దువంటే దాస‌రికి ప్రాణం
దాసరి నారాయణరావు (Dr Dasari Narayana rao)  1942 మే 4న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించారు. హై స్కూల్ రోజుల్లో నాట‌కాలు రాసేవారు. చ‌దువంటే దాస‌రికి ప్రాణం. చిన్న చిన్న ప‌నులు చేస్తూ వ‌చ్చిన డ‌బ్బుల‌తో చ‌దువుకునేవారు. డిగ్రీ పూర్త‌య్యాక చ‌దువును కొన‌సాగిస్తూ ... నాట‌క రంగానికి కూడా సేవ చేశారు . ఆ తర్వాాత  హైదరాబాద్ హెచ్.ఏ.ఎల్. సంస్థ పెట్టిన పరీక్షలో పాసై ఉద్యోగం సంపాదించారు. 

సినిమాల‌ కోసం ఉద్యోగానికి రాజీనామా
హైద‌రాబాద్‌లో ఉద్యోగం చేస్తూ  రవీంద్రభారతిలో నాటకాల వేసేవారు దాసరి. అయితే సినిమాల  మీద ఇష్టంతోనే, ఉద్యోగానికి రాజీనామా చేసి మద్రాసు వెళ్ళారు. పాలగుమ్మి పద్మరాజు పరిచయంతో తొలిసారిగా పరిశ్రమలో రచయితగా అడుగుపెట్టారు. కొత్త ప‌ద ప్ర‌యోగాల‌తో మంచి చమత్కారంతో కూడిన డైలాగ్స్ రాయడం.. దాసరికి వెన్నతో పెట్టిన విద్య.

గూట్లే, డోంగ్రీ వంటి ప‌దాలు దాస‌రి నారాయ‌ణ రావు సృష్టించ‌న‌వే. దాస‌రి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన మొద‌టి సినిమా తాతా మ‌న‌వడు. మొద‌టి  సినిమాతోనే ఆయనకు మంచి హిట్ ల‌భించింది. ఇక న‌ట‌న‌లో కూడా ముందు అడుగులే త‌ప్ప వెనుక‌డుగు వేయ‌లేదు. ఎంతో మంది క‌ళాకారుల‌కు జీవితం ఇచ్చారు. దాస‌రి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన మనుషులంతా ఒక్కటే, సర్కస్ రాముడు, సర్దార్ పాపారాయుడు, విశ్వరూపం, బొబ్బిలిపులి వంటి సినిమాలు వంద రోజుల ఆట‌లు ఆడాయి. తమిళ, కన్నడ, హిందీ భాషల్లోనూ సినిమాలు తీశారు. 

మామగారు, సూరిగాడు, కంటే కూతుర్నే కను.. లాంటి సినిమాలు దాసరిలోని నటనా కోణాన్ని, సరికొత్తగా ప్రేక్షకులకు పరిచయం చేశాయి. ఏ సబ్జెక్టు మీదనైనా విశేష పరిశోధన చేసి, సినిమాలు తీయడం దాసరి ప్రత్యేకత. విప్లవ పంథాలో ఆలోచించి ఒరేయ్ రిక్షా, ఒసేయ్ రాములమ్మ లాంటి సినిమాలు తీసిన దాసరి.. మేఘ సందేశం లాంటి సంగీత ప్రధాన చిత్రాలు కూడా తీశారు.

మేఘ సందేశం చిత్రం ఎన్నో అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.  స్వర్గ్ నరక్, జక్మే షేర్, ప్రేమ్ తపస్య, సర్ఫారోష్, ఆజ్ కా ఎమ్మెల్యే, రామ్ అవతార్, ప్యాసా సావన్, యాద్ గార్, వఫాదార్ లాంటి హిందీ సినిమాలు దాసరికి జాతీయ స్థాయిలో కూడా పేరు, ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి. తన కెరీర్‌లో రెండు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, 16 నంది అవార్డులను దక్కించుకోవడం దర్శకుడు దాసరికే చెల్లింది. 

సినిమా పెద్ద‌ దాస‌రే
దాస‌రి (Dr Dasari Narayana rao)  ఎంతో మందికి జీవితం ఇచ్చారు. క‌ష్టాలొస్తే సినీ కార్మికులకు ఆయన అండ‌గా నిలిచేవారు. సినిమా స‌మ‌స్య‌లైనా, జీవిత స‌మ‌స్య‌లైనా తానే పెద్ద దిక్కుగా ఉండి ఆదుకునేవారు. న‌ట‌నే జీవితం అనుకున్నవారి క‌ష్టాలను తీర్చిన మ‌హోన్న‌త వ్య‌క్తి దాస‌రి నారాయ‌ణ రావు. మాన‌వ‌త్వం ఉన్న వ్య‌క్తిగా దాస‌రి చ‌నిపోయినా కూడా.. క‌ళామత‌ల్లి బిడ్డ‌ల హృద‌యాల‌లో స‌జీవంగానే ఉన్నారు. దాస‌రి త‌మ గురువు గారంటూ, ఇప్పటికీ న‌టీనటులందరూ తలుచుకుంటూనే ఉంటారు. 

Advertisement

టాప్ కామెంట్స్
ఈ ఆర్టికల్‌కు ప్రస్తుతం ఎలాంటి కామెంట్స్ లేవు. మీరే మొదటి కామెంట్ వ్రాయండి!