దగ్గుబాటి రానా (Rana Daggubati) ‘విరాట పర్వం’ సినిమా ముందుగానే రిలీజ్ కానుందా?
దగ్గుబాటి రామానాయుడి మనుమడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు రానా (Rana Daggubati). శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయమై.. అన్ని క్యారెక్టర్లు చేయగలడని నిరూపించుకుంటున్నాడు. హీరోగా, విలన్‌గా చేస్తూనే కథలో తన పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడానికి వెనుకాడడు రానా. పైగా తెలుగుతో పాటు హిందీలో కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాడు.
బాహుబలి సినిమా ద్వారా రానా తన నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నాడు. తాజాగా వచ్చిన భీమ్లానాయక్ సినిమాలోనూ విలన్‌గా నటించాడు. ఇక, రానా నటించిన తాజా చిత్రం ‘విరాటపర్వం’. పోయినేడాది షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదల కరోనా కారణంగా ఆలస్యమైంది. వరుసగా వాయిదాలు పడుతూ వస్తోంది. ఇక, విరాటపర్వం సినిమా థియేటర్లలో కాకుండా.. ఓటీటీలోనే రిలీజ్ అవుతుందని అందరూ అనుకున్నారు. ఆ దిశగా చాలా రోజులు ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ ప్రచారాలన్నింటికీ పుల్‌స్టాప్ పెడుతూ విరాటపర్వం థియేటర్‌లో విడుదలయ్యే తేదీని ప్రకటించింది చిత్ర యూనిట్.
జూలై 1 న విరాటపర్వం సినిమాను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు మేకర్స్. అయితే సినిమా విడుదలపై మరో అప్‌డేట్ అందుతోంది. ఇన్నాళ్లుగా విడుదల తేదీ పోస్ట్ పోన్ అవుతుండగా.. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సినిమాను అనుకున్న తేదీ కంటే ముందుగానే రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే జూన్ 17వ తేదీనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారని ఇండస్ట్రీ టాక్. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఉత్తర తెలంగాణలో 1990లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. రానా (Rana Daggubati) నక్సలైట్ పాత్రలో నటించగా.. సాయిపల్లవి హీరోయిన్‌గా చేసింది.