Telugu Indian Idol : టైటిల్ విజేతగా నిలిచిన వాగ్దేవి.. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రోఫీ ప్రెజంటేషన్ !

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) సందడి చేశారు. మ్యూజిక్ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మొదటి తెలుగు ఇండియన్ ఐడల్ విజేతగా వాగ్దేవి విజయం సాధించింది.
15 వారాల పాటు సాగిన పాటల పోటీలో విన్నర్‌గా గెలిచిన వాగ్దేవి చిరంజీవి చేతుల మీదుగా బహుమతి అందుకుంది. ఫైనల్ ఈవెంట్‌లో విరాట పర్వం హీరో హీరోయిన్లు రానా దగ్గుబాటి, సాయి పల్లవి కూడా సందడి చేశారు.
విజేతను సర్‌ప్రైజ్ చేసిన చిరంజీవి
తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ వాగ్దేవి ట్రోఫీతో పాటు పది లక్షల రూపాయల బహుమతి కూడా పొందారు. ఇదే క్రమంలో, గీతా ఆర్ట్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న సినిమాలో పాడేందుకు వాగ్ధేవికి అవకాశం కల్పించారు. ఇక మొదటి రన్నరప్ శ్రీనివాస్ రూ. 3 లక్షలు, రెండో రన్నరప్ వైష్ణవి రూ. 2 లక్షల ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. చిరంజీవి చేతుల మీదుగా విజేతలకు బహుమతులను అందజేశారు.
చిరంజీవి విన్నర్ వాగ్ధేవికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తెలుగు ఇండియన్ ఐడల్ ఫస్ట్ సీజన్‌లో విజేతగా నిలిచినందుకు తమ సినిమాలో పాట పాడే అవకాశం కల్పించారు. ఇక సెకెండ్ రన్నరప్‌గా నిలిచిన వైష్ణవికి కూడా చిరంజీవి తాను నటించబోయే 'భోళా శంకర్' సినిమాలో పాడే అవకాశం కల్పించారు.
Telugu Indian Idol: ఆహా ఓటీటీ వేదికపై మొట్ట మొదటి సారిగా తెలుగు ఇండియన్ ఐడల్ సింగింగ్ రియాలిటీ షోను తెలుగులో నిర్వహించారు. ఈ సంగీత కార్యక్రమానికి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి శ్రీరామ చంద్ర తన స్టైల్ యాంకరింగ్‌తో వ్యూయర్స్‌ను అలరించారు. ఇక న్యాయనిర్ణేతలుగా తమన్, నిత్య మీనన్, మరియు కార్తీక్ ఎంతో వినోదాన్ని అందించారు.
విన్నర్ అయినందుకు సంతోషంగా ఉంది - వాగ్దేవి
తెలుగు ఇండియన్ ఐడల్ విన్నర్ అవుతానని అసలు ఊహించలేదని వాగ్దేవి అన్నారు. ఎంతో మంది సినీ ప్రముఖుల ముందు పాడటం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎన్నో జ్ఞాపకాలతో పాటు సంగీత జ్ఞానాన్ని కూడా, తాను ఈ షో నుంచి తీసుకెళుతున్నాని చెప్పారు.
తెలుగు ఇండియన్ ఐడల్ నిర్వాహకులతో పాటు, ఆహా ఓటీటీ యాజమాన్యానికి తన కృతజ్ఞతలు తెలిపారు. 'ఆహా' అందరినీ అలరించాలని కోరుకుంటుందని, ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచడమే తమ లక్ష్యమాని ఆ సంస్థ సీఈఓ అజిత్ కె ఠాకూర్ తెలిపారు. కళాకారుల ప్రతిభను ప్రపంచానికి చాటడానికి 'ఆహా' అహర్నిశలు కృషి చేస్తుందన్నారు.
.
